Abn logo
Sep 21 2021 @ 01:02AM

వి.కోటలో కుంభవృష్టి

మొరవ పోతున్న కుమ్మరమడుగు చెరువు

కర్ణాటక నుంచి భారీ వరద

పరవళ్ళు తొక్కుతున్న వంకలు, చెరువులు

నీటమునిగిన పంట పొలాలు

హంద్రీ-నీవా కాలువ తెగి వెంకటేపల్లె జల దిగ్బంధం


వి.కోట, సెప్టెంబరు 20: వి.కోట మండల పరిధిలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి చెరువులన్నీ నిండుకుండలా మారాయి.ఆదివారం మండల పరిధిలో 90.4మి.మీ వర్షం కురిసినట్లు తహసీల్దార్‌ రవి తెలిపారు.సోమవారం సాయంత్రం రెండు గంటల పాటు నిరాటంకంగా వర్షం కురియడంతో కర్ణాటక నుంచి వరద భారీగా పొటెత్తింది. దీంతో మావత్తూరు, పచ్చార మాకులపల్లె, ఎగువపల్లె, శ్రీకారల్లపల్లె, కుమ్మరమడుగు, తోటకనుమ, చిన్నశ్యామ, నాగిరెడ్డిపల్లె చెరువులన్నీ  నిండాయి. కుమ్మరమడుగు చెరువు నిండిపోయి మొరవ వుధ్రుతంగా పారడంతో దిగువనున్న పొలాలు నీటమునిగాయి. వరి, అరటి, బంగాళదుంప, టమోటా, బొప్పాయి, వేరుశనగ పంటలన్నీ దెబ్బతిన్నాయి.  దానమయ్యగారిపల్లె, మద్దిరాళ్ళ, కృష్ణాపురం ప్రాంతాల్లో కురిసిన వర్షం దాటికి కుమ్మరమడుగు వద్ద రోడ్డుపై  భారీఎత్తున నీరు ప్రవహిస్తోంది.పలమనేరు-వి.కోట ప్రధాన రహదారిపై వరద నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలకు అంతరాయం నెలకొంది. రాత్రి 6 గంటల నుంచి ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఈ వరద నీరు దిగువనున్న హంద్రీ-నీవా కాల్వలోకి ప్రవేశించింది.ఆ ధాటికి కాల్వ తెగడంతో వెంకటేపల్లె జలదిగ్బంధంలో చిక్కుకుంది.వెంకటేపల్లె చెరువు మొరవ పారడంతో గ్రామానికి రెండు వైపులా నీటి ప్రవాహంతో పల్లెలోకి వెళ్ళేందుకు వీలుపడలేదు. తహసీల్దార్‌ రవి, సీఐ ప్రసాద్‌బాబు, ఇరిగేషన్‌ అధికారులు కుమ్మరమడుగు, వెంకటేపల్లె గ్రామాల వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.చెరువుల కింద ఉన్న గ్రామస్తులను అప్రమత్తం చేశారు.రాత్రి  జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు దగ్గరుండి రోడ్డు దాటించే ప్రయత్నం చేశారు.


24 మండలాల్లో వర్షం 

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 20 : జిల్లాలో గడిచిన 24 గంటల్లో 24 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా వి.కోట మండలంలో 90.4 మి.మీ, అత్యల్పంగా యాదమరిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. కుప్పంలో 55 మి.మీ, పెద్దపంజాణిలో 53.2, గుడిపాలలో 50.2, శాంతిపురంలో 44.4, చిత్తూరులో 40, బంగారుపాళ్యంలో 38.4, జీడీ నెల్లూరులో 37.4 బైరెడ్డిపల్లెలో 37.2 గుడుపల్లె, రామకుప్పంలో 36.8, పాలసముద్రంలో 24.2, పూతలపట్టులో 23.6, గంగవరంలో 18.6, పుంగనూరులో 15.2, పెనుమూరులో 12.4, పలమనేరులో 10.6, ఏర్పేడులో 7.2, బీఎన్‌ కండ్రిగలో 5.8, తవణంపల్లెలో 5.6, మదనపల్లెలో 4.2, చౌడేపల్లెలో 3, ఎస్‌ఆర్‌పురంలో 2.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 

చెరువుల మొరవతో నీట మునిగిన వరిపైరు