వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2020-10-14T17:55:28+05:30 IST

నిశి రాత్రి వేళ.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. వాయు గుండం తీరాన్ని..

వర్ష బీభత్సం

13 గంటలపాటు కుండపోత

పొంగిన వాగులు, వంకలు, కాల్వలు

ఏలూరును చుట్టుముట్టిన తమ్మిలేరు.. ఏటిగట్టుకు గండి

ఎర్రకాలువ ఉగ్రరూపం.. పలు మండలాల్లో తీవ్ర ప్రభావం

తీర ప్రాంతంలో డ్రైన్లు విశ్వరూపం.. భారీగా పంట నష్టం

కొల్లేరు పరీవాహకానికి గండం.. స్తంభించిన జనజీవనం

నీటిలోనే వ్యవసాయ, ఉద్యాన పంటలు.. కోట్లలో నష్టం

గోడ కూలి ఒకరి మృతి.. వరదల్లో చిక్కుకున్న పలువురు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): నిశి రాత్రి వేళ.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. వాయు గుండం తీరాన్ని తాకడానికి కొన్ని గంటల ముందు కుండపోతగా మారి భయోత్పాతాన్ని సృష్టించింది. మంగళవారం తెల్లవారేసరికి వాగులు, వంకలు పొంగాయి. లోతట్టు ప్రాంతాల్లోని నీరు ఇళ్లల్లో చేరింది. రహదారులు, నివాస స్థలాలపై చెట్లు విరుచుకు పడ్డాయి. అనేక మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. పచ్చని పొలాలు జలమయం అయ్యాయి. పట్టణం, పల్లె రహదారులన్నీ నీటితో నిండాయి. ప్రధాన జలాశయా లకు ఉధృతంగా నీరు చేరింది. రికార్డుస్థాయిలో వాటి నుంచి నీరు దిగువకు వదిలేశారు. వాగుల్లో కొట్టుకు పోయిన పలువురు స్థానికుల చొరవతో బయటపడ్డారు.  గోడ కూలి ఒకరు మృతి చెందారు. ఏలూరు నగరంలో తమ్మిలేరు బీభత్సం సృష్టించింది. కొన్నేళ్ల తరువాత ఈ ఉధృతిని తగ్గించేందుకు ఏటిగట్టుకే గండి కొట్టాల్సి వచ్చింది. 

                          

పోటెత్తిన తమ్మిలేరు వరద

చింతలపూడి సమీపంలోని తమ్మిలేరు రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 18 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. మంగళవారం మధ్యాహ్నానికి మూడు గేట్ల ద్వారా 15 వేల క్యూసెక్కులు విడుదల చేయగా దిగువున వున్న వాగులు, వంకలు తోడవడంతో మరో 10 వేలకు పైగా క్యూసెక్కుల అదనపు నీరు లింగపాలెం, చింతలపూడి మార్గాల్లో కలిసి ఏలూరు వైపు దూసుకు వచ్చింది. శనివారపుపేట కాజ్‌వే, సీఆర్‌ రెడ్డి కాజ్‌వేలో సాయంత్రానికి 15 అడుగుల మేర వరద నీరు చేరింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తమ్మిలేరు గేట్లు అన్నింటిని ఎత్తివేసి వరద నీటిని దిగువకు పంపేందుకు చర్యలు తీసుకున్న క్షణంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమై ఏలూరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమక్షంలో అధికారులు సమావేశం అయ్యారు. దశాబ్దం తరువాత ఏటిగట్టుకు ఎస్‌ఎంఆర్‌ నగర్‌ వద్ద సాయంత్రానికి గండి కొట్టారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్‌, డిపో తమ్మిలేరు గట్టు పరివాహక ప్రాంతం లోకి వరద నీరు చేరింది. కొద్ది మందిని తాత్కాలికంగా తరలించారు. ఈ మధ్య కాలంలో తమ్మిలేరు పోటెత్తడం గడిచిన ఐదు మాసాల్లో ఇది మూడోసారి. అన్ని చోట్ల పోలీస్‌ పహరా ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదం లేకుండా చూస్తు న్నారు. రాత్రి పది గంటల సమయంలో వరద నీరు రావడంతో లంకపేట, రాణీనగర్‌, అమీనాపేట ఏటిగట్టు, మాదేపల్లి, లింగారావుగూడెం ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


ఎర్ర కాల్వ ఉగ్రరూపం

మరోవైపు ఎర్రకాల్వ ఉగ్రరూపం ప్రదర్శించింది. జంగారెడ్డిగూడెం సమీపంలోని రిజర్వాయర్‌ నుంచి భారీ ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ దెబ్బతో నల్లజర్ల, దేవరపల్లి, తాడేపల్లిగూడెం రూరల్‌, నిడదవోలు వంటి ప్రాంతాల్లో వరద ఉధృతి పొలాలను తాకింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద వరద నీరు జాతీయ రహదారిని తాకింది. తాడేపల్లిగూడెం మండలంలో ఎర్రకాలువ ఉధృతి పెరిగి ఇంతకు ముందే కొంత భాగం కొట్టుకుపోయినా కల్వర్టు మిగిలిన భాగం కాస్త తాజా వరద తాకిడికి చెల్లా చెదురైంది. వందలాది ఎకరాల్లో పంట ఇప్పటికే ధ్వంసమైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నందమూరు అక్విడెక్టు వద్ద నీటి మట్టం సాయత్రం ఆరు గంటలకు నీటిమట్టం 32.5 అడుగులకు చేరింది. కొంగువారిగూడెం ప్రాజెక్టు వద్ద నుంచి గంటకు 22,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతపల్లి బ్రిడ్జి వద్ద ఎర్రకాలువ మంగళవారం సాయంత్రం 4.85 మీటర్లు ఎత్తులో మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది.


వాగులు.. వంకలు.. డ్రెయిన్లు

ప్రధాన జలాశయాలతోపాటు వాగులు, వంకలు భీకరరూపం దాల్చాయి. బుట్టాయిగూడెం మండలంలో జల్లేరు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలి వేయడంతో అనేక కొండ వాగుల్లో మరింత ఉధృతి పెరిగింది. పోలవరం మండలం కొవ్వాడ అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్‌కు భారీ వరద చేరి అక్కడ నుంచి గోదావరిలో కలుస్తోంది. ఏడేళ్లలో ఇంత పెద్ద ఎత్తున వరద నీరు ఈ స్లూయిజ్‌ మీదుగా గోదావరిలో కలవడం దాదాపు ఇదే ప్రథమం. ఏజెన్సీలోని మరికొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. డెల్టాలోని గోస్తనీ, యనమదుర్రు, గొంతేరు, ఉప్పుటేరు, బొండాడ, మొగదిండి వంటి డ్రెయిన్లు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఓ వైపు సముద్రం నుంచి నీరు ఎగతన్నడంతో ఉప్పుటేరు నుంచి దిగువకు నీరు చేరే మార్గం లేక డ్రెయిన్లలోని నీరంతా పొలాల మీదకు విస్తరిస్తోంది. ఈ కారణంగా పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల్లోకి నీరు చేరుతోంది. 


కొల్లేరు పరీవాహ కానికి ముప్పు

రామిలేరు, బుడమేరు, గుండేరు, తమ్మిలేరు నుంచి భారీగా వరద నీరు కొల్లేరు సరస్సులోకి కలుస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో కొల్లేరు పరివాహంలోని చేలల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ కారణంగా ఆయా గ్రామాలన్నీ విలవిల్లాడుతున్నాయి. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఉప్పుటేరు నుంచి నీరు దిగువకు చేరకపోవడంతో వరద నీరు కాస్త మరింత ఎగదన్ని పంట పొలాల్లోకి చేరే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొల్లేరులో అనధికారికంగా వున్న చేపల చెరువులు తాజా పరిస్థితికి కారణమవుతున్నాయి. నిడమర్రు, ఆకివీడు, గణపవరం, ఏలూరు రూరల్‌, దెందులూరు, పెదపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలకు ముంపు పొంచి ఉంది. కొన్ని గ్రామాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. 


ముంపులో ముంపు

ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడును వరద మరోసారి ముంచెత్తింది. ఇప్పటికే కుక్కునూరు మండలంలో గుండేటి వాగులో భారీగా వరద ప్రవహిస్తుండడంతో అప్రోచ్‌లకు గండి పడింది. వేలేరుపాడుకు సమీపం లోని పెదవాగు విశ్వరూపం దాల్చింది. ఈ మార్గాలన్నింటిలోనూ రాకపోకలు నిలిచిపోయాయి. చింతలపూడి మండలం సీతానగరంలో చెరువుకు గండి పడడంతో ఇళ్లల్లోకి నీరు చేరింది. దేవరపల్లి త్యాగంపూడిలోనూ ఇదే పరిస్థితి.  పెదవేగి, ఉండ్రాజవరం, చింతలపూడి మండలాల్లో చెరువులకు గండ్లు పడకుండా స్థానికులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం వద్ద వరద నీరు రోడ్డుపైకి చేరి బీభత్సం సృష్టించింది. నర్సాపురంలో ఆక్వా చెరువులు నీట మునగడంతో భారీఎత్తున నష్టం వాటిల్లింది. తాడేపల్లిగూడెం, భీమవరం, పాల కొల్లు, నర్సాపురం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. 


నేలకూలిన 100 విద్యుత్‌ స్తంభాలు

ఈదురుగాలులు, వర్షాలకు విద్యుత్‌ శాఖకు రూ.10 లక్షలు నష్టం వాటిల్లిందని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ జనార్దనరావు తెలిపారు. వేలేరుపాడు, కుక్కునూరు, ధర్భగూడెం, టి.నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, నరసాపురం, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడ్డాయి. తిరిగి వాటిని పునరుద్ధరించాం. ఈదురు గాలులకు 100 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయన్నారు.  



Updated Date - 2020-10-14T17:55:28+05:30 IST