Abn logo
Jul 1 2020 @ 05:45AM

సాగుకు సానుకూలం

పలు మండలాల్లో భారీ వర్షం

ఇప్పటికే ఖరీఫ్‌ ప్రారంభం

తాజా వానలతో మరింత మేలు


ఒంగోలు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మూడు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖరీఫ్‌కు మరింత సానుకూల వాతావరణం కల్పించింది. దీంతో రైతులు సాగుకు ఉపక్రమించారు. అంతటా దుక్కులు సిద్ధం చేస్తున్నారు. దున్నకం పూర్తయిన చోట్ల అక్కడక్కడా విత్తనాలు కూడా వేస్తున్నారు.  జిల్లాలో ఈనెల సాధారణ వర్షపాతం 58.0 మి.మీ కాగా ఇప్పటికే 84.3 మి.మీ  కురిసింది. గిద్దలూరు మండలంలో సాధారణ వర్షపాతం 51.9 మి.మీ కాగా సుమారు ఐదు రెట్లు అధికంగా పడింది. అక్కడ 243.8 మి.మీ ఈనెలలో కురవగా కంభం, రాచర్ల, పామూరు, పీసీపల్లి, కనిగిరి, వి.వి.పాలెం, బేస్తవారపేట మండలాల్లో 150 నుంచి 200 మి.మీ కురిసింది. 


 సంతమాగులూరు, ఉలవపాడు, కందుకూరు, సింగరాయకొండ, వేటపాలెం, చీరాల, కారంచేడు, పర్చూరు, కొండపి, లింగసముద్రం, వెలిగండ్ల, కొమరోలు తదితర మండలాల్లో 100 నుంచి 150 మి.మీ నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రైతులు ఖరీఫ్‌ సాగు చేపట్టారు. సుమారు మూడు వేల హెక్టార్లలో పత్తి, సజ్జ, నువ్వు, పెసర, వేరుశనగ, ఇతర పశుగ్రాస పంటలు ఇప్పటికే సాగు చేయగా అత్యధిక ప్రాంతాల్లో కీలక ఖరీఫ్‌ పంటల సాగుకు రైతులు భూములు సిద్ధం చేస్తున్నారు.  


మంగళవారం కూడా  పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రానికి జరుగుమల్లిలో 49.50 మి.మీ వర్షపాతం నమోదైంది. సింగరాయకొండలో 41.50, మి.మీ, ఇంకొల్లులో 40.75, టంగుటూరులో 40.50, ముండ్లమూరులో 31.25, దర్శిలో 27.25, పర్చూరులో 18.50, ఉలవపాడులో 17.25, కురిచేడులో 16.25, నాగు లుప్పలపాడులో 11.0 మి.మీ.  కురిసింది. పలు ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి. 

Advertisement
Advertisement
Advertisement