తవ్వారు.. వదిలేశారు!

ABN , First Publish Date - 2022-06-28T04:39:34+05:30 IST

ఇంటర్‌నెట్‌ కేబుల్‌ వేయడానికి కాంట్రాక్టర్‌ తన

తవ్వారు.. వదిలేశారు!
కేశంపేటలో రోడ్డు పక్కన ప్రమాదకరంగా గొయ్యి

  • ఫైబర్‌ కేబుల్‌ కోసం భారీ గుంతలు
  • రోజుల తరబడి పెండింగ్‌లో పనులు
  • ప్రమాదకరంగా రోడ్డు వెంట గోతులు
  • సూచికలు ఏర్పాటు చేయని కాంట్రాక్టర్లు
  • ఇబ్బందుల్లో వాహనదారులు


కేశంపేట, జూన్‌ 27: ఇంటర్‌నెట్‌ కేబుల్‌ వేయడానికి కాంట్రాక్టర్‌ తన ఇష్టారాజ్యంగా రోడ్డు పక్కనే గోతులు తీస్తున్నారు. రోడ్డుకు ఆనుకుని తవ్వకాలు చేపట్టడం.. నెలలపాటు పనులను పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో ఆ గోతుల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేబుల్‌ వేయడానికి గోతులు తీయడం వల్ల కోట్లాది రూపాయలు వెచ్చించి వేసిన రహదారులు దెబ్బతింటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేశంపేట మండలంలోని 29 గ్రామపంచాయతీలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించడంలో భాగంగా ఫైబర్‌ కేబుల్‌ వేయడానికి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు కేబుల్‌ వేయాల్సి ఉంటుంది. కానీ కేశంపేట మండలంలో ఇంటర్‌నెట్‌ కేబుల్‌ కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు పక్కన కేబుల్‌ వేయడానికి రోడ్డుకు అతిసమీపంలో గుంతలు తవ్వుతున్నారు. కేబుల్‌ వేయడానికి 5నుంచి 6ఫీట్ల లోతు తవ్వుతున్నారు. పనులు పూర్తయినా తవ్విన గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న గుంతల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు కానీ, ప్రమాదాన్ని సూచించే రిబ్బన్లు గానీ ఏర్పాటు చేయడంలేదు. అంతేకాకుండా తవ్వితీసిని మట్టిని రోడ్డు పక్కనే పోయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుకు పక్కనే తీసిన గోతులలో నామమాత్రంగా మట్టి పోయడంతో వర్షాలకు కుంగిపోతుంది. వాహనదారులు ఒకవేళ రోడ్డు దిగితే గుంతల్లో వాహనాలు దిగబడిపోతున్నాయి. ఆయా గ్రామాలలో సర్పంచ్‌లు కాంట్రాక్టర్‌కు రోడ్డుకు దగ్గరగా గోతులు తీయొద్దని సూచించినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. అంతేకాకుండా ఇంటర్‌నెట్‌ తన కోసం వేసుకోవడంలేదని గ్రామ పంచాయతీలకు ఇస్తున్నామని కాంట్రాక్టర్‌ చెబుతున్నట్లు సర్పంచ్‌లు వాపోతున్నారు. నిబంధనల మేరకు పనులు చేయాలని వారు కోరుతున్నారు.


రోడ్డుపక్కన తవ్వొద్దని చెప్పినా పట్టించుకోవడం లేదు

కేశంపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారుల సమీపంలో ఇంటర్‌నెట్‌ కేబుల్‌ వేయడానికి గోతులు తవ్వదని కాంట్రాక్టర్‌కు సూచించినా పట్టించుకోవడం లేదు. గ్రామపంచాయతీల కోసమే కేబుల్‌ వేస్తున్నామని సమాధానమిస్తున్నారు. ప్రభుత్వం పనులను నియమ నిబంధనలతో కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది. కానీ ఇంటర్‌నెట్‌ కేబుల్‌ కాంట్రాక్టర్‌ గ్రామ పంచాయతీలకు తనే మేలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడు.

- తలసాని వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌, కేశంపేట


ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు

కేశంపేట మండలంలోని ప్రధాన రహదారి షాద్‌నగర్‌ రోడ్డుపై ఇంటర్‌నెట్‌ కేబుల్‌ వేయడానికి గోతులు తవ్వుతున్నారు. తవ్విన గుంతలను వారాలుగా అలాగే వదిలేసి వెళ్లిపోతున్నారు. అక్కడ కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కానీ.. సూచికలు కానీ ఏర్పాటు చేయడం లేదు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించాలి.

- పి. రమేష్‌యాదవ్‌, యువజన సంఘం నాయకుడు, చింతకుంటపల్లి



Updated Date - 2022-06-28T04:39:34+05:30 IST