Abn logo
Jun 16 2021 @ 17:47PM

మచిలీపట్నంలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో భారీగా పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా మచిలీపట్నం కేంద్రంగా పీడీఎస్ రైస్ అక్రమ రవాణా సాగుతోంది. ఇప్పటికే పలు విడతలుగా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మచిలీపట్నంలోని తాతారావు కాలనీలో కందుల జయబాబుకు చెందిన ఇంట్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారు. సమాచారం అందుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులతో పాటు సివిల్ సప్లయీస్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో 270 క్వింటాళ్ల పీడీఎస్ రైస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

  అయితే ఈ బియ్యానికి సంబంధించిన బిల్లులు తన వద్ద ఉన్నాయని అధికారులకు కందుల జయబాబు తెలిపాడు. ఈ బిల్లులను పరిశీలించిన అధికారులు వాటిని నకిలీ బిల్లులుగా తేల్చారు. దీనిపై 6A కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ జాయింట్ కలెక్టర్ కోర్టులో జరుగుతుందని సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ మల్లిఖార్జునరావు తెలిపారు.