జల ఖడ్గం

ABN , First Publish Date - 2020-10-15T16:03:32+05:30 IST

తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చింది.. ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తింది. ఏలూరు నగరాన్ని..

జల ఖడ్గం

జిల్లాను ముంచెత్తిన వరద.. భారీగా పంట నష్టం

ఏలూరును కుదిపేసిన తమ్మిలేరు.. వందలాది మంది సహాయక శిబిరాలకు 

900 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసం.. జనజీవనం అస్తవ్యస్తం


(ఏలూరు - ఆంధ్రజ్యోతి): తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చింది.. ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తింది. ఏలూరు నగరాన్ని గుక్క తిప్పుకోనివ్వకుండా చేసింది. వందలాది ఎకరాలను నీట ముంచింది. ఎర్రకాలువ పలు మండలాల్లో విరుచు కుపడింది. చేతికి వచ్చే దశలోవున్న పంటను సర్వ నాశనం చేసింది. కొండవాగులు విజృంభించాయి. ఎక్కడికక్కడ రాకపోకలను స్తంభించేలా చేశాయి. భారీ వర్షాలు, వరదల తాకిడికి గడిచిన రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. 40 వేలకు పైగా ఎకరాల్లో ఇప్పటికే పంట పూర్తిగా నీట మునిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. మరో రెండు రోజుల్లో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంది. అరటి సర్వనాశనమైంది. ఆక్వా కు నష్టం వాటిల్లింది. కిలోమీటర్ల కొద్దీ రోడ్లు కొట్టుకుపోయాయి. కల్వర్టులకు గండ్లుపడ్డాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 2,400 మందిని సహాయక శిబిరాలకు చేర్చారు. 


రెండు రోజులుగా తమ్మిలేరు ఏలూరు నగ రానికి కంటిమీద కునుకులేకుండా చేసింది. వరద పోటెత్తి నగరంలోకి చొచ్చుకొచ్చింది. అనేక వార్డులను ముంచెత్తింది. 1996లో ఇదే తరహాలో వరద కనిపించగా ఇప్పుడు మరో మారు పునరావృతమైంది. దాదాపు 30 వేల క్యూసెక్కుల వరద నీరు నగరం వైపు దూసు కువచ్చింది. నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు వీలుగా ఏటిగట్లకు గండి కొట్టా రు. ఐదు వేల క్యూసెక్కుల నీటిని మళ్లించా రు. దీంతో పెద్ద ఉపద్రవం తప్పింది. అయి నప్పటికీ ఎగువ నుంచి వచ్చి పడుతున్న తమ్మిలేరు వరదతోపాటు కృష్ణా జిల్లా, పశ్చి మ వైపు నుంచి వాగులు, వంకల నీరు తమ్మి లేరులో కలవడంతో బుధవారం పొద్దుపోయే వరకు అనేక ప్రాంతాల్లోకి వరద నీరు చేరు తూనే ఉంది. వరదనీరు నగరంలోకి రాకుం డా ఏలూరు పడమట లాకుల వద్ద ప్రత్యే కంగా గండికొట్టారు. వరద కారణంగా రూర ల్‌ మండలంలో దాదాపు 10 వేల ఎకరాలు నీటమునిగాయి. బూరాయిగూడెం, లింగా రావుగూడెం వద్ద గండ్లుపడి నీరు పొలాలపై పడింది. నగరంలో సహాయక శిబిరాలను ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంత ప్రజలను అక్క డికి చేర్చారు. పరిస్థితిని కలెక్టర్‌ ముత్యాల రాజు, మంత్రి ఆళ్ళ నాని పరిశీలించారు. 


విరుచుకుపడిన కొండవాగులు

ఎర్రకాలువ సహా మిగతా కొండవాగులు, ప్రధాన డ్రెయిన్లు విరుచుకుపడుతూనే ఉన్నా యి. రెండోరోజు వీటి ఉధృతి కొనసాగింది. పో లవరం ఎగువన కొత్తూరు కాజ్‌వేపై భారీగా నీరు చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని సమీక్షించారు. కొండ వాగుల ప్రవాహం ఉధృతంగా ఉన్న కారణం గా అనేకచోట్ల కల్వర్టులు కుంగినట్లు, మరి కొన్ని కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. గుంజవరం-గార్లగొయ్యి ప్రాంతంలో కల్వర్టుల కు నష్టం వాటిల్లింది. నీరు తగ్గితేగాని రాక పోకలకు సాహసం చేయవద్దంటూ స్థానికు లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎర్రకాలువ పరిధిలో నీటి ఉధృతి కారణంగా భారీగా పంట ముం పునకు గురైంది. నిడదవోలులోనూ నీరు ప్రవే శించి అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాం తాల్లో ఇప్పటికీ నీరు నిలిచే ఉంది. తణుకులో పల్లపు ప్రాంతాలన్నీ పూర్తిగా మునిగాయి. భీమవరంలో కాలనీలన్నీ ఇప్పుటికీ జల దిగ్భంఽ దంలోనే ఉన్నాయి. వీటి నుంచి బయటపడే ప్రయత్నంలో స్థానిక అధికారులు ఇప్పటికే చర్యలకు దిగారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 400 గ్రామాల్లో భారీవర్షాల కారణంగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధా రణకు వచ్చారు. తక్షణ నివేదికలను జిల్లా యంత్రాంగం కోరుతూ మండల అధికారు లను ఆదేశించింది. 


చెరువులకు గండం 

జిల్లావ్యాప్తంగా అనేక చెరువులు ఇప్పటికే నీటితో నిండాయి. కొన్నింటికి ఏ క్షణమైనా గండిపడే అవకాశం లేకపోలేదు. ఈ విష యంలో అధికారులు కాస్తంత ఆందోళనలోనే ఉన్నారు. ముందుజాగ్రత్తగా చెరువులకు గం డ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బుధవారం ఆదేశాలు జారీచేశారు. అనుమా నిత ప్రాంతాలన్నింటిలోనూ ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచు కోవాలని వీలైతే ముందుగానే నింపాలన్నారు.


జాగ్రత్త చర్యలు తీసుకున్నాం: కలెక్టర్‌ ముత్యాలరాజు 

ముందస్తు చర్యలు తీసుకోవడంతో పరి స్థితి నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సీఎం జగన్మోహన్‌రెడ్డికి నివే దించారు. జిల్లాలో తాజా పరిస్థితిని సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆరాతీశారు. ఏలూరులో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. వరదల కారణంగా 900 కిలో మీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని చెప్పా రు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తోడి పోయ డానికి ఇంజన్లను అందుబాటులోకి తెస్తున్న ట్లు చెప్పారు. 25 సహాయక శిబిరాలను ఏర్పాటుచేసి 2,385 మందిని తరలించామ న్నారు. జిల్లాలో 89 గృహాలు దెబ్బతినగా ఇద్దరు మృతి చెందినట్లు వివరించారు. 


తమ్మిలేరుకు తగ్గుతున్న వరద 

చింతలపూడి: తమ్మిలేరు రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం సాయంత్రా నికి ప్రాజెక్టులో 14 వేల క్యూసెక్కుల నీరు చేరగా, 12 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు అధిక స్థాయిలో 24,600 క్యూసెక్కుల నీరు చేరడంతో, 18,600 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. పది గంటలకు 20 వేల క్యూసెక్కులకు తగ్గుముఖం పట్టగా సాయంత్రానికి 14 వేలకు చేరుకుంది. రాత్రి ఏడు గంటలకు 11 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం మూడు టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.5 టీఎంసీలు నిల్వ ఉంది.

Updated Date - 2020-10-15T16:03:32+05:30 IST