అల్పపీడనద్రోణి ప్రభావంతో తూ.గో. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2020-08-15T18:35:17+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో..

అల్పపీడనద్రోణి ప్రభావంతో తూ.గో. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ముంచేస్తున్నాయి!

ఎగువున ఎడతెరిపిలేని వానలతో గోదావరికి పెరుగుతున్న వరద

7.7లక్షల క్యూసెక్కులకు పెరిగిన ప్రవాహం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి సన్నాహాలు

ఎడతెరిపిలేని వర్షాలతో మన్యం జలమయం:కోనసీమలో పలుచోట్ల రాకపోకలు బంద్‌


(కాకినాడ/అమలాపురం-ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఏజెన్సీ మండలాలతోపాటు కోనసీమలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అటు ఎగువనుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలతో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది.


దీంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 9.90 అడుగులకు చేరింది. వరద నీరు 7.77 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవహిస్తోంది. ఇది పది లక్షలకు పెరిగే అవకాశం ఉండడంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేసే దిశగా జలవనరులశాఖ సిద్ధ మవుతోంది. మరోపక్క వరద పోటెత్తడం, దీనికితోడు వర్షాలతో మన్యంలో శబరి, సీలేరు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. భూపతిపాలెం, ముసురుమిల్లి, డొంకరాయి ప్రాజెక్టుల్లో గరిష్ఠస్థాయికి నీటిమట్టం చేరింది. దీంతో నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. దేవీపట్నం మండలం తొయ్యేరు వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో 30 గ్రామాల ప్రజలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం కనకాయలంక కాజ్‌వేపై వరద నీరు ప్రవహించడంతో ఉభయగోదా వరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు డొంకరాయి రిజర్వాయర్‌ లోకి వరద నీరు భారీగా వస్తుండడంతో 21,250 క్యూసెక్కులు వదిలిపెట్టారు.


దీంతో గోదావరిలోకి సీలేరు జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. భూపతిపాలెం ప్రాజెక్టుకు సంబంఽధించి ఆరు గేట్లు ఎత్తివేసి వరదనీటిని విడుదల చేశారు. పందిరిమామిడి వద్ద కల్వర్టుకు గండిపడడంతో దండంగి వద్ద వంతెనపై నుంచి సీతపల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. అటు జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మారేడుమిల్లి మండలంలో 35.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. నెల్లిపాక 26.4, శంఖవరంలో 22.8, అడ్డతీగలలో 20.0, వరరామచంద్రపురంలో 19.8, కూనవరంలో 18.6, వై రామవరంలో 18.6, దేవీపట్నంలో 17.2, రాజవొమ్మంగిలో 17.2, రాజమహేంద్రవరం  అర్బన్‌లో 15.4 మి.మి. చొప్పున వర్షం కురిసింది. ఇక గోదావరి నదీ పరీవా హక ప్రాంతంలోని ఇసుక ర్యాంపులన్నీ మూతబడ్డాయి. వరద ఉధృతి పెరుగు తున్న దృష్ట్యా ఇసుక తవ్వకాలకు తీవ్రమైన ఆటంకం కలిగింది.


Updated Date - 2020-08-15T18:35:17+05:30 IST