ఇరుజిల్లాలో భారీవర్షం

ABN , First Publish Date - 2020-09-30T06:07:07+05:30 IST

ఉమ్మడి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇరుజిల్లాలో భారీవర్షం

జలమయమైన ఖమ్మం నగరం 

ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరి మృతి

కిన్నెరసాని ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద


ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి) / ఖమ్మం కార్పొరేషన్‌ / వైరా/ కారేపల్లి/ పాల్వంచరూరల్‌, సెప్టెంబర్‌ 29:  ఉమ్మడి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైరా, కారేపల్లి మండలాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. ముఖ్యంగా ఖమ్మం నగరంలో కుండపోత వాన పడటంతో ప్రధానవీధుల్లో నీరు భారీగా నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం బస్టాండ్‌, కలెక్టరేట్‌ ఆవరణలో వాన నీరు నిలిచింది. ఇల్లెందు క్రాస్‌రోడ్‌, వైరా రోడ్డు, ఎన్నెస్టీరోడ్డు, మునిసిపల్‌ ఆఫీసు రోడ్డు, సీసీఎస్‌ రోడ్డు, కమాన్‌బజార్‌, తదితర ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనాలు నీళ్లలో మునిగాయి. పాదచారులు మోకాలులోతు నీటిలో నడిచారు. 


పిడుగుపాటుకు ఇద్దరు బలి..

వైరా మండలం తాటిపూడి గ్రామానికి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పిడుగుపడి ఒక ఆర్‌ఎంపీ అక్కడికక్కడే మృతిచెందగా.. అక్కడే ఉన్న మరో ఇద్దరు సొమ్మసిల్లి పడిపోయారు. మండలంలోని గన్నవరంలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న అయిలూరి శ్రీనివాసరెడ్డి అలియాస్‌ వాసురెడ్డి(42)పిడుగుపాటుకు మృతిచెందారు. శ్రీనివాసరెడ్డి.. అదే గ్రామానికి చెందిన ధనమ్మ అనే వృద్ధురాలిని వైరాలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆరోగ్యపరీక్షలు చేయించి తిరిగి ద్విచక్రవాహనంపై గన్నవరం వెళ్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో వారు తాటిపూడి దాటిన తర్వాత ఒక మర్రిచెట్టు కింద ఆగారు. అదే సమయంలో సమీపంలో పిడుగుపడటంతో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా ధనమ్మ(60), వారికి సమీపంలో చెట్టు కింద నిలుచున్న మధిరకు చెందిన జిక్కుల రామకృష సొమ్మసిల్లిపడిపోయారు. దీంతో వారిద్దరిని కొణిజర్లకు చెందిన 108వాహనంలో వైరా పీహెచ్‌సీకి తరలించారు. వాసురెడ్డికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.


కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన నాలి లక్ష్మయ్య(40) పిడుగుపాటుకు మృతిచెందాడు. మంగళితండా సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లగా.. మంగళవారం సాయంత్రం పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా లక్ష్మయ్య విగతజీవిగా కనిపించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. లక్ష్మయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


406.30అడుగులకు కిన్నెరసాని నీటిమట్టం

వారం రోజులుగా  కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న నదులు,వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గుండాల, ఆళ్లపల్లి, మర్కోడు తదితర లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్న వరద కిన్నెరసాని జలాశయానికి చేరుతోంది. మంగళవారం ఇన్‌ఫ్లో 11వేల క్యూసెక్కులకు పెరగడంతో సాయంత్రానికి కిన్నెరసాని రిజర్వాయర్‌ నీటిమట్టం 406.30 అడుగులకు చేరింది. అప్రమత్తమైన డ్యాం అధికారులు రాత్రి సమయంలో మూడు గేట్లు ఎత్తి  15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు ఎత్తిన సమయంలో రాజాపురం చప్టాపైనుంచి వరద ప్రవహిస్తుందని, ఎవరూ ఆ చప్టా దాటే ప్రయత్నాలు చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2020-09-30T06:07:07+05:30 IST