Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొవిడ్‌ నుంచి గుండెకు రక్ష!

ఆంధ్రజ్యోతి(04/05/2021)

రక్తాన్ని గడ్డ కట్టించడం కరోనా వైరస్‌ తత్వం! కాబట్టే హృద్రోగులు రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి! రక్తం పలుచనయ్యే మందులు, వ్యాక్సిన్ల పట్ల... అపోహలు, అనుమానాలు వదిలించుకుని అప్రమత్తంగా నడుచుకోవాలి!


కరోనా ప్రధాన లక్ష్యం ఊపిరితిత్తులే! అయితే అక్కడి నుంచి ఇతర ప్రధాన అవయవాలకు వ్యాపించి, ఆరోగ్యాన్ని కుదేలు చేయడం అనేది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా... ఇలా రెండు మార్గాల్లో సాగుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు కలిగి ఉండి, వయసు పైబడిన వారిలో గుండె కూడా బలహీనపడి ఉంటుంది. ఫలితంగా కొవిడ్‌ సోకడం వల్ల గుండె కండరాలు బలహీనపడే మయోకార్డైటిస్‌ లేదా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు (థ్రాంబోసిస్‌) ఏర్పడవచ్చు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ సమస్యలు రెట్టింపు అవడంతో పాటు కాళ్లలోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి, వీనస్‌ థ్రాంబోసిస్‌, అరుదుగా గ్యాంగ్రీన్‌ కూడా తలెత్తవచ్చు. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లలో వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లి ఉండడం మూలంగా కరోనా తేలికగా సోకడంతో పాటు, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత వేగంగా పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా అప్పటికే హార్ట్‌ ఫెయిల్యూర్‌కు గురయిన వాళ్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. కరోనా తీవ్రత పెరిగినప్పుడు గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. గుండె రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. 


అలాగే ఊపిరితిత్తుల్లో, మెదడులో రక్తపు గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబాలిజం, బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ కూడా తలెత్తవచ్చు. ఇది కరోనా నేరుగా కాకుండా పరోక్షంగా ప్రభావం చూపించే విధానం. కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల నుంచి రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర ప్రధాన అవయవాలకూ వ్యాప్తి చెందుతుంది. ఆ క్రమంలో రక్తనాళాలలోని లోపలి పొర ఎపిథీలియం దెబ్బతిని రక్తం గడ్డలు (థ్రాంబస్‌) ఏర్పడతాయి. ఎక్కడైతే ఈ రక్తపు గడ్డలు ఏర్పడతాయో ఆ రక్తనాళం వెళ్లే మార్గంలోని అవయవానికి రక్తసరఫరా తగ్గుతుంది. ఫలితంగా ఆ అవయవం డ్యామేజీ అవుతుంది. అలా కరోనా ప్రభావంతో గుండె కూడా దెబ్బతింటుంది. ఫలితంగా గుండెపోటు, మయోకార్డైటిస్‌, థ్రాంబోసిస్‌ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టే కరోనా చికిత్సలో రక్తం పలుచనయ్యే మందులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.


రెమ్‌డిసివర్‌ ఎప్పుడు?

కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరుకుని రెట్టింపయ్యే స్థితి (తొలి దశ)లో రెమ్‌డిసివర్‌ యాంటీవైరల్‌ డ్రగ్‌ అక్కరకొస్తుంది. ఆ దశ దాటి కరోనాతో పోరాడేందుకు శరీరం సన్నద్ధమయ్యే స్థితి ‘సైటోకైన్‌ స్టార్మ్‌’ తలెత్తిన దశలో ఈ డ్రగ్‌ పనిచేయదు. ఈ స్థితిలో శరీరంలోని వైరస్‌ను శరీర రక్షణ వ్యవస్థ దాదాపుగా సంహరించి ఉంటుంది. కాబట్టి యాంటీవైరల్‌ డ్రగ్‌తో పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ సమయంలో రెమ్‌డిసివర్‌ కంటే స్టిరాయిడ్లు సమర్థంగా పనిచేస్తాయి. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో ఐసీయూలో చేరిన వారికి స్టిరాయిడ్లు అద్భుతంగా పనిచేస్తాయి. అయితే కరోనా నుంచి కాపాడే అద్భుత ఔషధంగా ఈ డ్రగ్‌ పట్ల అపోహలు నెలకొని ఉన్నాయి. ఇది నిజం కాదు. కాకపోతే కరోనా కట్టడిలో కొంతమేరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌ను చికిత్సలో భాగంగా ఉపయోగించడం జరుగుతోంది. 


రక్తం పలుచనయ్యే మందులు ఎందుకంటే?

కరోనా చికిత్సలో భాగంగా స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ మొదలైనప్పటి నుంచి, రక్తం పలుచనయ్యే మందులు ప్రతి ఒక్కరూ వాడవలసిన అవసరం లేదు. నిజానికి ఇలాంటి యాంటీకాగ్యులెంట్‌ థెరపీతో కరోనా ఇన్‌ఫెక్షన్‌ మొదటి దశలో ఉండి, హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి అదనంగా ప్రయోజనం కలిగినట్టు ఇప్పటివరకూ నిరూపణ కాలేదు. రక్తం పలుచనయ్యే మందులు కేవలం ఐసీయూలో ఉన్న బాధితులకు మాత్రమే కొనసాగించాలి. అలాగే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రెండు నుంచి మూడు నెలల పాటు ప్రతి ఒక్కరూ రక్తం పలుచనయ్యే మందులు వాడవలసిన అవసరం కూడా లేదు. డి-డైమర్‌ ఫలితం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే, ఈ మందులు కొనసాగించవలసి ఉంటుంది. 

గుండె జబ్బులతో కరోనా చికిత్స!

కరోనా బారిన పడిన హృద్రోగులు పూర్వం నుంచి వాడుతున్న మందులను కొనసాగించాలి. అలాగే గుండె జబ్బులకు దారితీసిన మధుమేహం, అధిక రక్తపోటుకు వాడే మందులనూ కొనసాగించాలి. కరోనాతో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగా షుగర్‌ మందుల మోతాదూ పెంచవలసి ఉంటుంది. గుండె వేగంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు అందుకు తగిన మందులు వాడవలసి ఉంటుంది. 


వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకడుతుందా?

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నట్టు కొన్ని ఐరోపా దేశాల్లో చేసిన క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది. అయితే సాధారణ ప్రజానీకంలో రక్తం గడ్డలు ఏర్పడే సమస్యలు సహజం. వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు యాధృచ్ఛికంగా ఆ సమస్య బయటపడడంతో వ్యాక్సిన్‌ వల్లే రక్తం గడ్డలు ఏర్పడ్డాయనే అపోహ పెరిగిపోయింది. నిజానికి వ్యాక్సిన్‌తో రక్తం గడ్డ కట్టే పరిస్థితి ఉండదు. 


స్పుత్నిక్‌ మంచిదేనా?

స్పుత్నిక్‌ ప్రభావం 92శాతం. రెండు డోసుల్లో ఇచ్చే ఈ వ్యాక్సిన్‌లో మొదటి డోసు ప్రభావం, రెండో డోసు ప్రభావం భిన్నంగా ఉంటాయి. పైగా విస్తృత కొవిడ్‌ వేరియెంట్ల నుంచి ఈ వ్యాక్సిన్‌ రక్షణ కల్పిస్తుంది. ఇప్పటివరకూ చేపట్టిన పరిశీలనలో ఈ వ్యాక్సిన్‌ యుకె కొవిడ్‌ స్ర్టెయిన్‌ను సమర్థంగా అంతం చేస్తున్నట్టు తేలింది. మన విషయంలో ఈ వ్యాక్సిన్‌ ప్రభావం ఏ మేరకు అనేది తేలవలసి ఉంది. 

ఈ థెరపీలే కీలకం!

కరోనా ప్రాణాంతకంగా మారకుండా నియంత్రించే థెరపీలు నాలుగు. యాంటీకాగ్యులెంట్‌ థెరపీ, వెంటిలేటర్‌ థెరపీ, ఆక్సిజన్‌ థెరపీ, స్టిరాయిడ్‌ థెరపీ! వీటికి తోడు వైటల్‌ సపోర్ట్‌ ఇవ్వగలిగితే కరోనా ప్రాణాంతక పరిస్థితి నుంచి బాధితులను కాపాడుకోవచ్చు.


హృద్రోగులు - వ్యాక్సిన్‌!

స్టాటిన్స్‌, యాంటీప్లేట్‌లెట్స్‌, యాంటీకాగ్యులెంట్లు వాడే హృద్రోగులు వ్యాక్సిన్‌ విషయంలో భయపడుతున్న పరిస్థితి సర్వత్రా నెలకొని ఉంది. అయితే గుండెపోటు, స్టెంట్ల మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, గుండె కవాటాలు మార్చుకున్నవాళ్లు, పేస్‌ మేకర్‌ అమర్చుకున్నవాళ్లు, ఇతరత్రా గుండె సమస్యలు కలిగి ఉన్న వాళ్లే అందరికంటే ముందు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. అసిట్రామ్‌, ఓరల్‌ యాంటీకాగ్యులెంట్స్‌ (రక్తం పలుచనయ్యే మందులు) వాడేవాళ్లు, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ ద్వారా వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ అయిన వాళ్లు మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకునే ముందు రోజు ఈ మందులు ఆపి, ఆ తర్వాత రోజు నుంచి మొదలుపెట్టాలి. అలాగే ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రదేశంలో కొంత ఎక్కువ ప్రెజర్‌తో నొక్కి పెట్టి ఉంచితే సరిపోతుంది. కొంతమందికి వ్యాక్సిన్‌ ఇచ్చిన చోట చర్మం నల్లబడినా, రెండు నుంచి మూడు రోజుల్లో సహజ రంగుకు మారుతుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.

డాక్టర్‌ శ్రీధర్‌ కస్తూరి

ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌,

సన్‌షైన్‌ హాస్పిటల్స్‌,

సికింద్రాబాద్‌.


Advertisement
Advertisement