కట్టెల పొయ్యే దిక్కు

ABN , First Publish Date - 2022-07-10T04:14:04+05:30 IST

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది గ్యాస్‌ ధరల భారం భరించలేక సిలిండర్లు మూలన పెట్టేశారు. కట్టెలపొయ్యినే వినియోగిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో నెలకు ఒక సిలిండర్‌ వినియోగిస్తారు. అదే డబ్బులతో కట్టెలు కొనుగోలు చేస్తే.. నాలుగు నెలలపాటు వంటకు సరిపోతాయని మహిళలు అభిప్రాయపడుతున్నారు.

కట్టెల పొయ్యే దిక్కు

వంట గ్యాస్‌ ధర పెంపుతో పెను భారం
గ్రామాల్లో మూలకు చేరుతున్న సిలిండర్లు
(ఇచ్ఛాపురం రూరల్‌)

ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన బి.నూకమ్మ గతంలో ప్రభుత్వం నుంచి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకుంది. కరోనా వ్యాప్తి సమయం నుంచి ఉపాధి లేక ఆదాయం అంతంతమాత్రంగా ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఇటీవల గ్యాస్‌ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో.. రెండు నెలల నుంచి కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుంటోంది.

ఇచ్ఛాపురం మండలం లక్ష్మీపురానికి చెందిన జి.అడివమ్మ ఉపాధి పనులు, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరగడంతో.. కట్టెల పొయ్యిపైనే వంట చేస్తోంది.

...ఇలా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది గ్యాస్‌ ధరల భారం భరించలేక సిలిండర్లు మూలన పెట్టేశారు. కట్టెలపొయ్యినే వినియోగిస్తున్నారు. కట్టెల పొయ్యి పొగ ఓ గంట పీల్చితే.. 400 సిగరెట్ల పొగ పీల్చినదానితో సమానమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబమూ గ్యాస్‌ పొయ్యిపైనే వంట చేసుకునేందుకు వీలుగా గత టీడీపీ ప్రభుత్వం దీపం పథకాన్ని ప్రవేశపెట్టింది. దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేసింది. కాగా.. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర బెంబేలెత్తిస్తుండడంతో మహిళలు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు 6.80 లక్షల వరకు ఉన్నాయి. నెలకు సగటున 4.20లక్షల వరకు సిలిండర్లు వినియోగిస్తారు. ఈ నెలలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెంచడంతో.. జిల్లా వినియోగదారులకు నెలకు సుమారు రూ.2.50కోట్ల అదనపు భారం పడుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండేళ్లుగా సరైన ఉపాధి లేక పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి బడ్జెట్‌ నెలా నెలా పెరుగుతుండడంతో సతమతమవుతున్నారు. ప్రధానంగా రెండేళ్ల కిందట సిలిండర్‌ రూ.612 ఉండగా.. ప్రస్తుతం రూ.1080కి చేరింది. దీనికి రవాణా చార్జీలు అదనం. ఏడాదిలో రూ.350 పెరగడం.. సబ్సిడీ కూడా సక్రమంగా అందజేయకపోవడంతో కట్టెలపొయ్యి వైపు మహిళలు మొగ్గు చూపుతున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో నెలకు ఒక సిలిండర్‌ వినియోగిస్తారు. అదే డబ్బులతో కట్టెలు కొనుగోలు చేస్తే.. నాలుగు నెలలపాటు వంటకు సరిపోతాయని మహిళలు అభిప్రాయపడుతున్నారు.

 

Updated Date - 2022-07-10T04:14:04+05:30 IST