వేడెక్కిన రాజకీయం

ABN , First Publish Date - 2021-10-08T05:13:07+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికతో రాజకీయ వేడి రాజుకుంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ఒక్కరోజే మిగిలి ఉంది. దీంతో వివిధ పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి పనతల సురే్‌ష, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపీ కమలమ్మ గురువారం నామినేషన దాఖలు చేశారు.

వేడెక్కిన రాజకీయం
మన పార్టీ అభ్యర్థి శీలం చెన్నయ్య వెంట ఉన్న బద్వేలు మున్సిపల్‌ చైర్మన రాజగోపాల్‌ రెడ్డి

బద్వేలు బరిలో బీజేపీ.. నామినేషన దాఖలు

గురువారం ఒక్క రోజే పది నామినేషన్లు

మన పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లిన మున్సిపల్‌ చైర్మన

వైసీపీలో కలకలం.. ఆ వెంటనే వివరణ

నేడు నామినేషన్ల దాఖలుకు ఆఖరు

(కడప-ఆంధ్రజ్యోతి): బద్వేలు ఉప ఎన్నికతో రాజకీయ వేడి రాజుకుంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ఒక్కరోజే మిగిలి ఉంది. దీంతో వివిధ పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి పనతల సురే్‌ష, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపీ కమలమ్మ గురువారం నామినేషన దాఖలు చేశారు. టీడీపీ, జనసేన మినహా ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉన్నాయి. ఇప్పటి వరకు 13 నామినేషన్లు రాగా.. గురువారం ఒక్క రోజే పది నామినేషన్లు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 5.00 గంటలకు నామినేషన్ల స్వీకరణకు ఆఖరు గడవు.


బీజేపీ అభ్యర్థిగా సురేష్‌

బద్వేలు ఉపసమరంలో బీజేపీ అభ్యర్థిగా బీజేవైఎం జాతీయ కార్యదర్శి పనతల సురే్‌షను అధిష్టానం ఎంపిక చేసింది. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పొందలూరు గ్రామానికి చెందిన సురేష్‌ ఎంబీఏ చేశారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. 2018-19 బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఏబీవీపీ, బీజేవైఎంలో చేసిన సేవలు గుర్తించిన అధిష్టానం సురే్‌షను అభ్యర్థిగా ఎంపిక చేసింది. గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే జయరాములుతో కలసి వెళ్లి నామినేషన దాఖలు చేశారు.


ఒక్కరోజే 10 నామినేషన్లు..

బద్వేలు ఉప ఎన్నికకు 5వ రోజైన గురువారం 10మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంపీ కమలమ్మ, బీజేపీ అభ్యర్థిగా పి.సురేష్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతనగార్గ్‌కు నామినేషన్లు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పి.బాలక్రిష్ణ, హరిప్రసాద్‌, చిన్న, మనపార్టీ అభ్యర్థిగా శీలం చెన్నయ్య, తెలుగు జనతాపార్టీ అభ్యర్థిగా ఓబుళాపురం ఓబులేసు, వైసీపీ డమ్మీ అభ్యర్థిగా వేముల సుబ్బరాజు, మహాజన పార్టీ అభ్యర్థిగా సంగటి మనోహర్‌, ఇండియా ప్రజాబంధుపార్టీ అభ్యర్థిగా పి.నాగరాజు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 13 మంది నామినేషన్లు వేశారు.


వైసీపీలో కలకలం..!

మన పార్టీ అభ్యర్థిగా శీలం చెన్నయ్య నామినేషన పత్రాలను రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌కలెక్టరు కేతన గార్గ్‌కు గురువారం అందజేశారు. ఆయనతో పాటు నామినేషన్ల దాఖలుకు బద్వేలు వైసీపీ మున్సిపల్‌ చైర్మన వాకమల రాజగోపాల్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దివంగత ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుధాను వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 2వ తేదిన ఆమె నామినేషన దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సజ్జల, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి తదితరులు హాజరు అయ్యారు. అయితే.. బద్వేలు 27వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ రమాదేవికి స్వయాన మామ శీలం చెన్నయ్య మన పార్టీ అభ్యర్థిగా నామినేషన వేయడం, ఆ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన హాజరు కావడంతో వైసీపీలో కలకలం రేగింది. వైసీపీలో ఏం జరుగుతోంది..? అనే చర్చకు తెరలేసింది. ఇది పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతలోనే మున్సిపల్‌ చైర్మన తేరుకొని.. మా అభ్యర్థి డాక్టరు సుధానే.. శీలం చెన్నయ్య చేత డమ్మీ అభ్యర్థిగా నామినేషన వేయించామని పేర్కొనడం కొసమెరుపు. డమ్మీ అభ్యర్థిగా వేయించారా..? ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వాహనాల అనుమతి, ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్ల కోసం చెన్నయ్య చేత నామినేషన వేయించారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

Updated Date - 2021-10-08T05:13:07+05:30 IST