భారీగా నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-24T08:05:44+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ సారి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

భారీగా నామినేషన్లు

  • హైదరాబాద్‌కు 179,  నల్లగొండకు 76 
  • టీడీపీ నుంచి ఎల్‌.రమణ నామినేషన్‌
  • వాణి తరఫున హోంమంత్రి, మేయర్‌ దాఖలు
  • పల్లా, జయసారథి పోటా పోటీ ర్యాలీలు
  • ముగిసిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నామినేషన్లు

నల్లగొండ/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ సారి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన మంగళవారం హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికిగాను 51 మంది 89 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం అభ్యర్థుల సంఖ్య 110 కాగా.. నామినేషన్‌ సెట్ల సంఖ్య 179కి చేరింది. గడువు ముగిసే మధ్యాహ్నం 3 గంటల సమయానికి పదుల సంఖ్యలో అభ్యర్థులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ భవనం వద్దకు రావడంతో.. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయ సిబ్బంది టోకెన్లు జారీ చేశారు. టోకెన్ల ఆధారంగా పేర్లు పిలిచి అభ్యర్థుల నామినేషన్‌ తీసుకున్నారు. ఈ ప్రక్రియ దాదాపు 5.30 గంటల వరకు కొనసాగింది. ఇక నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం స్థానానికి చివరి రోజు 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం సంఖ్య 76కు చేరింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, సీపీఎం బలపరిచిన సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా మంత్రులు జగదీ్‌షరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 


జయసారథిరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్ములు తమ్మినేని వీరరభదం, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, మూడు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నామినేషన్‌ అనంతరం సభ నిర్వహించారు. పల్లా, జయసారధిరెడ్డి ర్యాలీలు ఒకే సమయంలో కలెక్టరేట్‌ వద్దకు చేరుకోవడంతో అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ సందర్భంగా వామపక్ష కార్యకర్తలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరగటంతో పోలీసులు సర్ది చెప్పి పంపించారు. కాగా, హైదరాబాద్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి భారీ ర్యాలీగా వచ్చిరు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి తరపున హోంమంత్రి మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు మూడు సెట్ల నామినేషన్లు వేశారు. సామల వేణు మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ స్థానానికి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో.. తుది జాబితాలోనూ ఇదే సంఖ్యలో అభ్యర్థులు ఉంటే భారీ బ్యాలెట్‌ అవసరం కానుంది. నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-02-24T08:05:44+05:30 IST