జోరువాన

ABN , First Publish Date - 2022-08-08T05:26:59+05:30 IST

అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జోరువాన
భామినిలో కురుస్తున్న వర్షం

   జిల్లాలో భారీ వర్షం
  లోతట్టు ప్రాంతాలు జలమయం
  ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

భామిని/సీతంపేట/సాలూరు రూరల్‌/:
అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిలో నీరు నిలిచిపోయింది. వాహనాలు, ప్రయాణిలకు రాకపోకలు ఇబ్బందులు తప్పలేదు. వాస్తవంగా మధ్యాహ్నం వరకూ ఆకాశం మేఘావృతమై ఉంది. చాలాచోట్ల చిరుజల్లులు కురిశాయి. అయితే సాయంత్రానికి వాతావరణం పూర్తిగా మారింది. ఏకధాటిగా వాన పడింది. భామిని, సీతంపేట, సాలూరు తదితర చోట్ల మూడు గంటల పాటు జోరువాన కురిసింది. భామిని మండలంలో అలికాం-బత్తిలి, పెద్దదిమిలి, బాలేరు, పసుకుడి సమీపంలోని రోడ్లపై ఏర్పడిన భారీ గోతుల్లో వర్షపునీరు చేరింది.  భామిని, పసుకుడి, సింగిడి రహదారి బురదమయంగా మారింది. దీంతో  వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  ఇదిలా ఉండగా వంశధార నదిలో స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. వరద కాలువలో రెండు వేల క్యూసెక్కులు నీటిని హిరమండలం జలాశయానికి తరలించినట్లు  వంశధార డీఈ భవానీశంకర్‌ తెలిపారు. ఇక  సీతంపేట మండలంలో మెట్టుగూడ జలపాతం వద్ద జలకళ సంతరించుకుంది. సాలూరు తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పడిన భారీ గోతుల్లోనూ వర్షపునీరు నిలిచింది. దీంతో అటువైపుగా ఉన్న సబ్‌ ట్రెజరీ, సబ్‌ రిజిస్ర్టార్‌కార్యాలయాలు, సాలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని దీనిపై అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఏదేమైనా  ఈ వర్షం వరినారు మడులు, పత్తి వ్యవసాయానికి అనుకూలమని మరోవైపు రైతులు తెలియజేస్తున్నారు.
నాగావళికి స్వల్ప వరద
గరుగుబిల్లి:
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి పైనుంచి స్వల్పంగా వరదనీరు చేరుతుంది.   ఒడిశాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైనుంచి 4 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు రాగా ఆదివారం దిగువ ప్రాంతాలకు 2600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  కుడి ప్రధాన కాలువ నుంచి వెయ్యి క్యూసెక్కులు, పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ కాలువ నుంచి 414 క్యూసెక్కులు, కుడి కాలువ నుంచి 106 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురిసినట్లయితే వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు డీఈ బి.శ్రీహరి, జేఈ కె.శ్రీనివాసరావు  తెలిపారు. ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 104.25 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉందన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నామని,  అధికంగా వరద పోటెత్తితే.. దిగువ ప్రాంతాలకు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

 

Updated Date - 2022-08-08T05:26:59+05:30 IST