భారత్ పరిస్థితి చూస్తుంటే గుండె చెరువవుతోంది: కెవిన్ పీటర్సన్

ABN , First Publish Date - 2021-05-04T20:50:49+05:30 IST

కరోనాతో కకావికలం అవుతున్న భారత పరిస్థితి చూస్తుంటే మనసు ద్రవించి పోతోందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్

భారత్ పరిస్థితి చూస్తుంటే గుండె చెరువవుతోంది: కెవిన్ పీటర్సన్

న్యూఢిల్లీ: కరోనాతో కకావికలం అవుతున్న భారత పరిస్థితి చూస్తుంటే మనసు ద్రవించి పోతోందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పలువురు ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారినపడడంతో మరో గత్యంతరం లేక టోర్నీని వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆ వెంటనే పీటర్సన్ ఓ ట్వీట్ చేశాడు. తానెంతగానో ఇష్టపడే భారత్‌లో ఇలాంటి పరిస్థితి చూస్తుంటే తన గుండె చెరువు అయిపోతోందని పీటర్సన్ ఆ ట్వీట్‌లో పేర్కొంటూ కన్నీరు కారుస్తున్న ఎమోజీని తగిలించాడు. దీని నుంచి భారత్ బయటపడుతుందని, మరింతగా బలంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ చూపించే కరుణ, ఔదార్యం ఊరికే పోవని అభిప్రాయపడ్డాడు. 


ఐపీఎల్‌లో భాగంగా నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి కరోనా బారినపడడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ముగ్గురు కూడా పాజిటివ్‌గా తేలారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ కేపిటల్స్ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా కరోనాతో జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీబీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించింది. ఐపీఎల్‌ను తక్షణం వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 

Updated Date - 2021-05-04T20:50:49+05:30 IST