జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

ABN , First Publish Date - 2022-05-07T07:13:09+05:30 IST

జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా జిల్లాలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అప్రమత్తమవుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు 

నియోజకవర్గాల్లో పట్టుకోసం పార్టీ నేతల ప్రయత్నాలు

క్యాడర్‌ను ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమాలు

జిల్లాలో రాజకీయ నేతల సుడిగాలి పర్యటనలు

నిజామాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా జిల్లాలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అప్రమత్తమవుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికివారే తమ క్యాడర్‌ బలోపేతంపై దృష్టిపెడుతున్నారు. ఎలాగైనా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నియోజకవర్గాలపైన దృష్టిపెడుతున్నారు. తమ క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యక్రమాల్లో దూకుడు పెంచుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉండడంతో కొంతమంది పార్టీలు మారుతుండగా.. మరికొంతమంది తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకుని ప్రయత్నాలు చేస్తున్నారు.

    రెండు దఫాలుగా టీఆర్‌ఎస్‌కే పట్టం..

జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. గడిచిన రెండు దఫాలు వారే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు ఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులకే జిల్లా ప్రజలు పట్టంకట్టారు. వీరితో పాటు మండలాలు, స్థానిక సంస్థల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిదులే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలైనా కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానిక సంస్థల్లో మాత్రమే కొద్దిమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రభుత్వం టీఆర్‌ఎస్‌లో ఉండడంతో ఈ ఏడున్నర ఏళ్లలో పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆ పథకాలను మరింత ఎక్కువగా అమలు చేయడంతో పాటు పెండింగ్‌ పనులన్నీ పూర్తిచేస్తున్నారు. రైతులు, ఇతర వర్గాల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టి ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. సంవత్సరంలోపు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగానే సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోలు, ఇతర పంటల కొనుగోళ్లపై దృష్టిపెట్టిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌కిట్‌తో పాటు ఇతర పథకాలను సక్రమంగా అందే ఏర్పాట్లను చేస్తున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో పాటు అవసరమైన వారికి ఆరోగ్య చికిత్సల కోసం నిధులను మంజూరు చేయిస్తున్నారు. నియోజకవర్గాల్లో కలియతిరుగుతూ అవసరమైన పనులు చేస్తున్నారు. పసుపుబోర్డును ఆయుధంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలను ఇరుకునపెడుతున్నారు. జిల్లాలో తమకు ఎదురులేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, సభలు  జరుగుతుండడంతో వాటికి దీటుగా జవాబు చెప్పడంతో పాటు జిల్లాలో ఆ పార్టీలపై పట్టుసాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చిన సమయంలోలాగానే ఇతర పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సీనియర్‌నేతలను పార్టీల్లో చేర్చుకుంటున్నారు. జిల్లాలోని నేతలందరు సంఘటితంగా కదులుతూ ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు దీటుగా ప్రత్యారోపణలు చేస్తున్నారు. గత సంవత్సరంకంటే భిన్నంగా జిల్లా నేతలంతా కలిసి కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఏ గ్రామం పరిధిలో ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు, పింఛన్‌ధారులతో పాటు ఇతరులను ఆకట్టుకునేవిధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

     ప్రతిపక్ష పార్టీల దూకుడు.. 

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడం, సంవత్సరం వరకే సమయం ఉండడంతో ప్రతిపక్ష పార్టీలు కూడా అదే రీతిలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నియోజకవర్గాల్లో తమకు గడిచిన ఎనిమిదేళ్లుగా పట్టు లేకపోవడంతో ఈ దఫా ఎలాగైనా ప్రాతినిథ్యం వచ్చేవిధంగా చూడాలని పట్టుదలతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉన్న నేతలను వెతుకుతూ వారిని తమ పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని నచ్చజెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు. గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్యాడర్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

    ఉనికిని కాపాడుకేనేందుకు బీజేపీ యత్నం..

జిల్లాలో బీజేపీకి ఎంపీతో పాటు మున్సిపాలిటీల్లో కొంత బలం ఉండడంతో జిల్లాలో ఈ దఫా ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో బలోపేతం చేయడంతో పాటు బలమైన నేతలను బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంతో పాటు అవసరమైతే ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారులను కూడా బరిలో దించేందుకు రాష్ట్ర, కేంద్రస్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జాతీయ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా వారిని చేర్చుకోవడంతో పాటు మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో తగిన సీట్లు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల వారిని చేర్చుకుని మరింత బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన సునిల్‌రెడ్డితో పాటు ఇతర పార్టీల నేతలను కూడా చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీతో పాటు ఇతర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంపైన బీజేపీ నేతలు దుయ్యబట్టడంతో పాటు పథకాలపైన నిలదీస్తూ ముందుకుపోతున్నారు. యువతతో పాటు ఇతర వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ దృష్టి..

ఈ దఫా కాంగ్రెస్‌ కూడా అన్ని నియోజకవర్గాలపైన దృష్టిపెట్టింది. ఎలాగైనా ప్రాతినిథ్యం సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి జవసత్వాలు ఇవ్వడంతో పాటు జిల్లా సీనియర్‌ నేతలను కలుపుకుని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏ నియోజకవర్గంలోనైతే బలమైన నాయకత్వంలేదో అక్కడ కొత్తవారిని చేర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీచేసి హామీ ఇచ్చి ముందుకుపోయేవిధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతు సమస్యలను బేస్‌గా చేసుకుని ముందుకు పోతున్నారు. పాత నేతలను తిరిగి పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలుపుగుర్రాలకే అవకాశం ఇవ్వనుండడంతో ముందస్తుగానే కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

జిల్లాలో అన్ని పార్టీలు ఒకేసారి కార్యక్రమాలు చేపట్టడంతో ఎండలలో సైతం రాజకీయ వేడి కనిపిస్తోంది. ఎన్నికలకు సంవత్సరంకుపైగా కాలం ఉన్న అప్పటి వరకు జోరుగా అన్ని పార్టీలనేతలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం జిల్లాలో ఇకపెరిగే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజుల్లో సీనియర్‌ నేతలు పార్టీలు మారే అవకాశం ఉండడంతో మరింత రసవత్తరంగా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది.

Read more