కొండంత కిటకిట..!

ABN , First Publish Date - 2022-05-16T06:25:58+05:30 IST

కొండంత కిటకిట..!

కొండంత కిటకిట..!

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం, శని, ఆదివారాలు సెలవులు కావడంతో అధికసంఖ్యలో వచ్చిన భక్తజనంతో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ రద్దీ కొనసాగింది. ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. ఎండ వేడికి తట్టుకోలేక వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించేందుకు వెళ్లిన భక్తులతో మహామండపంలోని రెండు, మూడు అంతస్థులు, కేశఖండనశాల, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం, ప్రసాదాల కౌంటర్లు, ఇతర పరిసరాలు సందడిగా మారాయి. కొండపైన, కొండ దిగువన భక్తుల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌ సమస్య తలెత్తింది. కాగా, ఆలయ పండితులు సూర్యోపాసన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో దాతల సహకారంతో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. 



Updated Date - 2022-05-16T06:25:58+05:30 IST