May 6 2021 @ 00:17AM

ఎడారిలో హెవీ యాక్షన్‌ ఎపిసోడ్‌

కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడిన చిత్రాల్లో మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రం ఒకటి. యువ దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్‌ దుబాయ్‌లో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు కానీ యూనిట్‌ సభ్యుల్లో ఒకరికి కరోనా వైరస్‌ సోకడంతో బ్రేక్‌ ఇచ్చారు. జూన్‌లో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ షెడ్యూల్‌ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. దుబాయ్‌లో జరిగిన షూటింగ్‌ గురించి ఓ ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు ఎడారిలో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించారు.  స్టంట్‌ డైరెక్టర్లు రామ్‌-లక్ష్మణ్‌ సారథ్యంలో పది రోజుల పాటు చిత్రీకరించిన ఈ ఎపిసోడ్‌ సినిమాలోని హైలైట్‌ అంశాల్లో ఒకటి అవుతుందని చెబుతున్నారు. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం ఎడారిలో ఓ సెట్‌ కూడా వేశారట! 

కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌,  మైత్రీ మూవీస్‌, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతల ప్లాన్‌.


మహేశ్‌- త్రివిక్రమ్‌ చిత్రానికి ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌?

ఇదిలా ఉంటే మహేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇటీవల ఓ కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘అతడు’ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే. తన సినిమాలకు ఆసక్తికరమైన టైటిల్స్‌ పెట్టడం దర్శకుడు త్రివిక్రమ్‌కు మొదటినుంచీ అలవాటు. అలాగే ఈ సినిమాకు ఆయన ‘పార్థు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘అతడు’ చిత్రంలో  హీరో పేరు పార్థు’ కావడం గమనార్హం. హారికా అండ్‌ హాసిని సంస్థ నిర్మించే ఈ చిత్రానికి ఇదే టైటిలా కాదా అన్నది ఈ నెల 31న అధికారికంగా తెలుస్తుంది.