Minister గౌతమ్‌కు గుండెపోటు ఎందుకు వచ్చినట్టు.. కారణాలేంటి..!?

ABN , First Publish Date - 2022-02-22T07:13:56+05:30 IST

Minister గౌతమ్‌కు గుండెపోటు ఎలా వచ్చింది.. కారణాలేంటి..!?

Minister గౌతమ్‌కు గుండెపోటు ఎందుకు వచ్చినట్టు.. కారణాలేంటి..!?

  • హృదయం.. జర పదిలం
  • కొవిడ్‌ తగ్గినా కొందరిలో గుండె సమస్యలు
  • కోలుకున్న వెంటనే.. కొద్ది వారాల తర్వాతా
  • పల్మనరీ ఎంబాలిజంతో పొంచి ఉన్న ముప్పు
  • దృఢంగా ఉన్నవారిలోనూ ఆగుతున్న గుండె
  • అజాగ్రత్త వద్దని వైద్య నిపుణుల హెచ్చరిక

 

ఆయనో ఎనస్తటిస్ట్‌ (ఆపరేషన్‌కు ముందు రోగులకు మత్తు ఇచ్చే వైద్యుడు). వయసు 42. ఇప్పటికి రెండుసార్లు కొవిడ్‌ వచ్చింది. రెండోసారి పాజిటివ్‌ వచ్చిన తర్వాత రెండు నెలలు బాగానే ఉంది. ఒకరోజు ఆస్పత్రిలో ఓ రోగికి శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆ మత్తు వైద్యుడికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలోనే ఉండడంతో వైద్యులు సకాలంలో స్పందించి వైద్యం అందించారు. దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.


ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గతంలో రెండుసార్లు కొవిడ్‌ వచ్చింది. ఆయన ఉన్నట్టుండి సోమవారం ఉదయం కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్తే.. గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారని, రోజూ వ్యాయామం చేస్తారని సన్నిహితులు చెబుతున్నారు. మరి గుండెపోటు ఎందుకు వచ్చినట్టు? కరోనాయే అందుకు కారణమా? ఆ అవకాశం లేకపోలేదంటున్నారు కొందరు వైద్యులు.


(హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ - ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో కొందరికి.. కాలక్రమంలో గుండె సంబంధిత సమస్యలు బయటపడుతున్నాయి. దృఢంగా ఉన్నవారూ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. 2021 అక్టోబరులో ఇంగ్లండులో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన నివేదిక ప్రకారం.. కొవిడ్‌ తర్వాత కొందరిలో రక్తం గడ్డకట్టే సమస్య తలెత్తుతోంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్స్‌ పెరిగినట్లు ఆ స్టడీలో వెల్లడైంది. ఇటలీలో చేసిన మరో అధ్యయనంలోనూ దాదాపు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. అధ్యయనాల సంగతి పక్కన పెడితే.. మనదగ్గర కూడా యువతలో సైతం ఈ సమస్య కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.


ముందే బ్లాక్స్‌ ఉంటే..

కొవిడ్‌ బాధితుల్లో ఏర్పడే బ్లడ్‌ క్లాట్లు గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళంలో అడ్డుపడితే గుండె ఆగిపోయే ముప్పుందని సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి తెలిపారు. దీనిని పల్మనరీ ఎంబాలిజంగా వ్యవహరిస్తారు. దెబ్బ తగిలిన చోట శరీరం ఎలా కందిపోతుందో అలా కొవిడ్‌ బాధితుల గుండె కండరాల పైనా వైరస్‌ ప్రభావం ఉంటోందని డాక్టర్‌ రమేశ్‌ తెలిపారు. కొవిడ్‌ బారిన పడడానికి ముందే కొందరి గుండె నాళాల్లో మైల్డ్‌ బ్లాక్స్‌ ఉంటాయి. కొవిడ్‌ బారిన పడ్డాక బ్లడ్‌ క్లాట్లు ఆ బ్లాకులకు తోడైతే కార్డియాక్‌ అరెస్టు జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. కొవిడ్‌ వచ్చిన నాటి నుంచి తగ్గిన ఆరునెలల దాకా ఎప్పుడైనా ఈ ఇబ్బంది ఏర్పడవచ్చని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 




ఆర్నెల్లలోపు ఇలాంటి సమస్యలు

కొవిడ్‌  నుంచి కోలుకున్న 6 నెలల వరకూ గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, ధూమపానం చేసేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటోంది. ఎటువంటి దురాలవాట్లు లేనివారిలో కూడా కొందరిలో గుండెసంబంధిత సమస్యలు వస్తున్నాయి. కాబట్టి.. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనవిధానం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.  

- డాక్టర్‌ కొసరాజు కమలాకర్‌, హృద్రోగ నిపుణులు, లైఫ్‌ ఆస్పత్రి, గుంటూరు



5 నుంచి 9% మందిలో..

కొవిడ్‌ తర్వాత గుండె జబ్బులు పెరిగాయి. వైరస్‌ నుంచి కోలుకున్నవారు ఇతర సమస్యలతో ఆస్పత్రికి వస్తున్నారు. అలా వస్తున్నవారిలో 5-9 శాతం మంది రోగులలో చాతీ నొప్పి, దడ వంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పరీక్షలు చేస్తే వారిలో కొందరికి రక్త సరఫరాలో అడ్డంకులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 35 ఏళ్లు దాటినవారంతాపూర్తి కార్డియాక్‌ స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి. దీనివల్ల.. రక్త ప్రసరణలో సమస్యలుంటే తొలినాళ్లలోనే తెలుస్తుంది.  

- డాక్టర్‌ శరత్‌రెడ్డి, సీనియర్‌ కార్డియాలజిస్టు




స్వల్ప లక్షణాలున్నవారికీ..

కొవిడ్‌ వచ్చినవారికి డీడైమర్‌ టెస్ట్‌ చేయిస్తుంటాం. ఏవైనా క్లాట్లు ఏర్పడితే ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది.  సాధారణంగా కొవిడ్‌ బారిన పడి తీవ్ర లక్షణాలున్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి.. చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే కనపడి తగ్గిపోయినవారిలో కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.  ఉదాహరణకు.. ఒక వ్యక్తికి కరోనా సోకి, రెండు వారాల క్రితం ఒక్కరోజు జ్వరం వచ్చి తగ్గిపోయింది. తనకు వైరస్‌ సోకిన విషయం కూడా అతడికి తెలియదు. ఏదో జ్వరం వచ్చి తగ్గిపోయిందని అనుకుంటాడు. అలాంటివారికి కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.  

- డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి, సీనియర్‌ కార్డియాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి



పూర్తిస్థాయిలో వ్యాయామం వద్దు

పోస్టు కొవిడ్‌ ఇబ్బందులు కార్డియాక్‌ అరెస్టుకు దారి తీస్తున్నాయి. కాబట్టి వైరస్‌ బారిన పడ్డవారు ఆరు నెలలపాటు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. అవసరమైతే 2డీ ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలల పాటు 50 శాతం కంటే ఎక్కువ సామర్థ్యంతో వ్యాయం చేయకూడదు.

- అనీష్‌ ఆనంద్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, అపోలో ఆస్పత్రి



నిర్లక్ష్యంతో ప్రమాదం

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత గుండెసంబంధిత సమస్యలతో వచ్చేవారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా యువతలో ఎక్కువగా ఈ సమస్యను గమనించాం. ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, పల్స్‌రేటు తక్కువగా ఉండడం లాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రందించాలి. ఈసీజీ, 2డీఎకో, ట్రెడ్‌మిల్‌ టెస్టు(టీఎంటీ) లాంటివి వైద్యుడి సలహా మేరకు చేయించుకోవాలి. గుండె సంబంధితసమస్య ఏది వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి.

-డాక్టర్‌ రాయడి గోపికృష్ణ, ఎండీడీఎమ్‌. ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్టు, హోప్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌



వారి ప్రకారం.. కొవిడ్‌ నుంచి కొలుకున్న తర్వాత 3 దశలుంటాయి. మొదటి దశ.. అక్యూట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌. ఇది వారంపాటు ఉంటుంది. రెండోది ఆన్‌గోయింగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌. ఇది 4 నుంచి 12 వారాల పాటు ఉంటుంది. ఇక మూడోది లాంగ్‌ కొవిడ్‌ ఎఫెక్టు (పోస్టు కొవిడ్‌ సిండ్రోమ్‌). వీటిలో ఒక్కో దశలో ఒక్కో తరహా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న  ఆరు నెలల తర్వాతా ప్రతి పదిమందిలో ఒకరికి గుండెదడ, ప్రతి 20 మందిలో ఒకరికి గుండెనొప్పి ఉంటున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. కొవిడ్‌ మహమ్మారి రాకముందుతో పోలిస్తే.. గుండె కండరాలు ఒత్తిడికి లోనయ్యే సమస్య కొవిడ్‌ తర్వాత నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగినట్లు చెబుతున్నారు. మిగతా వైర్‌సలతో పొల్చితే కరోనా వల్ల రక్తం గడ్డకట్టే ముప్పు 3 రెట్లు ఎక్కువని వారు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులన్నీ కొవిడ్‌ నుండి కోలుకున్న తర్వాత చాలా వారాల పాటు కొనసాగవచ్చని.. అరుదుగా ప్రాణాంతకం కావచ్చని కార్డియాలజిస్టులు వివరిస్తున్నారు.

Updated Date - 2022-02-22T07:13:56+05:30 IST