చల్లని వాన

ABN , First Publish Date - 2020-05-31T10:14:25+05:30 IST

వేసవి తీవ్రతకు అల్లాడుతున్న సమయంలో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా

చల్లని వాన

  • ఆదోని డివిజన్‌లో భారీ వర్షం
  • మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు
  • కూలిన గుడిసెలు, స్తంభాలు
  • తడిసిన వరి ధాన్యం, పత్తి
  • ఆదుకోవాలంటున్న  రైతులు
  • తుంగభద్రకు స్వల్పంగా నీరు
  • రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి, మే 30)

వేసవి తీవ్రతకు అల్లాడుతున్న సమయంలో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లదనంతో ప్రజలు ఊరట చెందారు. ఆరుబయట ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. గుడిసెలు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పిడుగుపాటుకు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఖరీఫ్‌ ఆరంభంలో కురిసిన ఈ వర్షం దుక్కి చేసుకునేందుకు ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు.


తడిసిన ధాన్యం

అవుకు: మండంలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అవుకులో 30 మి.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్డు పక్కన, కల్లాలు, మిల్లుల వద్ద ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఎకరానికి రూ.30 వేలు పెట్టామని, 25 బస్తాలకు మించి దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధాన్యం కూడా తడిసిపోయిందని, వ్యాపారులు రూ.వెయ్యి కూడా ఇచ్చేందుకు ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. 


కూలిన విద్యుత్‌ స్తంభాలు

డోన్‌(రూరల్‌): మండలంలో శనివారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 36.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. చిన్నమల్కాపురం పరిధిలో 12 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయని ట్రాన్స్‌కో రూరల్‌ ఏఈ చంద్రశేఖర్‌ తెలిపారు.


మడుగులా మారిన బస్టాండు 

కోసిగి: తేలికపాటి వర్షానికే పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు మడుగులా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండులో అడుగు పెట్టే పరిస్థితి లేదని వాపోతున్నారు. 


చెరువుకు గండి

పత్తికొండ రూరల్‌: భారీగా వరద నీరు చేరడంతో మండల పరిధిలోని చందోలి గ్రామ ఊరు చెరువుకు గండి పడింది. గత ఏడాది ఇదే చోట గండి పడినా మైనర్‌ ఇరిగేషన్‌ శాఖా అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో చెరువుకు వరదనీరు పోటెత్తింది. నీరు వృథా అవుతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


గాలి వాన

బండి ఆత్మకూరు: మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. గాలితో కూడిన వర్షం సుమారు 45 నిముషాల పాటు పడింది. దీంతో వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలు ఊరట చెందారు.


60 గొర్రెలు మృతి

బేతంచర్ల: మండల పరిధిలోని ఆర్‌ కొత్తపల్లెలో శుక్రవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగు పాటుకు 60 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. రూ.6 లక్షలకు పైగా నష్టం జరిగిందని జీవాల యజమాని బోంచేర్‌పల్లె లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. విషయాన్ని పశువైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరాడు. 


పొంగిపొర్లిన వాగులు

బేతంచర్ల: మండలంలోని ఆర్‌ కొత్తపల్లె, ఆర్‌ బుక్కాపురం గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వంకలు, వాగులు పొంగి పొర్లాయి. రంగాపురం, బేతంచర్ల ప్రాంతాల్లో తేలిక పాటి వర్షం కురిసింది. కొత్తపల్లె, బుక్కాపుం పొలాల్లో వర్షం నీరు నిలిచింది. దీంతో రైతులు ఖరీఫ్‌ సాగు కోసం దుక్కి దున్నుతున్నారు. 


ఉరుములు మెరుపులు 

గోనెగండ్ల: మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 12 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గోనెగండ్ల, ఐరన్‌బండ, కులుమాల, అలువాల, పెద్దమరివీడు, చిన్నమరివీడు వేముగోడు, హెచ్‌కైరవాడి, పుట్టపాశం గ్రామాల్లో వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. దుక్కి దున్నేందుకు ఈ వర్షం ఉపయోగ పడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. 


భారీ వర్షం 

ఆదోని/హొళగుంద: డివిజన్‌ పరిధిలో శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు గాలులు, ఉరుములతో ప్రారంభమైన వర్షం 7 గంటల వరకు కురిసింది. ఖరీఫ్‌ ఆరంభానికి ముందే వర్షాలు రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. హొళగుంద మండలం ఎల్లార్తి, చిన్నహ్యాట, పెద్దహ్యాట, సమ్మతగేరి, హొళగుందలో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. హొళగుందలోని నాయిబ్రాహ్మణ వీధిలో వర్షపునీరు ఇళ్లల్లోకి చేరింది. సమ్మతగేరి గ్రామం వద్ద  రోడ్డు కోతకు గురైంది. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.


కప్పల వాన

రుద్రవరం: మండలంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 23.6 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కొండమాయపల్లె సమీపంలో వర్షంతో పాటు పసుపు రంగు కప్పలు పడ్డాయి. ఉదయాన్నే వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి రంగు కప్పలను గతంలో ఎన్నడూ చూడలేదని గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి అన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు కప్పలు పడటం సహజమేనని ఏవో ప్రసాదరావు అన్నారు. కప్పల్లో చాలా రకాలు ఉన్నాయన్నారు. 


గుడిసెలు ధ్వంసం 

ఎమ్మిగనూరు: నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అక్కడక్కడ విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఎమ్మిగనూరులో 7 మి.మీ, నందవరంలో 18.6 మి.మీ, గోనెగండ్లలో 12 మి.మీ వర్షాపాతం నమోదయింది. దైవందిన్నె గ్రామంలో పలువురి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. ఎరుకలవీధిలో రెండు, ఎన్టీఆర్‌ కాలనీలో మూడు గుడిసెలు దెబ్బతిన్నాయి. ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు ఎగిరిపోయింది. పత్తి నిల్వ చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న గుడిసె పైకప్పు ఎగిరిపోవడంతో పత్తి మొత్తం తడిసి పోయిందని రైతు కురువ ఈరన్న ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నందవరం వండలం ముగతి గ్రామ పరిసరాల్లో 4 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకి అంతరాయం ఏర్పడింది


తుంగభద్రకు స్వల్పంగా ఇన్‌ఫ్లో

హాలహర్వి, మే 30: ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా నీరు వస్తోంది. జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం మట్టం 1584 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 6263 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 970 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 226 క్యూసెక్కులు ఉన్నాయి. ఈ ఏడాది తొలకరి పలకరింపుతోనే ఇన్‌ఫ్లో ప్రారంభం కావడంతో జిల్లా రైతుల ఆశలు చిగురిస్తున్నాయి.

Updated Date - 2020-05-31T10:14:25+05:30 IST