వేడెక్కిన నగరి రాజకీయాలు.. ఒక గొడుగు కిందకు చేరనున్న Roja వ్యతిరేక వర్గాలు!

ABN , First Publish Date - 2021-12-13T08:06:17+05:30 IST

సీఎం జగన్‌ జన్మదిన వేడుకలకు చేయాల్సిన ఏర్పాట్ల పేరిట నేడు నగరిలో వైసీపీ నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ అధికార పార్టీలో పలు వర్గాలున్న నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే రోజాతో పొసగని వర్గాలన్నీ కలసి ఒక గొడుగు కిందకు చేరనున్నాయి.మరోవైపు ఎమ్మెల్యే రోజా అనుకూల వర్గం కూడా ఇదే అంశంపై సమావేశమవుతోంది.

వేడెక్కిన నగరి రాజకీయాలు.. ఒక గొడుగు కిందకు చేరనున్న Roja వ్యతిరేక వర్గాలు!

  • జగన్‌ జన్మదిన వేడుకలకు ఏర్పాట్ల పేరిట
  •  నేడు వైసీపీ పోటాపోటీ సమావేశాలు


పుత్తూరు, డిసెంబరు 12: సీఎం జగన్‌ జన్మదిన వేడుకలకు చేయాల్సిన ఏర్పాట్ల పేరిట నేడు నగరిలో వైసీపీ నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ అధికార పార్టీలో పలు వర్గాలున్న నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే రోజాతో పొసగని వర్గాలన్నీ కలసి ఒక గొడుగు కిందకు చేరనున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే రోజా అనుకూల వర్గం కూడా ఇదే అంశంపై సమావేశమవుతోంది.


నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాను వ్యతిరేకించే వర్గాలు చాలానే వున్నాయి. ముఖ్యంగా మున్సిపల్‌ మాజీ అధ్యక్షులు కేజే కుమార్‌, కేజే శాంతి దంపతులకు, రోజాకు నడుమ వివాదాలున్నాయి.ఎమ్మెల్యే సిఫారసుతో నిమిత్తం లేకుండా శాంతి ఏకంగా కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని సాధించుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంలో కూడా ఎమ్మెల్యే రోజాకు, కేజే కుమార్‌ వర్గానికి నడుమ వివాదం తలెత్తడం చివరికి బీఫామ్‌ల విషయంలో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు కావడం జరిగింది. నిండ్ర మండలానికి చెందిన ముఖ్యనేత రెడ్డివారి చక్రపాణిరెడ్డి సైతం ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ పదవి దక్కించుకున్నారు. ఇటీవల నిండ్ర మండల పరిషత్‌ ఎన్నికల్లో చక్రపాణిరెడ్డి వర్గం అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఎమ్మెల్యే రోజా పట్టుపట్టి ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు వేయించి చివరకు తను సిఫారసు చేసిన అభ్యర్థినే ఎంపీపీగా నియమించుకోగలిగారు.


విజయపురం మండలంలో జనరల్‌ కేటగిరీకి చెందిన ఎంపీపీ పదవిని లక్ష్మీపతి రాజు ఆశించగా ఎమ్మెల్యే రోజా ఎస్టీ అభ్యర్థిని ఎంపీపీగా ఎంపిక చేయించారు. పుత్తూరు మండలంలో మండల, మున్సిపల్‌ ఎన్నికల్లో అమ్ములు వర్గం ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే రోజా దూరం పెట్టారు. దానికి తోడు ఆ వర్గానికి చెందిన ఐదుగురు నాయకులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మొత్తం పరిణామాలతో నగరిలో కేజే కుమార్‌, శాంతి దంపతుల వర్గం, నిండ్రలో చక్రపాణిరెడ్డి వర్గం, పుత్తూరులో అమ్ములు వర్గం, విజయపురంలో లక్ష్మీపతిరాజు వర్గం, వడమాలపేటలో మాజీ ఎంపీపీ మురళీరెడ్డి వర్గం.... ఇలా బలమైన వర్గాలన్నీ రోజాకు వ్యతిరేకంగా మారాయి. తొలినుంచీ పార్టీ కోసం పనిచేసిన తమను గుర్తించకుండా, తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా టీడీపీ నుంచీ చేరిన వారికి ప్రాధాన్యత, పదవులు ఇస్తున్నారని ఈ వర్గాలన్నీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో వుంటున్నాయి. అయితే ఎవరికి వారుగా వుండడంతో ఎమ్మెల్యే రోజాను ఎదుర్కొనగలిగిన పరిస్థితి లేకుండా పోయింది. దీన్ని గ్రహించిన వ్యతిరేక వర్గాలన్నీ ఇపుడు ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. దానికి జగన్‌ జన్మదిన వేడుకలను సందర్భంగా తీసుకున్నారు.


జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు చేసే విషయమై చర్చించాలనే అజెండాతో నేడు నగరిలో ఈ వర్గాలన్నీ ఒకటై సమావేశం నిర్వహిస్తున్నాయి.మరోవైపు ఎమ్మెల్యే అనుకూల వర్గం కూడా సమావేశం అవుతోంది. దీనికి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హాజరై తమ వర్గం నేతలతో ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు. ఈ నేపఽధ్యంలో సోమవారం జరిగే సమావేశాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో, అవి నియోజవకర్గ వైసీపీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాల్సివుంది.

Updated Date - 2021-12-13T08:06:17+05:30 IST