భారీగా నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-23T07:05:33+05:30 IST

రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి.

భారీగా నామినేషన్లు

  • ‘హైదరాబాద్‌’కు 59.. ‘నల్లగొండ’కు 48
  • హైడ్రామా మధ్య టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి దాఖలు
  • 3 గంటలు జీహెచ్‌ఎంసీ ఆఫీ్‌సలోనే పీవీ తనయ
  • పత్రాలు ఫార్మాట్‌లో లేకపోవడమే కారణం
  • పట్టభద్రులు ఆదరించి గెలిపించాలి: వాణీదేవి
  • కేసీఆర్‌, కేటీఆర్‌ పోటీ చేసినా ఓటమే: రాంచందర్‌
  • బీజేపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారు: పల్లా
  • పీవీ కుటుంబాన్ని అవమానించేందుకే..!
  • ఓడిపోయే సీటని తెలిసీ వాణీదేవికి చాన్స్‌: రేవంత్‌
  • కారు లేని పల్లా.. ఆస్తులు రూ.3.17 కోట్లు

హైదరాబాద్‌/నల్లగొండ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల 16 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మంగళవారంతో గడువు ముగియనుంది. హైదరాబాద్‌, నల్లగొండల్లో సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్లు వేశారు. చివరి రోజైన మంగళవారం పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులూ పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బుధవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 26 ఉపసంహరణకు గడువు. మార్చి 14న ఎన్నికలు నిర్వహించి, 17న ఫలితాలను వెల్లడిస్తారు. సోమవారం హైదరాబాద్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో ఎన్‌.రామచందర్‌రావు(బీజేపీ), ఎస్‌.వాణిదేవి(టీఆర్‌ఎస్‌), జి.చిన్నారెడ్డి(కాంగ్రెస్‌) తదితరులు ఉన్నారు. ‘హైదరాబాద్‌’ స్థానానికి సోమవారానికి మొత్తం 59 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. నల్లగొండలో నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), సబావత్‌ రాములునాయక్‌ (కాంగ్రెస్‌), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ), గోగుల రాణిరుద్రమ (యువ తెలంగాణ పార్టీ), బి.జయసారథిరెడ్డి(సీపీఐ), ముద్దసాని కోదండరాంరెడ్డి(టీజేఎస్‌), చెరుకు సుదాకర్‌(టీఐపీ), తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌) తదితరులు ఉన్నారు. కాగా, నల్లగొండ స్థానంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు టీఆర్‌ఎస్‌ నేతలే స్వతంత్ర అభ్యర్థులను భారీ సంఖ్యలో బరిలోకి దించుతున్నారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ‘నల్లగొండ’లో మొత్తం 48 మంది నామినేషన్లు వేశారు. వీరిలో దాదాపు 30 మంది స్వతంత్రులే కావడం గమనార్హం. 


పల్లాకు కారు లేదు.. 

‘నల్లగొండ’ నుంచి మరోసారి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆస్తులు రూ.31.7 కోట్లు. కానీ, ఆయనకు కారు లేదు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆస్తులు రూ.3.72 కోట్లు. పలువురు అభ్యర్థులు నామినేషన్లతో పాటు ఆస్తులు, విద్యార్హత, నేరచరిత్రకు సంబంధించిన అఫిడవిట్లను సమర్పించారు. ఇందులో కొందరి సమాచారం. 


పల్లా రాజేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో నివాసముండే పల్లా రాజేశ్వర్‌రె డ్డి(57) మొత్తం ఆస్తులు రూ.31.7 కోట్లు. నేర చరిత్ర లేదు. సొంత వాహనం లేదు. భార్య పేరిట మారుతి సెలెరియో కారు ఉంది. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.9.66 కోట్ల విలువైన భూములు ఆయన పేరిట, రూ.6.28 కోట్లు భార్య పేరిట, రూ.2.60 కోట్ల భూములు కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయి. రూ.4.10 కోట్ల అప్పు ఉంది. ఉస్మానియా వర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.  


గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

వరంగల్‌లో నివాసముంటున్న గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి(58) ఆస్తులు రూ.3.72 కోట్లు. వరంగల్‌లో ధర్నా సందర్భంగా ఐపీసీ 188, 341 కింద కేసు నమోదైంది. భార్యకు 75 తులాల బంగారు ఆభరణాలున్నాయి. రూ.86.79 లక్షల అప్పు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, మరాట్వాడా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 


ఎం.కోదండరాం

హైదరాబాద్‌ తార్నాకలో నివాసముంటున్న కోదండరాం (65) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. రూ.2.6 కోట్ల ఆస్తులున్నాయి. అప్పులు లేవు. నేర చరిత్ర లేదు. 


సబావత్‌ రాములునాయక్‌

హైద రాబాద్‌లో నివాసముండే రాములునాయక్‌ (56)కు నేర చరిత్ర లేదు. హైదరాబాద్‌, నారాయణఖే డ్‌లో నివాస గృహాలున్నాయి. ఆస్తుల విలువ రూ.1.88 కోట్లు. 


‘హైదరాబాద్‌’ అభ్యర్థులు..

జి.చిన్నారెడ్డి

వనపర్తికి చెందిన చిన్నారెడ్డి(65)పై పలు చిన్న కేసులు ఉన్నాయి. అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేశారు. పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఇళ్లు ఉన్నాయి.


కె.నాగేశ్వర్‌ 

కె.నాగేశ్వర్‌కు సుమారు రూ.4 కోట్ల వరకు స్థిర, చరాస్తులున్నాయి. నేర చరిత్ర లేదు. జర్నలిజంలో పీహెచ్‌డీ చేశారు.

Updated Date - 2021-02-23T07:05:33+05:30 IST