Abn logo
Jul 10 2020 @ 05:53AM

ముంచెత్తిన వాన

తాడేపల్లిగూడెం రూరల్‌/ పెంటపాడు/ ఉంగుటూరు/ భీమడోలు/ నిడదవోలు/ తాళ్లపూడి/ కొవ్వూరు/ పోలవరం, జూలై 9 : వరుణదేవుడు కుమ్మేశాడు. పలు మండలాల్లో సుమారు 4 గంటల పాటు ఏకధాటిగా తడిసిముద్ద చేశాడు. తాడేపల్లిగూడెం,  పెంటపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రోడ్లు కాలువలను తలపించాయి.. ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంట చేలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు  చెరువులుగా మారిపోయాయి. తాడేపల్లిగూడెంలో ఒక్క రోజే ఏకంగా రికార్డు స్థాయిలో 128  మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్టు అధికారిక సమాచారం. గడచిన ఐదేళ్లలో ఇంతటి వర్షం నమోదు కావడం ఇదే ప్రథమమని గణాంకాలు చెబుతున్నాయి.నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గురువారం పరిశీలించి వెంటనే నీరు బయటకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని పెదతాడేపల్లి, జగ్గన్నపేట, రామన్నగూడెం ప్రాంతాల్లోని చెరువులు పొంగి చేపలు రోడ్లపైకి చేరాయి.స్థానికులు ఆ చేపలు పట్టుకునేందుకు ఎగబడ్డారు. మండలంలోని 1805 హెక్టార్లలో వరిచేలు నీట మునిగినట్టు వ్యవసా యాధికారి ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.


పెంటపాడు, బోడపాడు, జట్లపాలెం, మీనవల్లూరు తదితర గ్రామాల్లో నారుమడులు నీటమునిగాయి. ఉంగుటూరులో 115.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మెట్ట గ్రామాలైన గొల్లగూడెం, అక్కుపల్లిగోకవరం, తిమ్మయ్యపాలెం, వెల్లమిల్లి, ఉంగు టూరు, నారాయ ణపురం గ్రామాల తో పాటు డెల్టాలోని రావులపర్రు, దొంతవరం, కాగుపాడు, బొమ్మిడి తదితర గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంటో లోతట్టు భూములు మునిగిపో యాయి. స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మండలంలో పలు గ్రామాలను సందర్శించారు. భీమడోలులో చెరువులు పొంగిపొర్లాయి. పోలసానపల్లి మెట్ట ప్రాంతాల్లోని చెరువుల్లో నీరు భీమడోలు జంక్షన్‌ మీదుగా ప్రవహించింది. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లోకి నీరు చేరడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. నిడదవోలు పట్టణంలోని ప్రధాన రోడ్లన్ని జలమయమయ్యాయి. నాట్లు పూర్తయిన వరిచేలు నీట మునిగి చెరువులను తలపించాయి. కొవ్వూరు  పట్టణ, మండలంలో పల్లపు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు రహదారులు నీట మునిగాయి.


కుండపోతగా కురిసిన వర్షానికి తాళ్లపూడి మెయిన్‌రోడ్డు, వేగేశ్వరపురంలో మూడు ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి.పెద్దేవంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, రహదారులు ఆక్రమణలకు గురికావడంతో గంటా బత్తురాజు ఇళ్లతో పాటు మరో ఆరు ఇళ్లల్లో వర్షపునీరు చేరి ఇళ్లల్లోని సామగ్రి కొట్టుకుపోయాయి. ప్రక్కిలంక ఆరో వార్డులో డ్రెయినేజీ లేకపోవడంతో వాడకం నీరు మురుగులా తయారై రహదారులను ముంచెత్తింది. ఇసుక ర్యాంపుల్లోకి భారీగా నీరు చేరడంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. 


ఉప్పొంగిన గోదావరి...

యలమంచిలి/నరసాపురం/పోలవరం/ కొవ్వూరు, జూలై 9 : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి పోటెత్తింది.. ఎర్రనీరు సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది.భద్రాలచం వద్ద  గురువారం ఉద యం 19.30 అడుగులుగా ఉన్న నీటి మట్టం సాయంత్రానికి 18.40 అడుగులకు చేరింది. భద్రాచలంలో తగ్గుముఖం పట్టడంతో పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇంద్రావతి, శబరి, సీలేరు ఉప నదుల ఉధృతితో గోదావరి పెరుగుతుందని అధికారులు తెలిపారు.ధవళేశ్వరం వద్ద 10.50 అడుగుల నీటమట్టం నమోదైంది. ఈ నేపథ్యంలో బ్యారేజీ 175 గేట్లను .2 మీటర్లు ఎత్తి 1,07,600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్టు హెడ్‌ వర్క్స్‌ ఈఈ మోహనరావు తెలిపారు. వశిష్ఠ నదికి వరద పోటు తగిలింది.


యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల, చించినాడ, యలమంచిలి లంక, వైవి లంక తదితర గ్రామాల్లో గోదావరి నిండుగా ప్రవహించింది.వశిష్ఠ గోదావరికి వరద నీరు తాకడంతో నీరు రంగు మారింది. నరసాపురం వద్ద గోదావరి కళకళలాడింది. మరోవైపు వరద నీరు రావడంతో సంప్రదాయ మత్స్యకారులు వేట ప్రారంభించారు. 


పొంగిన కొండ వాగులు.. 

బుట్టాయగూడెం/కొయ్యలగూడెం/జంగారెడ్డిగూడెం, జూలై 9:ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం ఉదయం నుంచి కొండ వాగులు పొంగిపొర్లాయి. బుట్టాయ గూడెం, జీలుగుమిల్లిలో వాగులు పొంగి రోడ్లపై నుంచి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. కోటరామచంద్రపురం గిరిజన సహకార సంస్థకు (జీసీసీ) చెందిన వాహనం కొండవాగులో పడిపోయింది. సుమారు 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం నీటి పాలయ్యాయి. కేఆర్‌.పురం గొడౌన్‌ నుంచి బుట్టాయగూడెం మండలంలోని చౌక డిపోలకు తరలిస్తుండగా కన్నాపురం పడమట కొండవాగు ఉధృతికి వాహనం వాగులో పడిపోయింది. బియ్యం మొత్తం వరద నీటిలో పడిపోయినట్లు జీసీసీ అధికారులు, సిబ్బంది తెలిపారు. డ్రైవర్‌, క్లీనర్‌, బంటా కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. జంగా రెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. గురువారం ఉదయం రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవాహించడంతో ఎగువ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  


ఎర్రకాలువ ఉధృతి వంతెన మూసివేత 

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై 9 :  తాడేపల్లిగూడెం మండలం మాధవరం - కంసాలిపాలెం మధ్యన ఉన్న ఎర్రకాలువ వంతెనపై భారీ వాహనాలు వెళ్లకుండా నిషేధించినట్టు ఎర్రకాలువ ఏఈ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఎర్రకాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలు నిషేధించినట్టు తెలిపారు. 


వాన కురిసిందిలా..

ఏలూరుసిటీ, జూలై 9: నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున కుంభవృష్టిగా వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో జిల్లాలో 50.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదుకాగా అత్యధికంగా నల్లజర్లలో 164 మిల్లీమీటర్లు నమోదైంది. తాళ్లపూడి మండలంలో 144.2 మి.మీ, బుట్టాయిగూడెం 141.8, భీమడోలు 133.8 , తాడేపల్లిగూడెం 124.8 , ఉంగుటూరు  115.2 , గోపాలపురం 114.6, దేవరపల్లి  109.6 , కొయ్యలగూడెం 103.6 , నిడదవోలు  94.6 , పోలవరం 90, జంగారెడ్డిగూడెం 81.4, పెంటపాడు 79.4, దెందులూరు 67.4, కామవరపుకోట 62.6, టి నరసాపురం 59.8, లింగపాలెం 59.2, చింతలపూడి 56, ద్వారకాతిరుమల 55.2, ఉండ్రాజవరం 51.6, పెరవలి 51.2, కొవ్వూరు 44.2, చాగల్లు 39.2, ఏలూరు 36.4, జీలుగుమిల్లి 32.4, పెదవేగి 29, తణుకు 28.2, అత్తిలి 26.8, ఇరగవరం 25.4, వేలేరుపాడు 24.8, పెనుమంట్ర 24.6, పెదపాడు 24.4, గణపవరం 24.2, నిడమర్రు 19.2, కుక్కునూరు 15, ఉండిలో 10.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం మీద ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 2,410 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జల్లాలోని మిగిలిన మండలాల్లో 10 మి.మీ కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది. 


నీట మునిగిన ఇళ్ల స్థలాలు..

గోపాలపురం/ దేవరపల్లి/ ద్వారకాతిరుమల, జూలై 9 : నాలుగు గంటల వర్షానికే ఇళ్ల స్థలాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఆందోళనలకు దిగారు. మునిగిపోయే స్థలాలు మాకెందుకంటూ నిరసన వ్యక్తం చేశారు. గోపాలపురం మండలం సంజీవపురంలో ముంపునకు గురయ్యే ప్రదేశంలో ఇళ్లస్థలాలు మాకొద్దంటూ నీళ్లల్లోకి దిగి గిరిజన మహిళలు నిరసన తెలిపారు.  దేవరపల్లి మండలం బంధపురంలో ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూముల్లో భారీగా నీరు చేరడంతో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులతో  కలిసి వినూత్న నిరసన తెలిపారు.


ఇళ్ల స్థలాల ముంపు భూముల్లో చేపల వల వేసి చేపలు పడుతూ నిరసన తెలిపారు. గ్రామంలో సుమారు 220 మంది లబ్ధిదారులకు కేటాయించిన  5 ఎకరాల స్థలం నీటమునగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దుద్దుకూరు, కృష్ణంపాలెం ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలాలు నివాసానికి ఆమోదయోగ్యంగా లేవన్నారు.   ద్వారకాతిరుమల మండలం  తిరుమలంపాలెం  పంచాయతీ పరిధిలో 2.76 ఎకరాల భూమిని 111 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు అధికారులు ఎంపిక చేశారు. గురువారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి ఎగువ నుంచి వాగు నీరు స్థలాల్లో చేరి చెరువులను తలపిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement