భారీగా వరద

ABN , First Publish Date - 2022-08-11T08:16:21+05:30 IST

భారీగా వరద

భారీగా వరద

ఎగువ నుంచి ఉధృతి.. నేడు సాగర్‌ గేట్లు ఎత్తివేత!

583 అడుగులకు చేరిన నీటిమట్టం.. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

డ్యాం పది గేట్లు ఎత్తి నీటి విడుదల.. రేపు ప్రకాశం బ్యారేజీకి భారీ ప్రవాహం

మళ్లీ పోటెత్తిన ‘గోదావరి’.. ముంపులోకి పలు గ్రామాలు.. నిలిచిన రాకపోకలు


అమరావతి, నరసరావుపేట, శ్రీశైలం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎగువన కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగి గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. శ్రీశైలం ఇప్పటికే గరిష్ఠ నీటి మట్టంలో ఉండగా, నాగార్జున సాగర్‌ కూడా ఇదే స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తివేయగా, గురువారం నాగార్జున సాగర్‌ గేట్లను ఎత్తివేయనున్నారు.  శ్రీశైలం జలాశయంలో బుధవారం వరద భారీగా నమోదయింది. దీంతో డ్యాం అధికారులు పది క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,77,540 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 884.40 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా నమోదయింది. జూరాల నుంచి 221,143 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,56,766 క్యూసెక్కులు కలిపి మొత్తం 3,84,00 క్యూసెక్కులు జలాశయానికి వస్తోంది.  ఏపీ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 30,091 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు, డ్యామ్‌ ద్వారా 3,32,136 క్యూసెక్కులు మొత్తంగా 3,94,000 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలోనికి 3,84,00 క్యూసెక్కుల వరద వస్తుంటే.. 3,94,000 క్యూసెక్కుల భారీ వరద జలాలను విడిచిపెడుతున్నారంటే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌, తుంగభద్రల నుంచి ఏ స్థాయిలో వరద వస్తుందో అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నాగార్జున సాగర్‌ గరిష్ఠ నీటి నిల్వ 312.05 టీఎంసీలకు గాను 202.810 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 3,94,000 క్యూసెక్కుల వరద వస్తోంది. గురువారం ఉదయం నాటికి ఈ వరద రెట్టింపయ్యే అవకాశముంది. దీంతో గురువారం నాడు గేట్లను ఎత్తివేసి కిందకు జలాలు భారీగా విడిచిపెట్టే వీలుంది. ఇక పులిచింతల గరిష్ఠ నిల్వ 45.77 టీఎంసీలకు గాను ఏకంగా 39.08  టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 28216 క్యూసెక్కుల వరద వస్తుండగా, బయటకు 51703 క్యూసెక్కుల రెట్టింపు వరద  విడిచిపెడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నిల్వ 3.07 టీఎంసీల నిల్వ ఉంది. బ్యారేజీలోనికి 95889 క్యూసెక్కుల వరద వస్తుంటే.. 99,264 క్యూసెక్కులను సముద్రంలోనికి వదులుతున్నారు. శుక్రవారానికి బ్యారేజీకి 2.50 లక్షల క్యూసెక్కులతో భారీ ప్రవాహం రానుందని అంచనా కాగా, ఆదివారం నాటికి ప్రమాదకర స్థాయిలో 4.50లక్షల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతుందని చెబుతున్నారు. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌ గరిష్ఠ నిల్వ 129.72 టీఎంసీలకు గాను 120.78 టీఎంసీల నిల్వ ఉంది. ఆల్మట్టి నుంచి రెండు లక్షల క్యూసెక్కుల వరదను కిందకు వదిలేస్తున్నారు. గోదావరి నదిపై నిర్మించిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ బ్యారేజీ గరిష్ఠ నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీల నిల్వ కంటే .. భారీ స్థాయిలో 10లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా బయటకు వదులుతున్నారు. ఈ వరద ఉధృతి ఇంకా పెరిగే వీలుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


వరద సమాచారం లోనూ నిర్లక్ష్యమేనా?!

కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి పెరుగుతున్నా సమాచారాన్ని ప్రజలకు అందించడంలో జల వనరుల శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర జల వనరుల శాఖ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ఈ నెల 6వ తేదీ నాటి సమాచారమే కనిపిస్తోంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాజమాన్య నిర్వహణలో వైఫల్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, గోదావరి వరదల సమయంలో సురక్షిత ప్రాంతాలు తరలించక ముంపు గ్రామాల ప్రజలు అవస్థలకు గురయ్యారన్న విమర్శలున్నాయి. సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహిస్తే తప్ప.. యంత్రాంగంలో కదలిక రాదా అన్న విమర్శలొస్తున్నాయి. వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Updated Date - 2022-08-11T08:16:21+05:30 IST