రహదారులు జలమయం

ABN , First Publish Date - 2022-06-20T15:52:39+05:30 IST

నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 3.3 సెం.మీ

రహదారులు జలమయం

శేరిలింగంపల్లిలో అత్యధికంగా 3.3 సెం.మీ వర్షపాతం  

మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు


హైదరాబాద్‌ సిటీ: నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 3.3 సెం.మీ, కేపీహెచ్‌బీ 2.3, సరూర్‌నగర్‌ లింగోజిగూడలో 2.3 సెం.మీల వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్‌, మౌలాలి, ఎల్‌బీనగర్‌, గచ్చిబౌలి, చందానగర్‌, నాగోల్‌, రాక్‌టౌన్‌కాలనీ, బహదూర్‌పురా ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు నిలిచిపోయింది. రహదారులు బురదమయంగా మారడంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సెలవు రోజు సాయంత్రం బయటకు వెళ్లాలనుకున్న వారు వర్షంతో ఇళ్లకే పరిమితమయ్యారు. 


తేలికపాటి నుంచి మోస్తరుగా.. 

గ్రేటర్‌లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆకాశం మేఘావృత్తమై ఉంటుందని, గరిష్ఠ - కనిష్ఠ ఉష్ణోగ్రతలు 34-24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలుంటాయని అన్నారు. 


నాగోలులో వరద పరుగు 

మన్సూరాబాద్‌: నాగోలు, బండ్లగూడ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా వర్షం దంచి కొట్టడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నాగోలు జైపురి కాలనీ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతసేపు ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. బ్లైండ్స్‌ కాలనీ వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వరద నీటిని మళ్లించే చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-06-20T15:52:39+05:30 IST