Abn logo
Sep 20 2021 @ 23:57PM

భారీ వర్షం

చిలప్‌చెడ్‌లో మత్తడి పైనుంచి పారుతున్న నీటి ప్రవాహం

నర్సాపూర్‌ నియోజకవర్గంలో దంచికొట్టిన వాన

చిల్‌పచెడ్‌లో అత్యధికంగా 139.8 మి.మీ.ల వర్షపాతం

పొంగిపొర్లుతున్న వాగులువంకలు

గ్రామాల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

నర్సాపూర్‌లో జలమయమైన కాలనీలు


నర్సాపూర్‌/చిల్‌పచెడ్‌, సెప్టెంబరు 20 : మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండల పరిధిలో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గ్రామాల్లో వీధులు జలమయమయ్యాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతున్నది. పదేహేనేళ్ల అనంతరం చిల్‌పచెడ్‌ గ్రామ శివారులోని మత్తడి పొంగిపొర్లిందని స్థానికులు పేర్కొన్నారు. గౌతాపూర్‌, భద్ర్యా తండాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. గౌతాపూర్‌లో పలు ఇళ్లలో సామగ్రి, నిత్యావసరాలు వరద నీటిలో తడిసిపోయాయి. భారీ వర్షం కురియడంతో పాత ఇళ్లలో నివాసించేవారు ఆందోళన చెందుతున్నారు. మండలవ్యాప్తంగా 139.8 మి.మీ.ల వర్షం కురిసినట్టు ఎంపీఎ్‌సవో వెంకటేశం పేర్కొన్నారు.  


నర్సాపూర్‌లో జలమయమైన కాలనీలు

నర్సాపూర్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ వాగులను తలపించాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. విఘ్నేశ్వర కాలనీలో రోడ్లపై గజం లోతు నీళ్లు ప్రవహించాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేకపోయారు. వర్షం తగ్గిన తరువాత చాలాసేపటి వరకు బయటకు వరద కొనసాగింది. చుట్టుపక్కల కాలనీల వరద తమ కాలనీ గుండా ప్రవహిస్తుండటంతో వర్షం వచ్చిన ప్రతీసారి ఇబ్బందిపడాల్సి వస్తున్నదని కాలనీవాసులు వాపోయారు.