Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడుపు ‘కోత’

v>అన్నమయ్య ప్రాజెక్ట్టు మట్టికట్ట కొట్టుకుపోయి..
ఆనవాళ్లు కోల్పోయిన వేల ఎకరాల సాగు భూములు
భారీగా కోతకు గురైన భూములు
425 హెక్టార్లలో ఇసుక మేటలు
వరదకు ముందు పచ్చని పంటలతో కళకళలాడిన కోనసీమ
మోడువారిన భూములు చూసి రైతు గుండె విలవిల
సాగులోకి రావాలంటే హెక్టారుకు రూ.10-12 లక్షలు ఖర్చు వస్తుందంటున్న రైతులు
ప్రభుత్వం ఇస్తామన్నది రూ.12,500

సెలయేటి పరవళ్లు.. పచ్చని వరి పైరు.. ఉద్యాన పంటలతో కళకళలాడే పంట పొలాలు. ఇంటింటా పాడి పోషణ. చెయ్యేరు నది పరీవాహక ప్రాంతం వందల సంవత్సరాలుగా పచ్చదనంతో నిత్యం ఆహ్లాదకరంగా ఉండేది. రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లో సుమారు 30 కి.మీలు నది ప్రవహిస్తోంది. ఎత్తిపోతల ద్వారా వివిధ పంటలు సాగు చేస్తూ పాడిపంటలతో కళకళలాడే ఆ ప్రాంతాన్ని కోనసీమ అని పిలుస్తారు. నవంబరు 18 తరువాత ఆ ప్రాంతం కన్నీటిసీమగా మారింది. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట అడ్డంగా కొట్టుకుపోవడంతో ఉప్పెనలా వచ్చిన వరద ఊళ్లు.. చేళ్లు ఏకం చేసింది. పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు అడ్డంగా కోతకు గురై.. ఇసుక మేట వేసి పొలాల ఆనవాళ్లు కూడా గుర్తించలేని విధంగా మారాయి. అన్నమయ్య ప్రాజెక్టు మా భూములను మింగేసింది.. సాగు యోగ్యంలోకి తీసుకురాలంటే హెక్టారుకు రూ.10-12 లక్షలు ఖర్చు వస్తుందంటున్న మట్టి మనుషుల కన్నీటి వ్యథలెన్నో. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట గత నెల 19న కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయే సమయంలో చెయ్యేరు నదిలో సుమారు 2.65-3.25 లక్షల క్యూసెక్కుల వరద ఉంది. రిజర్వాయర్‌ నిండుగా ఉంది. ఆనకట్ట తెగిపోవడంతో గంట వ్యవధిలో 9.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ఊళ్లపై పడింది. అంతా గంట వ్యవధిలో విధ్వంసం సృష్టించింది. ఆస్తి, ప్రాణనష్టం అపారం. అంచనాలకు అందనిది. ఆస్తులే కాదు.. కష్టజీవుల జీవనాధారమైన పంట పొలాలు అడ్డదిడ్డంగా కోతకు గురయ్యాయి. ఐదారు అడుగులకు పైగా గుంతలు పడ్డాయి. ఇసుక మేట వేసింది. పంట పొలాలు.. చెయ్యేరు ఏకమయ్యాయి. ఏకంగా 907.53 హెక్టార్లు (2,268.82 ఎకరాలు) పంట చేలు సాగుకు ఏమాత్రం పనికి రాకుండా పోయాయి. వందల ఏళ్లుగా వరి, ఉద్యాన పంటలతో కళకళలాడుతూ అన్నదాతలు, రైతు కూలీలకు అన్నం పెట్టిన భూములను అన్నమయ్య ప్రాజెక్టు మింగేసిందంటూ కన్నీళ్లు పెడుతున్నారు. 

సాగులోకి  వచ్చేదెన్నడో..?
చెయ్యేరు నదీ పరీవాహక పల్లెసీమలు పులపత్తూరు, మందపల్లి, తొగూరుపేట, రామచంద్రాపురం, గుండ్లూరు, పాటూరు, ఊటుకూరు, ఆర్‌.బిడగుంటపల్లి, మిట్టమీదపల్లి, తాళ్లపాక, చింతలకోన, బగిడిపల్లి, నూతిపల్లి, పాపరాజుపల్లి, సాలిపేట తదితర గ్రామాలు ఉన్నాయి. తాతలు.. వారి తాతల కాలం నుంచి వందల ఏళ్లుగా చెయ్యేరు నదినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. నదీ తీరంలో విద్యుత పంపులు ఏర్పాటు చేసుకొని వరి, అరటి, మామిడి, సపోటా వంటి పంటలు సాగు చేస్తూ ఆనందంగా సాగిపోయే రైతు కుటుంబాలు ఎన్నో. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో వందల ఏళ్లుగా ఆధారమైన పంట పొలాలు కోతకు గురై.. ఐదారు అడుగులు ఇసుక మేటలు వేశాయి. జిల్లా అంతటా 483.16 హెక్టార్లలో ఇసుక మేటలు, 424.37 హెక్టార్లలో పంట పొలాలు కోతకు గురయ్యాయని జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదక. రెండు కలిపతే 907.53 హెక్టార్లు (2,268.82 ఎకరాలు) అన్నమాట. అందులో 85 శాతానికి పైగా చెయ్యేరు నదీ పరీవాహక పొలాలే. అందులోనూ పులపత్తూరు, మందపల్లి, తొగూరుపేట, రామచంద్రాపురం, పాటూరు, గుండ్లూరు ప్రాంతాల్లోనే ముప్పాతిక శాతం భూములు దెబ్బతిన్నాయి. జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. భూములు బాగు చేసి సాగు యోగ్యంలోకి తీసుకురావాలంటే ఎన్నేళ్లు పడుతుందో..? అంటూ రైతులు అంటున్నారు. కోతకు గురై.. ఇసుక మేటలు వేసిన పొలాలు చూస్తే ఏ పొలం ఎక్కడుందో.. ఏ రైతుదో గుర్తించడమే కష్టంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. బాగు చేయాలంటే ఎకరాకు సరాసరి రూ.5-6 లక్షలు చొప్పున హెక్టారుకు సుమారు రూ.10-12 లక్షలకు పైగా ఖర్చు వస్తుంది. ప్రభుత్వం కేవలం హెక్టారుకు రూ.12,500 (ఎకరాకు రూ.5 వేలు) ఇస్తుందని పులపత్తూరు పర్యటనలో సీఎం జగన హామీ ఇచ్చారు. అది ఓ గంట ఎక్స్‌కవేటర్‌ బాడుగకు కూడా సరిపోదు.. ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం ద్వారానో.. మరే ఇతర ప్రత్యేక పథకం ద్వారానో అన్నమయ్య ప్రాజెక్టు ఛిద్రం చేసిన పంట భూములు బాగు చేసి ఇవ్వాలని కోరుతున్నారు. 

మా భూమి ఏదో గుర్తించలేననంతగా కోతకు గురైంది 
- అశోక్‌కుమార్‌రెడ్డి, పులపత్తూరు
చెయ్యేరు నది ఒడ్డునే మాకు ఏడెకరాల పొలం ఉంది. మా తాతల కాలం నుంచి వరి, అరటి పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఐదు ఎకరాల్లో అరటి వేశాం. ఏటా రూ.25 లక్షలకుపైగా ఆదాయం వచ్చేది. జీవనాధారమైన చెయ్యేరు నది ఏనాడూ మాకు అన్యాయం చేయలేదు. ఎన్నోసార్లు వరదలు వచ్చినా పొలం గట్టుదాటి వచ్చేది కాదు. అన్నమయ్య ప్రాజెక్టు ఏ ముహుర్తాన కట్టారో మమ్ములను నిలువునా ముంచేసింది. ఏడెకరాల పంట పొలం అడ్డంగా కోతకు గురై.. ఇసుక మేట వేసి ఏమాత్రం సాగుకు పనికి రాకుండా పోయింది. మా భూమి ఎక్కడుందో గుర్తించలేనంతగా కోతకు గురైంది. ఒక ఎకరాను బాగు చేయాలంటే కనీసంగా రూ.5 లక్షలు చొప్పున. ఏడెకరాలకు రూ.35 లక్షలకు పైగా ఖర్చు వస్తుంది. సర్వం కోల్పోయిన మేము అంత డబ్బు అప్పులు చేసి బాగు చేసుకోగలమా..? ఈ పరిస్థితుల్లో మాకు అప్పు ఎవరిస్తారు. ప్రభుత్వం కేవలం ఎకరాకు రూ.5 వేలు ఇస్తామంటోంది. అది ఏ మూలకూ సరిపోదు. మాకు నష్టపరిహారం వద్దు.. ఉపాధి హామీ పథకం కిందనో.. మరే ఇతర పథకాల కిందనో ప్రభుత్వమే అన్నమయ్య ప్రాజెక్టు ఛిద్రం చేసిన భూములు బాగు చేసి సాగుయోగ్యంలోకి తీసుకురావాలి. అప్పుడే రైతులు కోలుకుంటారు. 

ఐదారు అడుగులు ఇసుక మేటలు వేసింది 
- కొండా జయమ్మ, ఎగువ మందపల్లి గ్రామం 
అయ్యా..! మాకు చెయ్యేరు నది ఆధారంగా మూడు ఎకరాలు పొలం ఉంది. చెయ్యేరు నది నీటిలో వరి పైరు సాగు చేస్తున్నాం. ఆ పొలమే మాకు జీవనాధారం. మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. ఈ ఏడాది వరి పంట పచ్చగా పెరిగింది. రేపోమాపో పంట కోద్దామనే సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి మాయదారి వరద నిలువునా ముంచేసింది. సర్వం కోల్పోయాం. జీవనాధారమైన మూడెకరాల్లో ఐదారు అడుగులపైగా ఇసుక  మేట వేసింది. ఆ భూమిని బాగు చేయాలంటే మా చేతకాదు. ఎంత ఖర్చు వస్తుందో కూడా తెలియదు. ప్రభుత్వమే ఇసుక మేట తొలగించి ఇవ్వాలి. అన్నమయ్య ప్రాజెక్టే మా పొలాలను మింగేసింది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఊరు వదిలి వెళ్లాల్సి వస్తుందేమో.

పొలం అంతా రాళ్లగుట్టగా మారింది 
- శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచి, పులపత్తూరు
చెయ్యేరు నది తీరంలోనే మాకు 25 ఎకరాల పొలం ఉంది. అందులో ఆరు బోర్లు తవ్వాం. విద్యుత పంపుల ద్వారా వివిధ పంటలు సాగు చేస్తున్నాం. పదెకరాల్లో మామిడి తోట పెట్టాం. 450 మామిడి చెట్లు ఉండేవి. మా పొలం పక్కనే రాళ్ల గుట్ట ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల వరద ఉప్పెనలా వచ్చేసింది. ఆ వరద వేగానికి పొలం పక్కనే రాళ్లగుట్ట కొట్టుకుపోయి మా పొలంలో పడేసింది. మామిడి తోటంతా అడ్డదిడ్డంగా కోతకు గురైంది. మా పొలం రాళ్ల కుప్పగా మారింది. పొలమేదో.. రాళ్ల గుట్టేదో గుర్తించలేని విధంగా మారింది. పదేళ్లకైనా సాగులోకి వస్తుందా..? అన్న నమ్మకం లేదు. పొలాన్ని బాగు చేసుకోవాలంటే ఎకరాకు రూ.10 లక్షలు ఖర్చు వస్తుందని నా అంచనా. ఇంకా ఎక్కువే కావొచ్చేమే. నా ఒక్కడి పరిస్థితే కాదు.. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి సాగు భూములు ఛిద్రం అయిన ప్రతి రైతుదీ ఇదే పరిస్థితి. 
Advertisement
Advertisement