పందుల నుంచి గుండె మార్పిడి ఓ వరం

ABN , First Publish Date - 2022-01-20T07:17:12+05:30 IST

ఏటా అవయవాలు పాడై తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొనే వారు కొన్ని లక్షలమంది ఉంటున్నారు. ముఖ్యంగా భారత్‌లో అవయవదాతలు దొరక్క చాలామంది కన్నుమూస్తున్నారు. ఇలాంటి..

పందుల నుంచి గుండె మార్పిడి ఓ వరం

 అవయవమార్పిడికి  దాతల కొరత తీవ్రంగా ఉంది

 తీవ్రస్థాయి హృద్రోగం ఉన్నవారికి  ఈ విధానం ఉపయుక్తం

 ఇది ఆధునిక వైద్యంలో ఒక కొత్త అధ్యాయం

  ‘కిమ్స్‌ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ డైరెక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ 


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):  ఏటా అవయవాలు పాడై తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొనే వారు కొన్ని లక్షలమంది ఉంటున్నారు. ముఖ్యంగా భారత్‌లో అవయవదాతలు దొరక్క చాలామంది కన్నుమూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌లోని వైద్యులు తొలిసారిగా పంది గుండెను మనిషికి విజయవంతంగా అమర్చడంపై కిమ్స్‌ ఆసుపత్రి అనుబంధ సంస్థ కిమ్స్‌ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్‌ డాక్టర్‌ సందీప్‌ అత్తావర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక వరమని, ఆధునిక వైద్యశాస్త్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమని ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. తీవ్రస్థాయి హృద్రోగం ఉన్నవారికి ఉపయుక్తంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేరీల్యాండ్‌ వర్సిటీ పరిశోధకుల సమాచారం ప్రకారం.. 57 ఏళ్ల వ్యక్తికి అమర్చిన పంది గుండె ఎలాంటి సాయం లేకుండా కొట్టుకుంటోంది.


గుండె వైఫల్యంతో చివరి దశలో ఉన్నవారు ఒక్క అమెరికాలోనే 50 వేలమంది వరకూ ఉన్నారు. వారికి గుండెమార్పిడి అత్యవసరం. ప్రస్తుతం బ్రెయిన్‌డెడ్‌ అయినవారి నుంచే గుండె సేకరిస్తున్నాం. కానీ పనిచేస్తున్నవి నాలుగు వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో అవయవాలకు, దాతలకు తీవ్ర కొరత నెలకొంది. అదే భారత్‌లో అయితే.. జనాభా, వ్యాధి తీవ్రతలను బట్టి ఈ డిమాండ్‌ మరింత ఎక్కువ. ప్రస్తుతం భారత్‌లో ఏడాదికి వెయ్యిమంది మాత్రమే అవయవదానం చేస్తున్నారు. మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌ వంటి ఇతర అవయవాల అవసరాన్ని పరిగణిస్తే.. అవయవాల అవసరం చాలా ఉంది.


ఇలాంటి తరుణంలో అవయవ మార్పిడి చికిత్సలకు తాజా ఆపరేషన్‌ ఒక ఆశాదీపం లాంటిది. సరైన సమయానికి అవయవాలు మారిస్తే శరీరంలోని ఇతర అవయవాలకు ముప్పు తగ్గడమే కాదు, జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల పాడైన అవయవాలను సమయానికి మార్చడం సమాజం మొత్తానికి చాలా అవసరం. ప్రస్తుతం మనకు శాస్త్రీయంగా, నైతికంగా, ఇతర విధాలుగా ఉన్న పరిమితుల వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరి అవుతున్నాయి. చింపాంజీలు, బబూన్లు మనకు మంచి వనరులే కానీ.. నైతికంగా, శాస్త్రీయంగా ఈ ప్రత్యామ్నాయాలను పరిగణించలేం. పరిశుభ్రంగా పెంచి, జన్యుపరివర్తనం చేసిన పందుల నుంచి అవయవమార్పిడి ఈ దిశగా చాలా పెద్ద ముందడుగు’’ అని సందీప్‌ స్పష్టం చేశారు.


పందుల్ని అనువుగా మార్చేందుకు జన్యుమార్పిడి..

ప్రయోగశాలల్లో పందుల్లో కొన్ని జన్యువులను తీసేసి, పీఈఆర్‌వీ (పోర్కైన్‌ రెట్రోవైరస్‌) లేని పందిపిల్లల్లో మనిషికి సంబంధించిన జన్యువులతో మార్పులు చేయొచ్చని సందీప్‌ పేర్కొన్నారు. ‘‘ప్రత్యేక పెంపకం, ఆహార పద్ధతులను పాటిస్తే, పందుల్లో బయటి నుంచి వైర్‌సలు (పీఈఆర్‌వీ) వచ్చే ముప్పును తగ్గించొచ్చు. సహజంగా లోపల ఉండే పీఈఆర్‌వీని, సీఆర్‌ఐఎ్‌సపీఆర్‌-కాస్‌ 9 జన్యువులను, పిండాన్ని న్యూక్లియర్‌ ఎడిటింగ్‌ చేయొచ్చు. మున్ముందు పరిశోధకులు గుండెను కూడా 3డి ప్రింటింగ్‌ చేసే అవకాశం ఉంది. అవైతే మనిషికి పూర్తి సురక్షితంగా ఉంటాయి. అయితే ఈ దిశగా ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో పనిచేసే అవయవాన్ని తయారుచేయడానికి పట్టే సమయం, ఖర్చు దృష్ట్యా ఈ విధానంలో పెద్దమొత్తంలో అవయవాల తయారీ అప్పుడే సాధ్యం కాదు. అప్పటివరకు పంది గుండె ఉపయోగపడుతుంది’’ అని ఆయన వివరించారు.

Updated Date - 2022-01-20T07:17:12+05:30 IST