ఎంత కష్టం.. ఎంత నష్టం..!

ABN , First Publish Date - 2020-10-16T17:08:28+05:30 IST

జిల్లాలో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. అప్పులుచేసి పెట్టిన పెట్టుబడి అంతా నీళ్లలోకి..

ఎంత కష్టం.. ఎంత నష్టం..!

జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు నిండా మునిగిన అన్నదాత

52,584 మంది రైతుల పంట పెట్టుబడంతా నీళ్లపాలు

28 మండలాల్లో మొత్తం 95,820 ఎకరాల్లో వరి పంట మునక

ఇందులో 50వేల ఎకరాలు పూర్తిగా నష్టపోయినట్లు అంచనా

రూ.100 కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా వ్యవసాయశాఖ నిర్ధారణ

చేలల్లో నీళ్లు తగ్గిన తర్వాత నష్టం మరింత పెరిగే ప్రమాదం

ఏలేరు వరద ఉధృతితో 216 జాతీయరహదారి పూర్తిగా నీటమునక

పిఠాపురం,గొల్లప్రోలులో ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలకు పెనునష్టం


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. అప్పులుచేసి పెట్టిన పెట్టుబడి అంతా నీళ్లలోకి కొట్టుకుపోయింది. దిగుబడితో నాలుగు డబ్బులు వస్తాయని పెంచుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. వెరసి జిల్లాలో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో పెను స్థాయిలో పంట నష్టం నమోదైంది. ఆగస్టులో వర్షాలు, గోదావరి వరదలతో పంటలన్నీ కొట్టుకుపోయి గాయపడ్డ అన్నదాతకు ఈసారి మరింత కోలుకోలేని దెబ్బ తగిలింది. పొట్ట దశకు చేరిన పంటలన్నీ మునిగి కుళ్లిపోవడంతో కర్షకులు చేలల్లో రోదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 28 మండలాల్లో 52,584 మంది అన్నదాతలకు చెందిన 95,820 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ఇందులో 50 వేల ఎకరాల్లో చేలు  కుళ్లిపోయి ఎందుకూ పనికిరావని వ్యవసాయశాఖ నిర్ధారించింది. పెట్టుబడి నష్టం రూ.100 కోట్లుగా లెక్కగట్టింది. అటు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు సహా 40 గ్రామాలు ఇంకా నీటి ముంపులోనే తేలుతున్నాయి. ఏలేరు వరద ఇంకా పిఠాపురం నియోజకవర్గాన్ని వణికిస్తూనే ఉంది.


తీవ్రవాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఈనెల 9 నుంచి 13 వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. గడిచిన రెండేళ్లలో లేనంత వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడచూసినా వాననీరే కనిపిస్తోంది. అత్యధికంగా 28 మండలాల్లోని 126 గ్రామాలు భారీ వర్షాల ధాటికి అతలాకుతలం అయ్యాయి. 40 గ్రామాల్లో ఇప్పటికీ ముంపు నీరు వీడలేదు. ఇవన్నీ జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 1.13 లక్షల మంది ప్రభావితం అయినట్టు తేలింది. 18 పునరావాస శిబిరాలు ఏర్పాటుచేయగా, 4,460 మంది తలదాచుకుంటున్నారు. 61 కచ్చా ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 232 ఇళ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. 117 పూరిళ్లు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఒకపక్క వర్షాల ప్రభావం తగ్గినప్పటికీ వీటి ప్రభావంతో జలాశయాలు నిండిపోయి వరద నీరు అనేక ప్రాంతాలను ఇంకా ముంచెత్తుతూనే ఉంది.


ముఖ్యంగా పిఠాపు రం నియోజకవర్గం ఏలేరు వరదతో అతలాకుతలం అవుతోంది. ఎటుచూసినా గ్రామాలు, వరి పొలాలు నదీ ప్రాంతాన్ని తలపిస్తోంది. పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, పెద్దాపురం, కిర్లంపూడి, జగ్గంపేట తదితర మండలాలు గడిచిన మూడు రోజులుగా వరదలో మునిగితేలుతున్నాయి. 22 వేల క్యూసెక్కుల నీరు ఏలేరు నుంచి రావడంతో ఇవన్నీ ముంపునకు గురయ్యాయి. ఏలేరు కాలువలకు కేవలం అయిదువేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తట్టుకునే సామ ర్థ్యం ఉంది. కానీ 22 వేల క్యూసెక్కులు వదలడంతో నష్టం అధికం గా నమోదవుతోంది. కాకినాడలో అనేక లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపునీటిలోనే ఉన్నాయి. ఇంద్రపాలెం, సర్పవరం, కాకినాడ రూర ల్‌ తదితర ప్రాంతాల్లో కాలనీల్లో పడవలు వేసుకుని జనం నిత్యావసరాలకు ప్రయాణిస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఇప్పటికీ అనేక లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు ముంపునీటి నుంచి తేరుకోలేదు. ఖరీఫ్‌ సీజన్‌లో భాగంగా ప్రస్తుతం జిల్లాలో పెద్దఎత్తున వరి సాగవుతోంది. అనేక ప్రాంతాల్లో పంట ఇప్పటికే పొట్టదశకు రాగా, ఇంకొన్నిచోట్ల ఆ దశ దాటేసింది. ఒకరకంగా మంచి పంట దిగుబడికి పునాది పడేది ఇప్పుడే.


ఈ తరుణంలో వర్షాలు, వరదలు జిల్లాలో అన్నదాతల ఆశలను అడియాసలు చేశాయి. గురువారం నాటికి మొత్తం 95,820 ఎకరాల్లో 52,584 మంది రైతులకు చెందిన పంట జలార్పణం అయినట్టు వ్యవసాయశాఖ గుర్తించింది. అత్యధికంగా కాకినాడ, రామచంద్రపురం డివిజన్లలో నష్టం నమోదైంది. మండలాలవారీగా పరిశీలిస్తే అమలాపురంలో 17 గ్రామాల్లో 550 హెక్టార్లు, అయినవిల్లిలో 12 మండలాల్లో 540, ఆత్రేయపురంలో 14 గ్రామాల్లో 200, కడియంలో 11 మండలాల్లో 500, ఆలమూరులో 14 గ్రామాల్లో 1,100, అనపర్తి 12 గ్రామాల్లో 1,700, రాయవరం 900, బిక్కవోలులో 2,200, కాకినాడరూరల్‌లో 750, పెదపూడి 3,300, కరపలో 19 గ్రామాల పరిధిలో 4,820, పిఠాపురంలో 4,265, కాజులూరు 1,100, గొల్లప్రోలు 800, యు.కొత్తపల్లి 2,100, కోరుకొండ 500, కిర్లంపూడిలో 16 గ్రామాల్లో 2,200, రంగంపేట 550, జగ్గంపేట 650, ప్రత్తిపాడు 532, ఏలేశ్వరం 245, తుని 250, తొం డంగి 1,736 హెక్టార్ల చొప్పున 28 మండలాల్లో వరికి నష్టం వాటిల్లింది.


నష్టపోయిన 95,820 ఎకరాల్లోనూ 50 వేల ఎకరాల్లో వరి పూర్తిగా కుళ్లిపోయినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి  పెట్టారని, ఇదంతా పోయినట్టేనని వివరించారు. ఈ లెక్కన ఎకరాకు రూ.20 వేల చొప్పున 50 వేల ఎకరాలకు రూ.100 కోట్ల వరకు అన్నదాతకు పెట్టుబడి నష్టం వాటిల్లిందని విశ్లేషించారు. వరద తగ్గాక ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. ఆగస్టులో గోదావరి వరదలకు జిల్లాలో 2,700 హెక్టార్లలో వరి దెబ్బతింది. ఇప్పుడు అంతకుమించిన నష్టం ఉండడంతో రైతులు కన్నీళ్లుపెడుతున్నారు.

Updated Date - 2020-10-16T17:08:28+05:30 IST