హైదరాబాద్ సిటీ: గ్రేటర్ పరిధిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల మధ్యలో కురిసిన వర్షంతో గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల్లో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించినట్లు వాహనదారులు తెలిపారు. మరో నాలుగు రోజులపాటు నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
రోడ్లన్నీ జలమయం
భారీ వర్షానికి ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏఎ్‌సరావునగర్ ప్రధాన రహదారి, రాధికా చౌరస్తా నుంచి జమ్మిగడ్డ రోడ్డులో వరద నీరు పొంగిపొర్లింది. ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకుని వరద నీటిని మ్యాన్‌హోల్స్‌కు మళ్లించారు. కాలనీలు, బస్తీలలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. కాప్రాలోని కాలనీలు, బస్తీలలోని అంతర్గత రహదారుల్లో వర్షపునీరు ఏరులై పారింది. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
జీహెచ్‌ఎంసీ అప్రమత్తం
వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మంగళవారం సాయంత్రం మోస్తరు వర్షపాతం నమోదు కావడంతో క్షేత్రస్థాయికి వెళ్లాలని మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఉన్నతాధికారులు ఆదేశించారు. పలు ఏరియా ల్లో రోడ్లపై నిలిచిన వరద నీటిని బృందాలు తొలగించాయి. ప్రమాదకర ప్రాంతాల వద్ద సిబ్బందిని ఉంచాలని సూచించారు. వర్షాలు పడినప్పుడు ఇబ్బందులుంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 040- 2111 1111కు ఫోన్ చేయాలన్నారు.
ఇదేంతీరు..!
కుత్బుల్లాపూర్ పరిధిలో సూరారం-మెదక్ ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచింది. ఆ నీటిని మళ్లించాల్సిన అధికారులు ట్యాంకర్ ద్వారా తరలించడం చర్చనీయాంశంగా మారింది.