ఇదేమి నగరం..!?

ABN , First Publish Date - 2021-06-10T05:06:05+05:30 IST

మోస్తరు కంటే కాస్త అధికంగా కురిసిన వర్షానికే వరంగల్‌ నగరం సగం నీట మునిగింది. నాలాలు వరద నీటితో నిండాయి. కాలనీలు, వీధులు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీళ్లు వచ్చేశాయి. ముంపు ప్రాంతాలు, మురికివాడలు జల దిగ్బంధమయ్యాయి.

ఇదేమి నగరం..!?
కాకాజీ కాలనీలో ప్రవహిస్తున్న వర్షం నీరు

ఒక్కపూట వర్షానికే నగరం ఆగమాగం
పలు కాలనీలు జలమయం
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు
కుంటలుగా మారిన ప్రధాన రహదారులు
వరద నీటిలో బస్‌ స్టేషన్లు
మత్తడి పోసిన వడ్డెపల్లి చెరువు
ముంపు ప్రాంతాల ప్రజల ఇక్కట్లు
జూన్‌ వచ్చినా ముందస్తు చర్యలు కరువు
బల్దియా నిర్లక్ష్యం.. నగర వాసులకు శాపం


వరంగల్‌ సిటీ, జూన్‌ 9 : మోస్తరు కంటే కాస్త అధికంగా కురిసిన వర్షానికే వరంగల్‌ నగరం సగం నీట మునిగింది. నాలాలు వరద నీటితో నిండాయి. కాలనీలు, వీధులు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీళ్లు వచ్చేశాయి. ముంపు ప్రాంతాలు, మురికివాడలు జల దిగ్బంధమయ్యాయి. ఈ పాటి వర్షానికే నగర పరిస్థితి ఇలా ఉంటే.. ఇక జోరు వర్షం పడితే ఎలా అనే ఆలోచన ప్రజల మదిలో ఆందోళన రేకిస్తోంది. కిందటేడు ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు నగరం మునిగింది.  ఐదేళ్ల కిందట కూడా నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరవాసులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డ సంఘటనలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందేమోనని జనంలో భయాందోళన కలుగుతోంది.

వరంగల్‌ నగరంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 10గంటల వరకు వర్షం కురిసింది. దీంతో నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. జీడబ్ల్యూఎంసీ, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని నగరవాసులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం సమీపించినా ముందస్తు ప్రణాళికలు, చర్యలు చేపట్టడంలో జీడబ్ల్యూఎంసీ నిర్లక్ష్యం ప్రదర్శించింది. నాలాలు, ప్రధాన కాలువలు, డ్రెయినేజీల పూడికతీత పనులు చేపట్టలేదు. ఎక్కడో కొన్ని చోట్ల అంతంత మాత్రంగా పనులను చేపట్టి చేశామని చెప్పుకొచ్చారు.

జలమయమైన కాలనీలు
వర్షంతో నగరంలోని 84కు పైగా కాలనీలు జలమయం అయ్యాయి. వీధులన్నీ వరద నీటితో నిండాయి. కాలనీ రోడ్లు మాత్రమే కాదు.. నగరంలోని హన్మకొండ చౌరస్తా, కొత్త బస్‌స్టేషన్‌ రోడ్డు, బాలసముద్రం, వరంగల్‌ చౌరస్తా రోడ్డు, దేశాయిపేట రోడ్డు, ఆటోనగర్‌, కాజీపేట నిట్‌ ప్రాంతం, కాజీపేట జంక్షన్‌ రోడ్డు, నయీంనగర్‌, ములుగురోడ్డు తదితర ప్రాంతాలు, జాతీయ రహదారులు వర్షం నీటితో కుంటలుగా మారాయి. హన్మకొండ కొత్త బస్‌స్టేషన్‌, వరంగల్‌ బస్‌స్టేషన్‌లు నీటిమయమయ్యాయి. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌,  వివేకానందనగర్‌, సాయిగణేష్‌ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్‌, గిరిప్రసాద్‌నగర్‌, గాంఽధీనగర్‌, మైసయ్యనగర్‌, డీకే నగర్‌, సాకరాశికుంట, ఏకశిలనగర్‌, విద్యానగర్‌, వాంటే కాలనీలు,  భద్రకాళినగర్‌, పోతననగర్‌, బృందావన్‌ కాలనీ, ఎన్‌టీఆర్‌ నగర్‌, నజరేతుపురం, హన్మకొండలోని రాజాజీనగర్‌, సమ్మయ్యనగర్‌, వాజ్‌పేయికాలనీ, విద్యానగర్‌, పోచమ్మకుంట, ఇంద్రానగర్‌, దీన్‌దయాళ్‌నగర్‌, కాజీపేట ప్రశాంత్‌నగర్‌, బ్యాంక్‌ కాలనీ, సోమిడీ తదితర ప్రాంతాలు వర్షం నీటిలో చిక్కుకున్నాయి. వడ్డెపల్లి చెరువు మత్తడి పోసింది. చేపలు పట్టేందుకు ప్రజలు అధిక సంఖ్యలో చెరువు వద్దకు చేరారు. నగరంలోని నాలుగు ప్రధాన నాలాలు బొందివాగు, భద్రకాళి, సాకరాశికుంట, నయీంనగర్‌ నాలాల వెంట ఉన్న ప్రాంతాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమన్నారు. వర్షం ఆగిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.  

నాలాల తీరు..

నగరంలోని నాలుగు ప్రధాన నాలాలు సాకరాశికుంట, భద్రకాళి, బొందివాగు, నయీంనగర్‌ నాలాల వెంట ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపునకు బ్రేకులు పడ్డాయి. గత సంవత్సరం నగర పర్యటనలో మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంఽధీ హన్మంతు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. కొని నిర్మాణాలు తొలగించి నిలిపివేశారు. న్యాయస్థానంలో కేసులు ఉన్నాయనే సాకుతో రాజకీయ ఒత్తిళ్లతో ఆగిన కూల్చివేతలను కూడా కలిపి అధికారులు చేతులు దులిపేసుకున్నారు.

రిటెయినింగ్‌ వాల్స్‌
నగరంలో నాలుగు ప్రధాన రహదారులను ఆక్రమించి ఉన్న నిర్మాణాలను తొలగించడంతో పాటు ఇరువైపులా రిటెయినింగ్‌ వాల్స్‌ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయాలు ఐదేళ్ల కిందటే జరిగాయి. గత సంవత్సరం వరదల ఉధృతి, మంత్రి కేటీఆర్‌ పర్యటనతో మళ్లీ ఈఅంశం తెరపైకి వచ్చింది. అయితే వాల్స్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొంది. వడ్డెపల్లి చెరువు నుంచి ఉన్న నాలాకు అమరావతినగర్‌ బ్రిడ్జి వద్ద జీడబ్ల్యూఎంసీ రూ.50 లక్షలతో కొంత ప్రాంతం వరకు నాలాకు  రిటెయినింగ్‌ వాల్స్‌ నిర్మించింది. ఆ తరువాత రెండో దశలో భాగంగా రూ.2 కోట్లతో కుడా చేపట్టాల్సిన పనులు సాగడం లేదు. నాలుగు నాలాలకు వాల్స్‌ నిర్మాణం జరిగే వరకు మరెన్ని సంవత్సరాలు పట్టాల్సి వస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముందస్తు చర్యలేవీ..
ప్రతీయేటా వర్షాకాలానికి ముందుస్తుగానే జీడబ్ల్యూఎంసీ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రణాళికల రూపకల్పన, నిధుల కేటాయింపులతో వర్షంతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. మే మాసంలోనే పనులు చేపట్టాల్సి ఉండగా, జూన్‌ రెండో వారం వచ్చినా నాలాలు, ప్రధాన కాలువలు, డ్రెయినేజీలలో పూడికతీత పనులు చేపట్టడం లేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముంపు ప్రాంతాల్లో చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు.

సీజనల్‌ వ్యాధులు..

వర్షంతో నగరం జలమయం కావడంతో ప్రజల్లో సీజనల్‌ వ్యాధుల భయం పట్టుకుంది. అసలే కరోనా సమస్యకు తోడు సీజనల్‌ వ్యాధులు తోడైతే ఎలా అనే ఆందోళన నెలకొంది. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఆశించిన మేరకు జీడబ్ల్యూఎంసీ చర్యలు తీసుకోలేదు. దోమల నివారణ చర్యలు లేవు. ఫాగింగ్‌ జరగడం లేదు. నగరంలోని 66 డివిజన్లలో డ్రెయినేజీల పూడికతీత పనులు సాగడం లేదు. పరిశుభ్రత చర్యలను విస్మరించారు.















కాలనీల్లో వరద నీటిని తొలగించండి
మేయర్‌ గుండు సుధారాణి
పలు కాలనీల్లో పర్యటన


వరంగల్‌ టౌన్‌, జూన్‌ 9: లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద నీటిని వెంటనే తొలగించాలని మేయర్‌ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నగరంలోని 14వ డివిజన్‌ సాయిగణేశ్‌ కాలనీలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరద నీరు చేరి కాలనీ జలమయమైంది. మేయర్‌ సుధారాణి స్థానిక కార్పొరేటర్‌ తూర్పాటి సులోచనసారయ్యతో కలిసి సాయిగణేష్‌ కాలనీ, ఎస్‌ఆర్‌నగర్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ సుధారాణి మాట్లాడుతూ.. భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయన్నారు. జేసీబీలతో వరద నీరు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించామన్నారు. ఎస్‌ఈ, ఈఈ, డీఈల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో డ్రైన్‌ల డిస్టిలేషన్‌ జరుగుతుందన్నారు. ఎన్‌టీఆర్‌నగర్‌కు వరద ముప్పు రాకుండా భద్రకాళి బండ్‌ పక్కన గల డ్రైన్‌లో పూడిక తీయించి నిల్వ ఉన్న నీటిని తరలిస్తామన్నారు. కాలనీలో రోడ్లు, డ్రెయినేజీలు పూర్తి స్థాయిలో నిర్మించి వరదనీటి ముప్పు నుంచి తప్పిస్తామని హామీ ఇచ్చారు.  ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ శ్రీనివా్‌సరావు, డీఈలు సంజ య్‌, రవీందర్‌, ఏఈలు కార్తీక్‌, క్రిష్ణమూర్తి, భాస్కర్‌, నాయకులు కేతిరి రాజశేఖర్‌,  పసులాది మల్లయ్య పాల్గొన్నారు.

సహాయక చర్యలకు హెల్ప్‌డెస్క్‌
వరంగల్‌ సిటీ, జూన్‌ 9: వర్ష సహాయక చర్యల కోసం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్‌డె్‌స్కను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాలతో పాటు వర్షం వల్ల సమస్యలు ఎదురైతే సహాయక చర్యలు అందించేందుకు టోల్‌ ఫ్రీ నెంబరు 97019 99645, 1800 425 1980, వాట్సాప్‌ నెంబర్‌ 79971 00300 ప్రకటించారు. 24గంటల పాటు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. టోల్‌ ఫ్రీ నెంబర్‌, వాట్సాప్‌ నెంబర్‌కు వచ్చిన సమస్యలపై జీడబ్ల్యూఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ సభ్యులు సహాయక చర్యలను చేపడతారు. వర్షం కారణంగా తలెత్తే సమస్యలు, పరిష్కార చర్యల కోసం కమిషనర్‌ పమేలా సత్పతి 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  ప్రజారోగ్యం, ఇంజనీరింగ్‌ అధికారులతో ఏర్పాటైన ఫోర్సు సహాయక చర్యలు, ముంపు ప్రాంతాల పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతాయి. కాగా, మరో నాలుగు రోజుల పాటు వర్షం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కమిషనర్‌ పమేలా సత్పతి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు పునరావస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-06-10T05:06:05+05:30 IST