పీఏబీఆర్‌కు భారీ వరద

ABN , First Publish Date - 2022-08-09T05:43:18+05:30 IST

పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు వరదనీరు పోటెత్తింది. దీంతో ఇరిగేషన అధికారులు సోమవారం ఉదయం డ్యాం గేట్లలో నాలుగింటిని ఎత్తి మిడ్‌ పెన్నార్‌ డ్యాంకు నీటిని వదిలారు.

పీఏబీఆర్‌కు భారీ వరద
పీఏబీఆర్‌ నుంచి విడుదలవుతున్న నీరు



గేట్లు ఎత్తిన అధికారులు

కూడేరు, ఆగస్టు 8 : పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు వరదనీరు పోటెత్తింది. దీంతో ఇరిగేషన అధికారులు సోమవారం ఉదయం డ్యాం గేట్లలో నాలుగింటిని ఎత్తి మిడ్‌ పెన్నార్‌ డ్యాంకు నీటిని వదిలారు. సాయంత్రానికి ఒక గేటు మూసేశారు. మూడు గేట్ల ద్వారా దాదాపు 3300 క్యూసెక్కుల నీటికి వదులుతున్నారు. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు పేరూరుడ్యాం నిండటంతో అక్కడి అధికారులు నీటిని దిగువకు వదిలారు. దీంతో పీఏబీఆర్‌కు వరద తాకిడి పెరిగింది. పేరూరు డ్యాం నుంచి 4700 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. పీఏబీఆర్‌ను 11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. వరద ఉధృతి నేపథ్యంలో డ్యాం నిండకనే ముందు జాగ్రత్త చర్యగా దిగువకు నీరు వదలుతున్నారు. డ్యాం గేట్లకు  ఈఈ శ్రీనివాసులు పూజ చేసి  స్విచ ఆన చేశారు. డీఈలు గురువయ్య, ఫక్కీరప్ప, ఏఈలు లక్ష్మిదేవి, గంగమ్మ, ఫాతిమా, స్వాతి, వెంకటరమణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పీఏబీఆర్‌ డ్యాం గేట్లు ఎత్తడంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూడేరు ఎస్‌ఐ సత్యనారాయణ బందోబస్తు ఏర్పాటు చేయించారు. పంట పొలాలు మునిగిపోయాయి. జయపురం, కొర్రకోడు తదితర గ్రామాల్లో వేరుశనగ పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎనిమిది ఎకరాల వేరుశనగ పొలంలో నీరు చేరిందని, పంట దెబ్బతింటోందని జయపురం గ్రామానికి చెందిన రైతు నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ముంపు బాధిత రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-09T05:43:18+05:30 IST