ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-10-01T05:20:44+05:30 IST

రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి పంట పొలాలు నీట మునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ముంచెత్తిన వాన
పిడుగు పడి తాడూరు మండలం తుమ్మలసూగూరులో మృతి చెందిన పశువులు

రెండ్రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

పాలమూరులో ఇళ్లలోకి చేరిన నీరు

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

తెగిన భూత్పూర్‌ మండలం ముత్యాలంపల్లి రోడ్డు

రెండు చోట్ల పిడుగు పాటు

ఊట్కూర్‌ మండలంలో అలుగులు పారిన చెరువులు 

నీట మునిగిన పత్తి పంటలు


 రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి పంట పొలాలు నీట మునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహబూబ్‌నగర్‌ పట్టణాన్ని వరద ముంచెత్తింది. రామయ్యబౌళి, గణే్‌షనగర్‌, శివశక్తినగర్‌, బీకేరెడ్డి కాలనీలు జలమయం అయ్యాయి. పిడుగు పడి తాడూరు మండలంలో రెండు పశువులు, భూత్పూర్‌ మండలంలో రెండు గేదెలు మృతి చెందాయి.

- మహబూబ్‌నగర్‌/జడ్చర్ల/భూత్పూర్‌/ఊట్కూర్‌/కృష్ణ/మక్తల్‌/మక్తల్‌ రూరల్‌/వడ్డేపల్లి


వానొస్తే పాలమూరు వణుకుతోంది. ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల జనం భయపడుతున్నారు. వరద తరువాత బురదను వదిలించుకోవడానికి యాతన పడుతున్నారు. రెండ్రోజులుగా పాలమూరులో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గురువారం 9.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవగా, శుక్రవారం 7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వాన కురుస్తూనే ఉంది. ఎగువన కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆ వరద నీరంతా దిగువన ఉన్న రామయ్యబౌళి, బీకేరెడ్డి కాలనీ, శివశక్తి నగర్‌ను ముంచెత్తుతోంది. ఇళ్ల ముందు నుంచి మోకాళ్ళ లోతు వరద ప్రవహిస్తుండటంతో ఇళ్ళకు, కాలనీలలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రమన్ను గుట్ట వద్ద అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గణేష్‌ నగర్‌ను వరద ముంచెత్తింది. రాయిచూర్‌-మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. 


లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి 

వరద ప్రభావిత ప్రాంతాలైన రామయ్యబౌళి, గణే్‌షనగర్‌, శివశక్తినగర్‌, బీకేరెడ్డి కాలనీలో మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులుతో కలిసి నాలుగు గంటల పాటు పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. వరద పరిస్థితిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వారికి భోజనం అందించారు. పునరావాసం కోసం ఆల్మాస్‌ ఫంక్షన్‌ హాల్‌, పసుల కిష్టారెడ్డి గార్డెన్‌, రామస్వామి ఫార్మసీ కళాశాలను సిద్ధంగా ఉంచామని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కోరారు. నాలాలు కబ్జాకావడం వల్ల వర్షం నీరు, మురుగు నీరు వెళ్లే మార్గం లేకుండా పోయిందన్నారు. పెద్ద చెరువు అలుగు 365 రోజులు పారుతుందని, వర్షం పడితే వచ్చే నీంతా ఇదివరకు కూడా అలుగుల ద్వారా కాలనీల పైనుంచి వెళ్ళేదని అన్నారు. వర్షం అధికంగా కురిసినందున మరింత ఎక్కువగా వరద వస్తోందన్నారు. ప్రజలకు పూర్తిగా అండగా ఉంటామని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా అధికారులను సంప్రదించాలని కోరారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వరద నీటిని మళ్లించేందుకు నిఽధులు మంజూరయ్యాయని, పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రాములు, కౌన్సిలర్లు ఆనంద్‌ కుమార్‌గౌడ్‌, రశ్మితప్రశాంత్‌, రాశీద్‌, సంధ్య, కమిషనర్‌ పద్రీ్‌పకుమార్‌ పాల్గొన్నారు. 


ముందుచూపులేకనే ముంపు: డీకే అరుణ

ముందుచూపు లేకుండా చేస్తున్న పనుల కారణంగానే పాలమూరులోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. లోతట్టు ప్రాంతాలైన బీకేరెడ్డి కాలనీ, శివశక్తినగర్‌లో ఆమె పర్యటించారు. బ్యూటిఫికేషన్‌ పేరుతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వర్షాకాలం ముందు హడావుడిగా చెరువులో పనులు చేపట్టి, చెరువులోకి నీరు రాకుం డా నేరుగా కాలనీలకు మళ్ళించడం వల్లనే కాలనీలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఇందుకు మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ బాధ్యత వహించాలన్నారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, అభివృద్ధి పేరిట ముం దస్తు ప్రణాళిక లేకుం డా పనులు చేపట్టడం సరికాదన్నారు. నష్టపోయిన ప్రతీ కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, కౌన్సిలర్‌ అంజయ్య, పాలమూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ డోకూరు పవన్‌ కుమార్‌రెడ్డి, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, పాండురంగారెడ్డి పాల్గొన్నారు. 


ప్రధాన రహదారిపై వర్షం నీరు

జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తా నుంచి సిగ్నల్‌గడ్డకు వెళ్లే దారిలో ప్రధాన రోడ్డుపై నీరు చెరువును తలపించింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి కాన్వాయ్‌ సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుంది.


తెగిన ముత్యాలంపల్లి రోడ్డు

భూత్పూరు మండలం పోతులమడుగు గ్రామ రోడ్డు వర్షానికి తెగిపోయింది. దాంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కొత్తూరులో వర్షానికి పిడుగు పడి గ్రామానికి చెందిన గొడుగు నాగులు రెండు పాడి గేదెలు మృతి చెందాయి.


నిలిచిన రాకపోకలు

ఊట్కూర్‌: వర్షానికి ఊట్కూర్‌ మండలంలోని పెద్దజట్రం, అవుసులోన్‌పల్లి, బిజ్వార్‌, పులిమామిడి చెరువులు అలుగు పారాయి. నీరు రోడ్డుపై పారడంతో నారాయణపేట నుంచి జక్లేర్‌కు వెళ్లే వాహనాల రాకపోకలు ఐదు గంటల పాటు ఆగిపోయాయి. మల్లెపల్లి, ఎడవెల్లి, చిన్న పొర్ల, పెద్దపొర్ల, గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. 


పిడుగుపాటుకు బిల్డింగ్‌ పైకప్పు ధ్వంసం

మక్తల్‌: మక్తల్‌ పట్టణంలోని పోస్టాఫీ్‌సకు వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌ పైకప్పుపై పిడిగు పడటంతో రేలింగ్‌ ధ్వంసమై కిందపడింది.

మండలంలోని కర్ని పెద్ద చెరువు నిండి అలుగు పారింది. చెరువు సమీపంలో ఉన్న మక్తల్‌-అనుగొండ రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. 

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ మండల కేంద్రంతో పాటు చేగుంట, హిందూపూర్‌, తంగడిగి, కున్సీ తదితర గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై గల గుంతల్లో నీరు నిలిచింది. 


నీట ముగినిన పత్తి పంట

వడ్డేపల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పంటలు నీట మునిగాయి. శాంతినగర్‌, పైపాడు, వడ్డేపల్లి, కలుకుంట్ల, కోయిలదిన్నె, జూలకల్‌ గ్రామాల్లో వాగులు పొంగి పొర్లడంతో పత్తి పొలాలు నీట మునిగాయి. ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.


దుందుభీలో యువకుడు గల్లంతు

నాగర్‌కర్నూల్‌,ఆంధ్రజ్యోతి: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోలెవల్‌ బ్రిడ్జీలు జలమయం కావడంతో దుం దుభీ పరివాహక ప్రాంతాల గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెలకపల్లి మండలం కా ర్వంగ, తాళ్లపల్లి మధ్య యువకుడు గల్లంతు కావడంతో రెస్య్కూ టీమ్‌ను రంగంలోకి దించారు. పిడుగు పాటుకు తాడూరు మండలం తుమ్మలసూగూరులో ఆవు, దూడ మృతి చెందాయి. శుక్రవారం ఉదయం వరకే జిల్లాలోని వంగూరు మండలంలో అత్యధికంగా 72 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తెలకపల్లిలో 64, తాడూరులో 58, ఊర్కొండలో 51, చారకొండలో 39, నాగర్‌కర్నూల్‌లో 31 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, జిల్లా వ్యాప్తంగా 553 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తాడూరు, కల్వకుర్తి, అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. కార్వంగ తాళ్లపల్లి వాగు మధ్యలో కార్వంగకు చెందిన రాఘవేందర్‌(25) గల్లంతయ్యారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దించారు. లోలెవల్‌ బ్రిడ్జీల వద్ద పొంగుతున్న వాగులను పరిశీలించిన అనంతరం తన సమావేశ మందిరంలో కలెక్టర్‌ సమీక్ష చేశారు. దుందుభీ నది పొంగి ప్రవహిస్తున్నందున లోలెవల్‌ బ్రిడ్జీల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ప్రాణహాని కలుగకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల బాగా నాని కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను గుర్తించాలని, అందులో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలు కూడా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలకు ఎవరూ వెళ్లొద్దన్నారు. వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉంటే 08540 230201కు ఫోన్‌ చేసి తెలుపాలన్నారు. 

















Updated Date - 2022-10-01T05:20:44+05:30 IST