కురిసిన వర్షం

ABN , First Publish Date - 2022-05-27T05:15:37+05:30 IST

నారాయణఖేడ్‌ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

కురిసిన వర్షం
శివ్వంపేటలో కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యం

 తడిసిన ధాన్యం కుప్పలు

 ఎగిరిపడిన ఇళ్ల పైకప్పులు


నారాయణఖేడ్‌, మే 26: నారాయణఖేడ్‌ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని లింగాపూర్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో గాలివాన రావడంతో గ్రామంలోని నాలుగు టన్నుల బరువున్న వేంకటేశ్వర స్వామి రథం దాదాపు 20 మీటర్ల దూరం వరకు కొట్టుకు పోయింది. దాదాపు 20 ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. కాగా రేకులు ఎగిరి తగలడంతో కుమ్మరి బూదవ్వ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మండలంలోని వెంకటాపూర్‌లో గురువారం కురిసిన అకాల వర్షంతో గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని 1,000 బస్తాల ధాన్యం తడిసింది. సేవాలాల్‌ సంఘం నాయకుడు రమేష్‌ చౌహాన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి విషయాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

శివ్వంపేట, మే 26: శివ్వంపేటలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పీఏసీఎస్‌ కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. శివ్వంపేటతో పాటు పలు గ్రామాల్లో కూడా వర్షం పడడంతో కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోయింది. 

గుమ్మడిదల: మండలంలో గురువారం కురిసిన అకాల వర్షంతో కొత్తపల్లి, నల్లవల్లి గుమ్మడిదల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోయింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. గురువారం సంత కావడంతో కూరగాయల వ్యాపారులు, చిరువ్యాపారులు, ప్రజలు ఇబ్బందిపడ్డారు. 


 

Updated Date - 2022-05-27T05:15:37+05:30 IST