కుండపోత వర్షం.. హైదరాబాదీల్లో భయం.. భయం..

ABN , First Publish Date - 2020-10-18T02:01:54+05:30 IST

భాగ్యనగరాన్ని వరుణుడు వదిలిపెట్టడం లేదు. మరోసారి నగరంలో వాన దంచికొడుతోంది. మంగళవారం కురిసిన వర్షం ఇంకా కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఆ బాధలు ఇంకా తీరనులేదు. కొద్దిరోజులు తెరిపిచ్చినట్లే ఇచ్చి శనివారం సాయంత్రం హఠాత్తుగా

కుండపోత వర్షం.. హైదరాబాదీల్లో భయం.. భయం..

హైదరాబాద్: భాగ్యనగరాన్ని వరుణుడు వదిలిపెట్టడం లేదు. మరోసారి నగరంలో వాన దంచికొడుతోంది. మంగళవారం కురిసిన వర్షం ఇంకా కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఆ బాధలు ఇంకా తీరనులేదు. కొద్దిరోజులు తెరిపిచ్చినట్లే ఇచ్చి శనివారం సాయంత్రం హఠాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి. ఉన్నట్టుండి భారీ ఎత్తున వర్షం కురిసింది. కొద్దిసేపు కురిసి నిమ్మళించింది అనుకునే లోపే మళ్లీ కుండపోతగా వాన కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో బెంబేలెత్తిస్తోంది. 


ఇప్పటికే ఇటీవల కురిసిన భారీ వర్షానికి నగరవాసులు హడలెత్తిపోయారు. లోతట్టు ప్రాంతాల్లో వరద బాధితులు నీటి కష్టాల నుంచి తేరుకోలేదు. ఇళ్లల్లోకి చేరిన బురద, వగైరా.. శుభ్రం చేసుకునే పనిలో జనాలు నిమగ్నమయ్యారు. ఇంతలోనే మళ్లీ కుండపోతగా వర్షం రావడంతో భయపడిపోతున్నారు. మొన్న కురిసిన వర్షానికి బైకులు, కార్లు, ఇంట్లో సామాగ్రి కొట్టుకుపోయాయి. మళ్లీ ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. 


దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌, మలక్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, కూకట్‌పల్లి, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, మీర్‌పేట్‌, హయత్‌నగర్‌, పాతబస్తీ, సైదాబాద్‌లో మళ్లీ వర్షం దంచికొడుతోంది. రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  


ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు వరద బాధితులను పరామర్శిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు చేరుస్తున్నారు.


తీవ్ర అల్పపీడనం..

అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటలలో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది.ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుంది. రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది.

Updated Date - 2020-10-18T02:01:54+05:30 IST