గుండె జాగ్రత్త

ABN , First Publish Date - 2021-09-28T05:30:00+05:30 IST

గుప్పెడంత గుండెకు కష్టమొచ్చింది. పగలు రేయి తేడా లేకుండా ఒత్తిడికి లోనవుతోంది. ఊపిరి నిలిపేందుకు శ్రమిస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

గుండె జాగ్రత్త

  1. దురలవాట్లతో గుండె జబ్బులు
  2. కొవిడ్‌తో పెరిగిన బాధితులు
  3. జంక్‌ ఫుడ్‌తో చిన్నారులకు ముప్పు
  4. బీపీ, షుగర్‌, ఊబకాయంతో సమస్య 
  5.  నేడు వరల్డ్‌ హార్ట్‌ డే


కర్నూలు(హాస్పిటల్‌), సెప్టెంబరు 28: గుప్పెడంత గుండెకు కష్టమొచ్చింది. పగలు రేయి తేడా లేకుండా ఒత్తిడికి లోనవుతోంది. ఊపిరి నిలిపేందుకు శ్రమిస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ కారణంగా యుక్త వయసులోనే జబ్బుల బారిన పడుతోంది. గుండె జబ్బులు చాలా వరకు హఠాత్తుగా వచ్చేవి కావు. ప్రాథమిక దశలోనే 80 శాతం వరకు  గుండె జబ్బులను నివారించవచ్చు. సత్వర చికిత్సతో ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు గుండె జబ్బులే కారణం. రెండో స్థానంలో క్యాన్సర్‌ ఉంది. క్యాన్సర్‌ని నివారించడం కొంత కష్టం. కానీ ముందు జాగ్రత్తలతో గుండె జబ్బుల మరణాలను అరికట్టే వీలుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.86 కోట్ల మంది హార్ట్‌ అటాక్‌తో మరణిస్తున్నారు. ఏటా 52 కోట్ల మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంచేందుకు వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన ఏటా సెప్టెంబరు 29న వరల్డ్‌ హార్ట్‌ డేని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘యూజ్‌ హార్ట్‌ కనెక్ట్‌’ అన్న నినాదాన్ని ఇచ్చింది.

టెలి మెడిసిన

ధూమపానం, మధుమేహం, బీపీ, అధిక కొలెస్ర్టాల్‌, ఊబకాయం, గాలికాలుష్యం వంటివి గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. మన దేశంలో వినియోగించే ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువ. అవి షుగర్‌ వ్యాధికి కారణమవుతున్నాయి. దేశంలో 20 నుంచి 30 శాతం షుగర్‌ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. గుండె జబ్బులతో బాధపడే పట్టణ, గ్రామీణ ప్రాంతాలవారికి పెద్ద పెద్ద నగరాల్లో అందించే చికిత్సను డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా చేరువ చేయాలని నిర్ణయించారు. బాధితులకు టెలి మెడిసిన ద్వారా చికిత్స అందించాలన్నది ఈ ఏడాది లక్ష్యం. 

జిల్లా పరిస్థితి

జిల్లాలో కర్నూలు, నంద్యాలలో తప్ప ఎక్కడా గుండె జబ్బులకు సరైన చికిత్స లేదు. గుండె జబ్బు బాధితులకు క్యాత ల్యాబ్‌లో చేర్చి, గంటలో అంజియోగ్రామ్‌ పరీక్ష చేయాలి. వీలైతే స్టంట్‌ వేయాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీహెచసీలో ఈసీజీ పరీక్ష చేసి స్టెపోక్రైలజి, థ్రాబ్రోలైసిన చికిత్స చేయాలి. కాని జిల్లాలోని 86 పీహచసీలు, 18 సీహెచసీల్లో ఈ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

చిన్నతనం నుంచే..

పిల్లలు జంక్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. బరువు పెంచే స్నాక్స్‌ను తింటున్నారు. టిఫిన మొదలు రాత్రి భోజనం వరకు తీసుకునే ఆహా రంలో ఫాస్ట్‌ ఫుడ్‌ ఉంటోంది. ఫలితంగా రక్తనాళాల్లో కొలెస్ర్టాల్‌ పేరుకుపోతోంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు వచ్చేసరికి రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడుతున్నాయి. పాతికేళ్లలోపే గుండె సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒకరికి విద్యార్థి దశలోనే గుండె జబ్బుకు పునాది పడుతోంది. 

ఓపీకి ఏటా 24 వేల మంది

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ ఉంటుంది. వారంలో 500 మంది ఓపీ వస్తుంటారు. 50 మంది అడ్మిట్‌ అయి చికిత్స పొందుతుంటారు. ప్రతి రోజూ 300 నుంచి 400 ఈసీజీ పరీక్షలు చేస్తుంటారు. ఇప్పటి వరకు కార్డియాలజీ విభాగంలో 10 వేల ఆంజియోగ్రామ్‌లు, 2 వేల స్టంట్లు, ఏడాదికి 10 వేలు టూడీఎకో పరీక్షలు చేస్తున్నారు. ప్రాంతీయ కార్డియో థొరాసిక్‌ విభాగం 2016లో 6 కోట్లతో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 420 గుండె ఆపరేషన్లు నిర్వహించారు. 

గుండె జబ్బు రాకుండా..

- ప్రతిరోజూ 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ప్రశాంతంగా ఉండాలి.

- ఒత్తిళ్లకు దూరంగా ఉండేలా దైనందిన కార్యక్రమాలను ప్లాన చేసుకోవాలి.

- మనసును ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇందుకు నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, ప్రకృతిని ఆస్వాదించడం చేయాలి.

- రోజూ యోగా చేస్తుంటే.. మనస్సులో ప్రశాంతత ఏర్పడి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. 

- ప్రతి రోజూ 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.

- టీ, కాఫీ తక్కువగా సేవించాలి. వీటికి బదులు పండ్లు, డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి.

- పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.

- ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుండె పరీక్ష చేయించుకోవాలి.

లక్షణాలు 

-  అలసట

-  చెమటలు పడటం,

-  ఆహారం తీసుకునేటప్పుడు నొప్పి


 కొవిడ్‌ వల్ల పెరిగాయి..

కొవిడ్‌ వల్ల గుండె జబ్బులు 4 నుంచి 5 శాతం పెరిగాయి. అందుకే సెకండ్‌ వేవ్‌లో గుండె జబ్బులు ఉన్నవారు అధికంగా మరణించారు. 2008లో కార్డియాలజీ విభాగంలో క్యాతల్యాబ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. కార్డియాలజీలో 40 పడకలు ఉండగా.. వీటిలో 10 ఐసీయూ పడకలు ఉన్నాయి. 2016లో డీఎం కార్డియాలజీ సీట్లు రావడంతో ఈ విభాగంలో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. మూడు బ్యాచ విద్యార్థులు కార్డియాలజిస్టుగా బయటకు వెళ్లారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా బుధవారం 40 ఏళ్లు దాటిన హెడ్‌ నర్సులు, స్టాఫ్‌ నర్సులకు ఫ్రీ హార్ట్‌ చెకప్‌ను ఉదయం 8 గంటల నుంచి నిర్వహిస్తున్నాము. 

 - డా.పి.చంద్రశేఖర్‌, కార్డియాలజీ విభాగాధిపతి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి


 టెలి మెడిసినకు ప్రాధాన్యం

గుండె జబ్బులు ఉన్నవారు లేటెస్ట్‌ టెక్నాలజీని ఉపయోగించు కోవాలి. ఈ ఏడాది నినాదం కూడా అదే. మారుమూల పల్లెల్లో కూడా ఈసీజీ సౌకర్యం ఉండాలి. ఆ రిపోర్టును టెలిమెడిసినకు పంపి, దాని ద్వారా రోగికి చికిత్స చేసే సౌలభ్యం ఉండాలి. టెలి మెడిసిన ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. దేశంలో తప్పనిసరిగా టెలి మెడిసినను ప్రోత్సహించి, సామాన్య ప్రజలకు గుండె జబ్బుల పట్ల అవగాహన పెంచాలి. వ్యాధులు రాకుండా చేయాలి. గుండె జబ్బులను నిర్ధారణ చేసి టెలి మెడిసిన ద్వారా వారి ప్రాణాలను కాపాడుకునేందుకు చొరవ చూపాలి.

- సి.ప్రభాకర్‌ రెడ్డి, సీటీ సర్జన, డిప్యూటీ సూపరింటెండెంట్‌, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి


బీపీ, షుగర్‌ బాధితుల్లో.. 

హైపర్‌ టెన్షన, షుగర్‌ వ్యాధిగ్రస్తులు, అధిక బరువు, పొగ అలవాట్లు, కొలెస్ర్టాల్‌, గాలి కాలుష్యం వల్ల నానాటికి గుండె జబ్బులు అధికమవుతున్నాయి. మధుమేహం స్థాయి నియంత్రణలో లేకపోతే గుండె లయ తప్పుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు తెలుసుకోవాలి. ఈ ఏడాది డిజిటల్‌ టెక్నాలజీకి వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన ప్రాధాన్యం ఇచ్చింది. గుండె జబ్బులున్న వారు ఒకరి నుంచి మరొకరు కనెక్టు చేయించి, చికిత్స అందించి, ప్రాణాలను నిలిపేందుకు టెక్నాలజీ ఉపయోగపడాలి. 

- డా.ఎ.వసంత కుమార్‌, సీనియర్‌ కార్డియాలజిస్టు, కర్నూలు


జీవనశైలి  మార్పుల వల్ల..

జీవనశైలి మార్పుల వల్ల గుండె జబ్బులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. దురలవాట్లు, సిగరెట్లు, మద్యం తాగడం, శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడం వంటివి గుండె జబ్బులకు కారణం. ఒకప్పుడు పురుషులకు  మాత్రమే గుండె జబ్బులు వచ్చేవి. ప్రస్తుతం స్త్రీ, పురుషులకు సమానంగా వ్యాధులు వస్తున్నాయి. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం త్వరగా లేస్తున్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

 - డా.సీఎస్‌ తేజానందన రెడ్డి, కార్డియాలజిస్టు, కర్నూలు


Updated Date - 2021-09-28T05:30:00+05:30 IST