వర్షం..నష్టం

ABN , First Publish Date - 2020-10-13T06:04:31+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలను దెబ్బతీస్తున్నాయి.

వర్షం..నష్టం

గద్వాల జిల్లాలో భారీ వాన

రోడ్లు దెబ్బతిని రాకపోకలు అంతరాయం

ఉందండాపూర్‌ వద్ద 250 ఎకరాల్లో మిరపకు నష్టం


గద్వాల ఆంధ్రజ్యోతి :

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలను దెబ్బతీస్తున్నాయి. అప్పులు తెచ్చి, ఆరుగాలం కష్టపడి పడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలతో నీటిపాలవుతున్నాయి. గద్వాల జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షంతో ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 


గద్వాల జిల్లాలో సోమవారం కురిసిన వర్షం జనాల్ని అతలాకుతలం చేసింది. అలంపూర్‌ నుంచి రాయచూరు వెళ్లే రహదారిలో బొంకూరు వద్ద వంతెన నిర్మాణం చేస్తున్న ప్రాంతంలో తాత్కాలికంగా వేసిన రోడ్డు వర్షానికి తెగిపోయింది. పలువురు రూ.50 తీసుకుని వాహనాలను వంతెన పైకి ఎక్కించారు. ఉండవల్లి సబ్‌ స్టేషన్‌లోకి వర్షపు నీరు చేరింది. ఉండవల్లి, అమరవాయి, మానవపాడు మధ్య రకాపోకలు నిలిచిపోయాయి. జూలకల్‌ వద్ద కర్నూల్‌-రాయచూరు రోడ్డు పూర్తిగా నీట మునిగింది. కేటీదొడ్డి-రాయచూరుకు వెళ్లే రోడ్డుపై నందిన్నె వద్ద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.


పొలాల్లోకి నీరు

ఇటిక్యాల మండలం ఉందండాపూర్‌ శివారులో నెట్టెంపాడు ప్యాకేజీ 100 కింద వాగుపై వంతెనను క్రాస్‌గా నిర్మించడంతో వర్షపు నీరు 250 ఎకరాల మిరప తోటను ముంచెత్తింది. జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, కంది పంటలకు కూడా ఈ వర్షం నష్టాన్ని మిగిల్చింది.


వర్షపాతం ఇలా

జిల్లాలోని కేటీదొడ్డి మండలంలో 4 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. ధరూర్‌లో 18, గద్వాలలో 26.1, ఇటిక్యాలలో 40.5, మల్ధకల్‌లో 69.8, గట్టులో 80.1, అయిజలో 15.2, రాజోలిలో 13.5, వడ్డేపల్లిలో 41.1, మానవపాడులో 41.9, ఉండవల్లిలో 43.5, అలంపూర్‌లో 0.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా జిల్లాలో 394.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-10-13T06:04:31+05:30 IST