దంచికొట్టిన వాన

ABN , First Publish Date - 2022-06-21T05:30:00+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో

దంచికొట్టిన వాన
చేవెళ్ల : తంగడ్‌పల్లి గ్రామ సమీపంలో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం
  • పొంగిపొర్లిన వాగులు, వంకలు  
  • జలకళను సంతరించుకున్న చెరువులు, కుంటలు
  • పొలాల్లో నిలిచిన వర్షపు నీరు 
  • జలమయమైన రోడ్లు
  • వికారాబాద్‌ జిల్లా కేసారం రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద నీటిలో చిక్కుకున్న పెళ్లి బృందం బస్సు 
  • బస్సులో ఉన్నవారంతా సురక్షితం


రంగారెడ్డి అర్బన్‌ / చేవెళ్ల / వికారా బాద్‌/మేడ్చల్‌, జూన్‌ 21: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. జిల్లాలో ఈసీ, మూసీ నదులు ఉప్పొంగాయి. చెరువులు, కుంటల్లో వర్షపు నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. దుక్కులు దున్ని విత్తులు విత్తేందుకు సిద్ధమైన రైతన్నలు.. పొలం పొనుల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు చోట్ల విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్‌కు అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్‌ పరిధిలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది.  మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలో మంగళవారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. అదేవిధంగా వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండల పరిధిలోని కేసారం వద్ద గల రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి ఓ పెళ్లి బస్సు వర్షం నీటిలో ఇరుక్కుపోయింది. కాగా, బస్సులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. వీరంతా కోట్‌పల్లి మండలం బర్వాద్‌ గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొని తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 


చేవెళ్ల డివిజన్‌లో భారీ వర్షం

చేవెళ్ల డివిజన్‌ పరిధిలోని చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో అన్ని గ్రామాల్లోని పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. అదేవిధంగా వాగులు నిండుగా పారాయి. చేవెళ్ల మండలం తంగడ్‌పల్లి గ్రామం మీదుగా వికారాబాద్‌ వెళ్లే ప్రధానరోడ్డు మధ్యలో నూతనంగా బిడ్ర్జి నిర్మిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం బ్రిడ్జి పక్క తాత్కలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మంగళవారం మరమ్మతు చేసి రోడ్డును పునఃరుద్ధరించారు. వర్షం కురవడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. 


ఉమ్మడి జిల్లాలో వర్షపాతం

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల మాధాపూర్‌లో అత్యధికంగా 10.23సెం.మీ. వర్షపాతం నమోదైంది. చేవెళ్ల మండలం ధర్మాసాగర్‌లో 9.10సెం.మీ., శంకర్‌పల్లి మండలం పొద్దుటూరులో 7.33 సెం.మీ., మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 7.18 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శంకర్‌పల్లిలో 7.13సెం.మీ., శేరిలింగపల్లిలో 6.98సెం.మీ., ఎంఎంటీఎస్‌ ప్రాం తంలో 6.50 సెం.మీ., పీజేఆర్‌ స్టేడియం చం దానగర్‌లో 6.45 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చేవెళ్ల మండలం కందాడలో 5.10 సెం.మీ., షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 4.35 సెం.మీ., మొయినాబాద్‌లో 3.93 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

వికారాబాద్‌ జిల్లా బంట్వారంలో 9.63 సెం.మీ., మోమిన్‌పేటలో 6.63 సెం.మీ., కోట్‌పల్లిలో 5.0 సెం.మీ., మర్పల్లిలో 4.40 సెం.మీ., నాగారంలో 3.65 సెం.మీ., దుద్యాలలో 3.15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

మేడ్చల్‌ జిల్లా డీపీ పల్లిలో అత్యధికంగా 9.43 సెం.మీ., కూకట్‌పల్లి మండలం బాలానగర్‌లో 7.68సెం.మీ., ఫిరోజిగూడలో 7.38సెం.మీ., కుత్బుల్లాపూర్‌ మండలం ఉషోదయ కాలనీలో 7.20 సెం.మీ. వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌, మోడమ్‌ కమ్యూనిటీహాల్‌, రంగారెడ్డినగర్‌, గాయత్రీనగర్‌లో 7.18 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే బీఆర్‌అంబేద్కర్‌ భవన్‌, జీడిమెట్ల ప్రాంతంలో 7.15 సెం.మీ., బాచుపల్లి, మోతీనగర్‌లో 6.80సెం.మీ., షాపూర్‌నగర్‌లో 6.63 సెం.మీ., కూకట్‌పల్లి మండలం సీబీసీఐడీ కాలనీలో 6.05 సెం.మీ., అలపూర్‌ వివేకానంద నగర్‌లో 5.70 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 





Updated Date - 2022-06-21T05:30:00+05:30 IST