హృదయ స్పందన

ABN , First Publish Date - 2020-09-15T05:30:00+05:30 IST

ప్రేమజంటల మౌన భాషలో పూలరెమ్మలు ముందు వరుసలో ఉంటాయి. ఒకప్పుడు ప్రేమికులు రంగురంగుల పూలతో తమ ప్రేమను,

హృదయ స్పందన

ప్రేమజంటల మౌన భాషలో పూలరెమ్మలు ముందు వరుసలో ఉంటాయి. ఒకప్పుడు ప్రేమికులు రంగురంగుల పూలతో తమ ప్రేమను, భావాలను వ్యక్తం చేసేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఈ స్మార్ట్‌ యుగంలో లవ్‌ సింబల్‌లో ఉన్న ఎమోజీలతో సందేశాలు, భావాలను పంచుకుంటున్నారు. ఒక్కో పూల రంగుకు ప్రత్యేకమైన అర్థం ఉన్నట్టే ఒక్కో రంగు హార్ట్‌ ఎమోజీ ఒక్కో ఫీలింగ్‌ను తెలుపుతుంది. ప్రేమ, విరహం, సాన్నిహిత్యం, ఎడబాటు ఇలా.. ఒక్కో భావాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి.




 రెడ్‌ హార్ట్‌

ప్రేమకు సంకేతంగా నిలిచే ఈ ఎమోజీ రొమాంటిక్‌ సందేశాన్ని మోసుకెళుతుంది. అయితే రెడ్‌ హార్ట్‌ ఎమోజీ మొదట్లో మాత్రమే థ్రిల్‌ను ఇస్తుంది. మీ ప్రేమ ప్రయాణం జాలీగా, సరదాగా సాగిపోతున్నప్పుడు లేదా మీ మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా ఈ ఎమోజీ పంపించుకోవాలి. అయితే మొదటి డేట్‌తోనే రెడ్‌ హార్ట్‌ ఎమోజీ పంపించడం సరికాదు.



 బ్లూ హార్ట్‌ 

ఇద్దరి మధ్య మాటలు లేనప్పుడు బ్లూ హార్ట్‌ ఎమోజీ పంపిస్తుంటారు. మీరు కలవాలి అనుకున్న అమ్మాయిని  కలవలేకపోయినప్పుడు ఆమెకుఈ ఎమోజీ పంపవచ్చు. గ్రూప్‌ చాట్స్‌లో కూడా ఈ ఎమోజీ పోస్ట్‌ చేయొచ్చు. 



 బ్లాక్‌ హార్ట్‌ 

ఈ ఎమోజీ పీకల్లోతు ప్రేమకు సంకేతం. బ్లాక్‌ హార్ట్‌ ఎమోజీని ప్రేమ జంటలు ఎక్కువగా ఉపయోగిస్తాయి. రొమాంటిక్‌, గాఢమైన ప్రేమ సందేశాన్ని ఇది తెలుపుతుంది. ఈ ఎమోజీని మీ ప్రియతమకు మాత్రమే పంపించాలి. అంతేకానీ సరదాగా డేటింగ్‌లో ఉన్నవారికి కాదు.




 ఆరెంజ్‌ హార్ట్‌ 

ఇది ప్రేమను వ్యక్తం చేయలేని మగవాళ్లను ప్రతిబింబిస్తుంది. మనసులోని ఇష్టాన్ని, ప్రేమను ధైర్యంగా చెప్పలేని వారు ఆరెంజ్‌ హార్ట్‌ ఎమోజీ పంపిస్తారు. సందర్భాన్ని బట్టి ప్రేమికులుగా 

నటించే వారికి ఈ ఎమోజీ సరిపోతుంది. 




 పర్పుల్‌ హార్ట్‌

లైంగిక ఆసక్తిని వ్యక్తపరిచే ఎమోజీ ఇది. ఈ విషయం తెలియక కొందరు ఫ్యామిలీ గ్రూప్‌ చాట్‌లో పర్పుల్‌ హార్ట్‌ ఎమోజీ వాడుతుంటారు. ఈ ఎమోజీని మీ జత కోరుకొనే ప్రేయసికి మాత్రమే పంపాలి. 



 గ్రీన్‌ హార్ట్‌

మీకు పరిచయం ఉండి, వారి గురించి ఎక్కువగా తెలియనప్పుడు గ్రీన్‌ హార్ట్‌ ఎమోజీ పంపించాలి. అవతలి వారి అనుమతి కోరుతూ పంపించే ఎమోజీ ఇది.

 


ఎల్లో హార్ట్‌

ప్రేమబంధం కాస్త స్నేహబంధంగా మారుతున్న సమయంలో ఎల్లో హార్ట్‌ ఎమోజీ పంపాలి. స్నేహితులు, పరిచయం ఉన్నవారికి ఈ ఎమోజీ పెట్టవచ్చు. 



 వైట్‌ హార్ట్‌ 

ఇష్టమైన వారు దూరం అయినప్పుడు ఓదార్పుగా ఈ ఎమోజీ వాడాలి. అంతేతప్ప ఇతర సందర్భాల్లో దీన్ని వాడకూడదు. 



 బ్రోకెన్‌ రెడ్‌ హార్ట్‌ 

మీరు మీ ప్రియతమ పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు ఈ ఎమోజీ పంపాలి. అయితే ఈ ఎమోజీని ఉపయోగించకుండా ఉండడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు అనుకున్నది జరగనప్పుడు బ్రోకెన్‌ రెడ్‌ హార్ట్‌ పంపడం ఆనవాయితీగా వస్తోంది.  


Updated Date - 2020-09-15T05:30:00+05:30 IST