మనసు.. బుద్ధి

ABN , First Publish Date - 2020-06-20T09:00:46+05:30 IST

ప్రతి మనిషికీ.. బాహ్యశత్రువులు, అంతశ్శత్రువులు అని రెండు రకాల శత్రువులుంటారు.

మనసు.. బుద్ధి

ప్రతి మనిషికీ.. బాహ్యశత్రువులు, అంతశ్శత్రువులు అని రెండు రకాల శత్రువులుంటారు. బాహ్య శత్రువులు లేని వారిని అజాత శత్రువులంటారు. ఎక్కడైనా అజాత శత్రువులు ఉండొచ్చుగానీ.. అంతశ్శత్రువులు లేనివారు అరుదు. అష్టమదాలు, అరిషడ్వర్గాలు, ఈషణ త్రయం, అహంకార మమకారాలకు దేహభావానికి ఆలవాలమైన, జన్మ స్థానమైన మనసు, దానిలో పుట్టే ఆలోచనలే మన అంతశ్శత్రువులు. మనసు వల్లనే ఆలోచనలు, వాటిని బట్టే సంకల్పాలు. సంకల్పాల నుంచే కార్యక్రమాలు.


మన ఆలోచనా విధానం, చేపట్టే కార్యక్రమాలను బట్టే సమాజంలో మన స్థానం నిర్ధారించబడుతుంది. బాహ్య శత్రువులను జయించినా అంతశ్శత్రువులను గుర్తించి, నియంత్రించలేనివారు అధోగతిపాలు గాక తప్పదు. ఇందుకు సరియైున ఉదాహరణలు.. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, ద్వాపరంలో దుర్యోధనుడు. ఈ కలియుగంలోనైతే అంతశ్శత్రువుల బారిన పడి నాశనమైన, నాశనమవుతున్న వారిని లెక్కించలేం.. గుర్తించలేం.


ఆధ్యాత్మిక సాధకులకు మనో నియంత్రణ చాలా అవసరం. అది జరగకుంటే మనసు ఆధ్యాత్మిక విషయాలపై నిలవదు. లౌకికమైన, అశాశ్వతమైన, అనర్థదాయకమైన విషయాల పట్ల వ్యామోహాన్ని పెంచుతుంది. వాటి వెంట పరుగులు తీయిస్తుంది. మనసును నియంత్రించుకోవాలంటే దాని తత్వాన్ని రవ్వంత అర్థం చేసుకోవాలి. మనసనేది దేహంలో గల ఒక ప్రత్యేకమైన అవయవం గాదు.. శరీరాన్ని స్కానింగ్‌ చేసినా, నిలువుగా, అడ్డంగా ఎన్ని కోతలు కోసినా మనసు కనిపించదు. మన మేధస్సులో అనుక్షణం చెలరేగే ఆలోచనల, కోరికల సమాహారమే మనసు.


మనో నియంత్రణ అంటే ఆ రెండింటినీ (ఆలోచనలు, కోరికలు) క్రమక్రమంగా తగ్గించుకోవడం. సగటు మనిషిని పలు ఇబ్బందులకు గురిచేసేవి, కష్టాల పాలు చేసేవి, దుఃఖాన్ని చేరదీసేవి మనసులో నిరంతరం జనించే కోరికలే. ఒక కోరిక తీరితే దాని స్థానంలో మరో కోరిక ప్రత్యక్షం. కోరికలకు అంతు అనేది ఉండదు. లౌకికంగా మనం చేపట్టే విభిన్న కార్యక్రమాలు కోరికలు తీరడానికే. కార్యక్రమాల సాంద్రత పెరిగే కొద్దీ అశాంతి, దుఃఖం, చిరాకు, పరాకు పెరుగుతాయి. కోరికలను తగ్గించుకోవడం ఎట్లా అనేది కోటి రూకల ప్రశ్న. భారతీయ ఆధ్యాత్మిక చింతనా స్రవంతిలో, వేద విజ్ఞానంలో ఇందుకు చక్కని తరుణోపాయం చూపించారు. అదే బుద్ధి. రకరకాల చింతలకు గురిచేసే, మనస్సునిచ్చిన భగవంతుడే దాని ప్రక్కనే ‘బుద్ధి’ అనే ఇంగిత జ్ఞానాన్నిచ్చాడు.


మనసు ఇంద్రియాలచే ప్రభావితమవుతుంది. ఇంద్రియాల గొంతెమ్మ కోరికల కారణంగా మనసులో అలజడి, అశాంతి ఎక్కువవుతాయి. వచ్చే ఆలోచనలు, కోరికలు ఎటువంటివి? ఆచరణీయమైనవా, తిరస్కరించదగినవా? అని మనసు విచక్షణ చేయలేదు. అందుకే చేయగూడని పనులను కూడా అది ప్రోత్సహిస్తుంది. అట్టి కర్మల కారణంగా కష్టాల, నష్టాల, దుఃఖాల పాలవుతాం. కనుక మనసులో మెదిలే ఆలోచనలను, కలిగే, రగిలే కోరికలను ‘బుద్ధి’ అనే ఫిల్టర్‌లో వేసి పరీక్షిస్తే యథార్థం తెలుస్తుంది. మంచి, చెడులను, దుర్మార్గ, సన్మార్గాలను చక్కగా విడదీసి చూపగల శక్తి బుద్ధికి ఉంది.


మనసును నియంత్రించడమంటే అది ప్రేరేపించినట్లుగా చేయక.. ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి ఫైలునూ పై అధికారులకు పంపి, వారి అనుమతి ప్రకారం క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేసినట్లుగా, ఆలోచనలను కోరికలను బుద్ధికి అప్పజెప్పి అది చెప్పినట్లు ప్రవర్తించడమే. ఇలా చేయడం ప్రారంభిస్తే మనసు క్రమంగా బలహీనమవుతుంది. ఆధ్యాత్మిక సాధనలో అందరం అవలంబించవలసిన తొలి మార్గం ఇదే.


మాదిరాజు రామచంద్రరావు

Updated Date - 2020-06-20T09:00:46+05:30 IST