కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద

ABN , First Publish Date - 2021-07-26T08:15:21+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరిధిలోని ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతోంది.

కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద

జూరాల, శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కులు..

జూరాల 44 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

పెరుగుతున్న శ్రీశైలం డ్యాం నీటి మట్టం

శ్రీరామసాగర్‌కు తగ్గిన ప్రవాహం.. గేట్ల మూత


 (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరిధిలోని ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతోంది. ఆలమట్టికి 3 లక్షలు, నారాయణపూర్‌కు 2.93 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాల, శ్రీశైలంలోకి  4 లక్షల క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో వస్తోంది. ఆదివారం ఉదయం జూరాల 44 గేట్లను ఎత్తి 4,05,064 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. శ్రీశైలం నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 864.60 అడుగుల (పూర్తి స్థాయి 885 అడుగులు)కు చేరింది. నాగార్జునసాగర్‌  పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.04 టీఎంసీలు) కాగా 538 అడుగుల (184.18 టీఎంసీలు) మేర నీరుంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46టీఎంసీలు) కాగా ప్రస్తుతం 636.90అడుగులు (2.54టీఎంసీలు)గా ఉంది.


కాగా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గింది. శ్రీరామసాగర్‌కు 29,770, ఎల్లంపల్లికి 46,917 క్యూసెక్కుల నీరు వస్తోంది. భద్రాచలం వద్ద ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన గోదావరి శాంతించింది. ఆదివారం సాయంత్రానికి వరద 41.4 అడుగులకు తగ్గింది. మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. వర్షాలు లేకపోవడంతో శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. మొత్తం గేట్లను మూసివేశారు. విద్యుదుత్పత్తికి మాత్రమే 8 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు (90 టీఎంసీలు) కాగా.. 1,089.70 (83 టీఎంసీలు) అడుగుల నీరుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 5,658 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405(17.802 టీఎంసీలు) అడుగులు కాగా.. 1,398.66 (9.974 టీఎంసీలు) అడుగులకు చేరింది. గోదావరి, ప్రాణహిత ప్రవాహం నెమ్మదించడంతో కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి ఇన్‌ఫ్లో ఆదివారం ఇంకాస్త తగ్గింది. 4.31 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 79 గేట్లను ఎత్తారు.


తుంగభద్ర గేట్లు ఎత్తివేత

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు 1,91,957 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం 12 గేట్లు ఎత్తి 36,217 క్యూసెక్కులను వదిలారు. ఈ నీరు సోమవారం సాయంత్రానికి రాజోలిబండ డైవర్షన్‌ స్కీంకు చేరనుంది. ఏటా ఆగస్టు ఆఖరి వారంలో నదికి నీరు వచ్చేది. ఈ సంవత్సరం నెల ముందుగానే నదికి వరద వచ్చింది.


పులిచింతలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం విద్యుదుత్పత్తి కొనసాగింది. నాలుగు యూనిట్లతో 80 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం రెండో భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో 24 గంటల్లో 14.63 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.  


28న అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న వెల్లడించారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2021-07-26T08:15:21+05:30 IST