జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-05-20T06:55:10+05:30 IST

ఉమ్మడి జిల్లాలో గురువారం భారీ వర్షం కురవగా పిడుగుల శబ్దం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పది నిమిషాల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

జిల్లాలో భారీ వర్షం

పిడుగుల శబ్దానికి తండ్రీ కొడుకుల మృతి 

హొళగుందలో విషాదం


హొళగుంద/అగ్రికల్చర్‌, మే 19: ఉమ్మడి జిల్లాలో గురువారం భారీ వర్షం కురవగా పిడుగుల శబ్దం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పది నిమిషాల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. కర్నూలు జిల్లా హొళగుందలోని బీసీ కాలనీ 7వ వార్డుకు చెందిన పింజారి సిద్దిక్‌ సాబ్‌ (71), కొడుకు హుసేన్‌సాబ్‌ (43)లు తండ్రీకొడుకులు. బుధవారం రాత్రి భారీ శబ్దంతో వీరి ఇంటి వద్ద పిడుగ పడింది. ఆ శబ్దానికి  హుసేన్‌సాబ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధిస్తుండగానే పది నిమిషాల వ్యవధిలోనే మరో పిడుగు పడింది. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో సిద్దిక్‌ సాబ్‌ కూడా ప్రాణాలు వదిలాడు. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దిక్‌ సాబ్‌కు భార్య హుసేన్‌ బీ, ఇద్దరు అబ్బాయిలు,  ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. హుసేన్‌సాబ్‌కు భార్య జాన్‌బీ, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. తహసీల్దార్‌ శేషఫణి బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అలాగే మండల పరిధిలోని పెద్దహ్యాట గ్రామంలో పిడుగుబాటుకు ఐదు మేకలు మృతి చెందాయి. కాగా ఉమ్మడి జిల్లాలోని 26 మండలాల్లో గురువారం పదునైన వర్షం కురిసింది. హొళగుంద మండలంలో అత్యధికంగా 124.2 మి.మీ. వర్షం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 19.8 మి.మీ. కురిసిందని, మే నెల సాధారణ వర్షపాతం 38.4 మి.మీ. కాగా, గురువారం నాటికి 65.8 మి.మీ. వర్షం నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-05-20T06:55:10+05:30 IST