వాన బీభత్సం

ABN , First Publish Date - 2020-09-17T07:27:04+05:30 IST

భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులతో కుండపోతగా కురిసి.. బీభత్సం సృష్టించింది. బుధవారం పగలంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయి రెండు గంటల్లోనే 10 సెంటీ

వాన బీభత్సం

  • హైదరాబాద్‌లో కుండపోత వర్షం..
  • సాయంత్రం సమయంలో వరుణుడి ప్రతాపం
  • 2 గంటల్లో 10 సెంటిమీటర్ల వర్షపాతం
  • వరద కాలువలను తలపించిన రోడ్లు
  • అదుపుతప్పి పడిపోయిన వాహనదారులు
  • కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్‌
  • జలోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన నీరు
  • పలు జిల్లాల్లోనూ భారీ వర్షం
  • రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురి మృతి


20న మరో అల్పపీడనం

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ కొనసాగుతోంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులతో కుండపోతగా కురిసి.. బీభత్సం సృష్టించింది. బుధవారం పగలంతా సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయి రెండు గంటల్లోనే 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ వరదకాలువలను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. మోకాలిలోతుకు పైగా నీరు నిలవడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు అదుపుతప్పి కిందపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. పురాతన భవనాల గోడలు కూలాయి. ఫీర్జాదిగూడ చెరువు కట్టపై ఆలయం ప్రహరీగోడ కూలి.. బైక్‌పై పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు బస్తీల్లో  ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో రోడ్లు సైతం కుంగిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ప్రయత్నించినా భారీ వరదనీటితో చేసేది లేక చేతులెత్తేశారు.


నగర వరద ప్రవాహ వ్యవస్థ సామర్ధ్యం గంటకు 2 సెంటీమీటర్లు కాగా.. అత్యధికంగా జూపార్కు, షేక్‌పేటలో 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్తాపూర్‌లో 10.4 సెంటీమీటర్లు, ఫిల్మ్‌నగర్‌లో 9.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం నేపథ్యంలో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు. సకాలంలో అత్యవసర బృందాలు రంగంలోకి దిగకపోవడంతో చాలా ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి గంటల తరబడి వర్షంలో తడిచారు. కరోనా భయంతో వంతెనలు, చెట్లు, షాపుల ముందు నిలబడేందుకూ చాలా మంది వెనుకంజ వేశారు. తలదాచుకున్న ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేకుండా పోయింది. జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. విద్యుత్తు సంస్థ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 


ప్రాణాలను బలిగొన్న గోడ..

వర్షంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఆలయ ప్రహరీ గోడ బలిగొంది. అల్యూమినియం పార్టీషన్‌ పని చేసే గందమోజు ప్రవీణ్‌కుమార్‌(41), అతని సహాయకుడు మోహన్‌(15) బుధవారం సాయంత్రం ఫీర్జాదిగూడ చెరువు కట్టపై నుంచి బైక్‌పై వెళుతుండగా..  అక్కడి ఆంజనేయస్వామి ఆలయం ప్రహరీగోడ కూలి వారిపై పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 


ఇళ్లు కూలి ఇద్దరి మృతి..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ధన్వాడలో మట్టి మిద్దె కూలి.. నిద్రిస్తున్న గౌతమ్‌(3) అనే బాలుడిపై పడింది. మట్టిలో కూరుకుపోయిన బాలుణ్ని బయటకు తీసి నారాయణపేట ఆస్పత్రికి తరలించగా.. చికిత్స  అందిస్తుండగానే మృతి చెందాడు. కొల్లాపూర్‌ మండలం కుడికిళ్ల గ్రామంలో సంకే దేవమ్మ(65) అనే వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తుండగా.. బుధవారం తెల్లవారు జామున మిద్దె కూలి ఆమెపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా పదేళ్ల చరిత్రలో అత్యధిక వర్షపాతం 60.08 మిల్లీమీటర్లు నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌లో బుధవారం భారీ వర్షం కురిసి పంట పొలాలు నీట మునిగాయి. పురాతన ఇళ్లు కూలిపోయాయి. జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో 20 గేదెలు చెరువులో నీరు తాగేందుకు వెళ్లి మత్తడిలో కొట్టుకుపోయి మరణించాయి.


జిల్లాల్లోనూ..

పలు జిల్లాల్లోనూ బుధవారం భారీ వర్షం కురిసింది.  వికారాబాద్‌ జిల్లా షాపూర్‌లో కాడిగుల్ల వాగు ఉప్పొంగి.. దశరథ్‌ అనే రైతు కుటుంబంలో విషాదం నింపింది.  పొలం పనులకు వెళ్లిన దశరథ్‌ భార్య అనిత, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటుతుండగా నీటి ప్రవాహం పెరగడంతో అందులో పడిపోయారు. దశరథ్‌ ముగ్గురు కూతుళ్లను, కొడుకును కాపాడుకోగలిగాడు. మరో కూతురిని గ్రామస్థులు కాపాడారు. భార్య అనిత (30) కల్కోడ చెరువులోకి కొట్టుకుపోయింది.  మరోవైపు నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్‌ గ్రామ సమీపంలోని చీన్యతండాకు చెందిన వెంకట్రాం, అతని భార్య విజయ.. పత్తి చేనులో పని కోసం వెళ్లి దుందుభీ వాగులో చిక్కుకుపోయారు.  విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. చీకటి కావడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పిస్తున్నారు.  

Updated Date - 2020-09-17T07:27:04+05:30 IST