ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2021-10-17T08:43:44+05:30 IST

జిల్లాలోని అతిపెద్ద చెరువులైన పీటీఎం మండల పరిధిలోని పీటీఎం చెరువు, కందుకూరు వ్యాసరాయ చెరువులు నిండిపోయాయి.

ముంచెత్తిన వాన

జిల్లాలోని అతిపెద్ద చెరువులైన పీటీఎం మండల పరిధిలోని పీటీఎం చెరువు, కందుకూరు వ్యాసరాయ చెరువులు నిండిపోయాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ చెరువులు నిండి పారుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు వెళుతున్నారు. 

కుప్పం మండలంలోనూ వర్షాలకు చెరువులు, చెక్‌ డ్యాములు నిండాయి. కేవీపల్లె మండలం గర్నిమిట్ట చెరువు మొరవ పోతోంది.



సోమల, సదుం మండలాల్లో గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె సమీపంలో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. సోమల-నంజంపేట మార్గంలో జీడిరేవుల వంక పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

రామసముద్రం మండలంలో చెరువులన్నీ మొరవ పోతున్నాయి. పెద్దకురప్పల్లెలో శనివారం వాగులు పొంగి పొర్లాయి. వరిపంట నీట మునిగింది. 





పండుగ రోజు విషాదం 

బెంగళూరులో పనిచేస్తున్న సోమల మండలం నంజంపేటకు చెందిన వినోద్‌కుమార్‌ (22) దసరా సెలవులకు గ్రామానికి వచ్చాడు. శుక్రవారం స్నేహితులను కలిసేందుకు తుడుగువారిపల్లెకు వెళ్ళి సాయంత్రం వెనుదిరిగాడు. దళవాయి చెరువు మొరవ దాటే యత్నంలో నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామస్థులు చేపట్టగా మొరవ వాగులోని నీటి మడుగులో యువకుడి మృతదేహం లభ్యమైంది. దీంతో పండుగ రోజు విషాదం నెలకొంది. 


తిరుపతిలో భారీ వర్షం

తిరుపతిలో శనివారం సాయంత్రం సుమారు గంటపాటు కుండపోతగా కురిసిన వర్షంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళం రోడ్డులో బొంతాలమ్మ ఆలయం ప్రాంతంలో రోడ్డుపై భారీగా వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాలన్నీ కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నగరంలోని పలు వీధులు వాగులను తలపించాయి. ఇందిరానగర్‌, మధురానగర్‌, శివజ్యోతినగర్‌, సంజయ్‌ గాంధీ కాలనీ, లక్ష్మీపురం ప్రాంతాలు జలమయమయ్యాయి. కట్టకింద ఊరులో ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఆర్టీసీ బస్టాండు నుంచి తిరుచానూరు మార్గంలో పద్మావతిపురం చేరడానికి, ఇటు కపిలతీర్థం చేరడానికి వాహనదారులకు గంటకుపైగా పట్టింది. తిరుమలలో వర్ష ప్రభావం లేనప్పటికీ రెండో ఘాట్‌ రోడ్డులో మాత్రం మోస్తరుగా కురిసింది.



బడుగులపై పిడుగు 

పలమనేరు పట్టణం బోడిరెడ్డిపల్లెకు చెందిన నేత్రావతి (40) పొలంలో పాడియావును తీసుకొచ్చేందుకు వెళ్లగా.. పిడుగు పడటంతో ఆమె మృతిచెందారు. ఈమె ఐదేళ్ల కుమార్తె షాక్‌గురయ్యారు. వీరి ఆవు చనిపోయింది.  ఫ నగరి మున్సిపాలిటీ సత్రవాడ వద్ద శుక్రవారం తెల్లవారుజామున పిడుగుపాటుకు జయచంద్రకు చెందిన 20 గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ రైతు నష్టపోయారు. 

Updated Date - 2021-10-17T08:43:44+05:30 IST