పొట్టన పెట్టుకుంది!

ABN , First Publish Date - 2020-10-30T06:35:53+05:30 IST

ఖరీఫ్‌ సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలన్నీ అడియాస లయ్యాయి. ఏపుగా పెరుగుతున్న వరిచేలు పొట్టపోసుకునే దశలో కురిసిన భారీ వర్షాలు రైతులకు అనూహ్య నష్టాన్ని కలిగించింది.

పొట్టన పెట్టుకుంది!
అమలాపురం రూరల్‌ నల్లమిల్లి-జనుపల్లి గ్రామాల మధ్య వర్షాల వల్ల కుళ్లిపోయిన చేను

  •  ‘పొట్ట’ దశలో వరి పంటకు పెద్ద దెబ్బ
  • ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలం
  • ఎకరాకు ఎనిమిది బస్తాలపైనే దిగుబడి తగ్గే అవకాశం
  • ఖరీఫ్‌ దిగుబడులపై ప్రభావం
  • పొడ తెగులు, ఆకుచుట్టుతో మరింత నష్టం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలన్నీ అడియాస లయ్యాయి. ఏపుగా పెరుగుతున్న వరిచేలు పొట్టపోసుకునే దశలో కురిసిన భారీ వర్షాలు రైతులకు అనూహ్య నష్టాన్ని కలిగించింది. పొట్ట దశలో వర్షాలు పడడం వల్ల వరి కంకుల్లో కేళీలు పెరిగిపోవడంతో దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎకరాకు ఎనిమిదికి పైగా బస్తాలు దిగుబడి తగ్గిపోవడంతోపాటు పెట్టుబడి వ్యయం దక్కని పరిస్థితి ఉందంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సీజనలో 2.26 లక్షల హెకార్టర్లలో జిల్లావ్యాప్తంగా వరి పంట సేద్యమైంది. పంట ఏపుగా పెరుగుతూ దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయన్న తరుణంలో అకాల వర్షాలు, వరదలు రైతుకు తీవ్రనష్టం కలిగించింది. జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో వరి పంట వరదలు, వర్షాల ప్రభావానికి తీవ్రంగా గురైంది. దీనికారణంగా జిల్లాలో రూ.150 కోట్ల పెట్టుబడి వ్యయాన్ని అన్నదాతలు నష్టపోయారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వర్షపు ముంపునీరు దిగకపోవడం వల్ల పంటచేలన్నీ వేల ఎకరాల్లో పూర్తిగా కుళ్లిపోయాయి. అయితే పంట నష్టాలు అంచనావేసే అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా కుళ్లిపోయిన చేలనే పంట నష్టాల్లో నమోదు చేసుకుంటున్నారు. కొంత మేర పచ్చగా ఉన్న చేలను సైతం పట్టించుకోవడం లేదు. అసలు చేలు ఏపుగా పెరుగుతున్నప్పటికీ పొట్టదశలోనే వరిచేలు నష్టపోతున్నాయి. ఎక్కువ రోజులు నీటిలో నానడం వల్ల వరి గింజలు సరిగా ఎదగకకుండా పొల్లు రూపంలో దిగు బడి రావడం వల్ల రైతుకు వచ్చి ఎకరాకు ఎనిమిది నుంచి పది బస్తాల పంట నష్టం కచ్చితంగా ఉంటుందని రాష్ట్ర రైతు సంఘ నాయకుడు మట్టా మహాలక్ష్మిప్రభాకర్‌ ఆవేదన చెందారు. ఖరీఫ్‌ సీజనలో ముంపు బారిన పడ్డ చేలకు పెట్టుబడి వ్యయం కూడా సమకూరే పరిస్థితులు లేవనేది మెజారిటీ రైతుల అభిప్రాయం. దీనికితోడు ప్రస్తుతం చేలపై ఆకు చుట్టూ పొడతెగులు వంటివి విస్తృతంగా వ్యాప్తి చెందుతుండడం వల్ల మరింత పంట నష్టం కలగనుందని రైతులు ఆందోళన చెందు తున్నారు. కోనసీమతో సహా అనేక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇప్పటికీ పంట చేలు నీళ్లలోనే నానుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కోతలు కోసేందుకు రైతులు సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో మళ్లీ అకాల

వర్షాలు సంభవిస్తే రైతుల ఆశలన్నీ అడియాశలు కావాల్సిందే. ఇక భారీ వర్షాల వల్ల ముంపులో ఉన్న పంట కుళ్లిపోయింది. కొన్నిచోట్ల చూస్తే వరి చేలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మళ్లీ నారుమ డులకు సిద్ధమయ్యాయా అనే రీతిలో దర్శనమిస్తున్నాయి. కుమ్మరికాల్వ డ్రైనను ఆనుకుని అయినవిల్లి మండలం నల్లచెరువు, నేదునూరు నుంచి అమలాపురం రూరల్‌ మండలం జనుపల్లె, నల్లమిల్లి మీదుగా అల్లవరం మండలంలోని అనేక గ్రామాల్లో పంట పూర్తిగా కుళ్లిన దశకు చేరింది. డ్రైనకు ఇరువైపులా ఉన్న వందల ఎకరాల్లో సాగు చేసిన రైతుల పరి స్థితి మరీ దయనీయంగా మారింది. ఒక్క కుమ్మరికాల్వ డ్రైనే కాదు జిల్లావ్యాప్తంగా ఉన్న మేజర్‌, మైనర్‌ డ్రైన్లను ఆనుకుని ఉన్న పంట చేలల్లోనూ ఇదే దుస్థితి. అధికారులకు ఇచ్చిన గైడ్‌లైన్స ఆధారంగా పూర్తిగా కుళ్లిపోయిన పంట చేలను మాత్రమే నష్టాల నమోదు జాబి తాలో చేరుస్తున్నారు. కొంత భాగం నష్టపోయినా సరే పంట నష్టాల్లో నమోదు చేయడం లేదన్నది రైతుల ఆరోపణ.

Updated Date - 2020-10-30T06:35:53+05:30 IST