కుండపోత... గుండెకోత

ABN , First Publish Date - 2020-10-15T07:15:35+05:30 IST

భారీ వర్షాలు రంగారెడ్డిజిల్లాను అతలాకుతలం చేశాయి. మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టి కారణంగా

కుండపోత... గుండెకోత

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం 

వర్ష బీభత్సానికి ఎనిమిది మంది బలి 

మరో నలుగురు గల్లంతు  

నీట మునిగిన పంటలు, కాలనీలు 

రంగారెడ్డి జిల్లాలో 25వేలు, మేడ్చల్‌ జిల్లాలో 1,745, వికారాబాద్‌ లక్ష ఎకరాల్లో పంట నష్టం 

ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారిలో వరద నీరు

హిమాయత్‌సాగర్‌ 14 గేట్లు ఎత్తివేత 

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు


అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు అతలాకుతల మయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. ఎక్కడి నుంచి  ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియక  ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లలోకి చేరిన నీటితో నరకయాతన పడ్డారు. కాలనీలు కుంటలను తలపిం చాయి. పంటలు నీటమునిగాయి,  రోడ్డు, బ్రిడ్జీలు తెగి పోయాయి.  వర్షాలకు రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడిన వరుణుడి  వరద ఉధృతికి  పలువురు మృతిచెందారు. మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.  


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : భారీ వర్షాలు రంగారెడ్డిజిల్లాను అతలాకుతలం చేశాయి. మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టి కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్ట సంభవించింది. జిల్లావ్యాప్తంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. భారీ వర్షాలకు పలుచోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. అలాగే భారీగా పంటనష్టం సంభవించింది. ఇంకా వరద ఉధృతి తగ్గకపోవడంతో నష్టం అంచనాలు అందడం లేదు. ప్రాథమిక సమాచారం మేరకు 288 గ్రామాల పరిధిలో 25,633 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. వివిధ పంటలు వేసిన 17,022 మంది రైతులు నష్టపోయారు. అత్యధికంగా 14,793 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. అలాగే 9232 ఎకరాల్లో వరి పంట నాశనమైంది. కంది 1500 ఎకరాలు, మొక్కజొన్న 104 ఎకరాలు, చెరుకు 4 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 117ఎకరాల్లో పూలు, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. 61 ఇళ్లు పూర్తిగా కూలిపోగా, 960ఇళ్లు పాక్షికంగా దెబ్బతి న్నాయి. జిల్లావ్యాప్తంగా వరదబాధితుల కోసం 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4,448మందిని తరలించారు. భారీ వర్షాల కారణంగా 2,050 పశువులు, కోళ్లు చనిపోయాయి.  వాతావరణం అనుకూలించక శంషాబాద్‌కు రావాల్సిన పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. వరద బీభత్సానికి ఎయిర్‌పోర్టు ప్రహరీగోడ ధ్వంసమైంది. ఎయిర్‌ పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై నీళ్లు నిలిచాయి. ఇదిలాఉంటే హిమాయత్‌సాగర్‌ 14గేట్లు ఎత్తారు. దీంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. హైదరాబాద్‌ శివార్లలోని అనేక కాలనీలు నీటమునిగాయి. మంత్రి సబితారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాఽధికారులు వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. 


కొట్టుకుపోయిన వాహనాలు

హైదరాబాద్‌కు చేరే రహదారులన్నీ దాదాపు నీటమునిగాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగుళూరు వెళ్లే హైవేపై వరద ఉధృతంగా రావడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఈ రూట్‌లో వాహనాల రాకపోకలు బందయ్యాయి. గగన్‌పహాడ్‌ వద్ద బెంగుళూరు హైవేపై వాహనాలు కొట్టుకు పోయాయి. ఇక్కడ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వరదలో కొట్టుకుపోయిన మరో ఇద్దరి ఆచూకీ దొరకలేదు. అలాగే, కందుకూరు మండలం బాచుపల్లి, బేగంపేట గ్రామాలకు చెందిన మాదరం వెంకటేష్‌గౌడ్‌, రాఘవేందర్‌ మంగళవారం సాయంత్రం కారులో వెళ్తున్నారు. అబ్ధుల్లాపూర్‌మెట్‌ లష్కర్‌గూడ వాగు వద్ద వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. ఇందులో వెంకటేష్‌గౌడ్‌ మృతదేహాన్ని వాగులో కనుగొన్నారు. రాఘవేందర్‌ ఆచూకీ లభ్యం కాలేదు. 


రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదు

ఉమ్మడి జిల్లాలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. 2016 సెప్టెంబర్‌ 21న కుత్భుల్లాపూర్‌లో 23.0సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇదే ఇప్పటివరకు రికార్డు. ప్రస్తుత వర్షాలకు గత రికార్డులు కనుమరుగయ్యాయి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం సింగపూర్‌టౌన్‌షిప్‌లో రికార్డుస్థాయిలో 32.4సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా వనస్థలి పురంలో 30.0 సెం.మీ వర్షపాతం నమో దైంది.  మంగళవారం ఉదయం 8నుంచి బుఽధవారం ఉదయం 8 గంటల వరకు రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా సగటు 11.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే హయత్‌నగర్‌లో అత్యధికంగా 24.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలో 21 సెం.మీ, అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలంలో 20.4 సెం.మీ, మంచాలలో 19.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఏడాది జిల్లా సగటు వర్షపాతం కంటే 80శాతం అధికంగా   జిల్లాలో వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఏడాది సగటు వర్షపాతం 69.4 సెం.మీ కాగా ఇప్పటివరకు సగటు 57.2 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు 102.9సెం.మీ వర్షం కురిసింది. మరో రెండురోజులపాటు ముసు రుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని  టీఎస్‌ డీపీఎస్‌ ఏఈవో వేణుమాధవ్‌ తెలిపారు. 


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)  : జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. ప్రధాన పంటలైన పత్తి, కంది, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పత్తి పంట 48,874 ఎకరాలు, కంది 19833 ఎకరాలు, వరి 5991 ఎకరాలు, మొక్కజొన్న 240 ఎకరాల్లో నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించినా ఈ వర్షాలకు జరిగిన పంట నష్టం లక్ష 25 ఎకరాల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్‌ వరకు కురిసిన వర్షాలకు జిల్లాలో 45 వేల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, ఇప్పుడు మరో లక్ష ఎకరాల పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.దౌల్తాబాద్‌ మండలంలో పత్తి మొక్కలకు ఉన్న పత్తిలోని గింజలు మొలకెత్తాయి. కాగ్నా నది ఉధృతంగా ప్రవహించడంతో ఆ నదిపై ఉన్న రోడ్డు వంతెన మరోసారి తెగిపోయింది. ఇటీవల ఈ వంతెన తెగిపోవడం ఇది నాలుగోసారి. దీంతో తాండూరు - మహబూబ్‌నగర్‌, తాండూరు - వికారాబాద్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా జిల్లాలో 209 ఇళ్లకు నష్టం వాటిల్లింది. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగుపై నుంచి మూడు మీటర్లు ఎత్తులో వరద నీరు అలుగెత్తింది. నందివాగు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం ఇరువైపులా వేసిన పంటలు కొట్టుకుపోయాయి. కోట్‌పల్లి ప్రాజెక్టు ఆయకట్టులో రుద్రారం, గట్టేపల్లికి ఆయకట్టుకు సరఫరా అయ్యే ఎడమ కాలువ 17 చైన్‌ వద్ద గండిపడి  పంటలన్నీ నీట మునిగాయి.  నవాబుపేట మండలం, ఎకమామిడిలో ఇల్లు కూలి మేడికొండ రాజు (32) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య, కూతురుకు గాయాలయ్యాయి. 


మేడ్చల్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : 

ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు మేడ్చల్‌జిల్లాలోని పలుప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం 8గంటల వరకు సగటున 17.8సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌, బోడుప్పల్‌, ఫీర్జాదీగూడ, పోచారం, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ మునిసిపాలిటీల్లో దాదాపుగా 50కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షానికి ఇళ్ల ముందు ఉన్నటువంటి కార్లు, బైకులు, ఇతర వాహనాలు నీటిలో తేలాడుతూ కొట్టుకుపోయాయి. హైదరాబాద్‌ నుంచి వెళ్లే ప్రధాన రహదారులతో పాటు పలు గ్రామాలను కలిపే రోడ్లు కోతకు గురి అయ్యాయి. కల్వర్టులపై నుంచి నీరు ప్రవహిస్తోంది. హైదరాబాద్‌-వరంగల్‌ రహదారిపై వర్షం నీటి ప్రవాహనికి వాహనాలు కొట్టుకుపోయాయి. కీసర మండలం రాంపల్లికి చెందిన గొర్రెల కాపరి సత్తయ్య (60) ఎరివెల్లి వాగులో గల్లంతయ్యాడు. మేడ్చల్‌ మునిసిపాలిటీలోన ఇఇందిరానగర్‌ కాలనీలో, మూడుచింతపల్లి మండలంలో లక్ష్మాపూర్‌లో వర్షాలకు ఇళ్లు కూలిపోయాయి.నీటి మునిగిన పలు కాలనీలను రాష్ట్ర కార్మిక, ఉపాఽధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, తదితర ప్రజాప్రతినిధులు పరిశీలించారు. అదేవిధంగా మేడ్చల్‌ జిల్లాలో వందలాది ఎకరాల్లో వరితోపాటు కూరగాయల పంటలు నీటి మునిగాయి. 


Updated Date - 2020-10-15T07:15:35+05:30 IST