గుండెలు మండిస్తున్న హథ్రాస్‌ ఘాతుకం

ABN , First Publish Date - 2020-10-20T09:11:23+05:30 IST

కొన్నిదశాబ్దాల క్రితం, ఇంకా ఇంత తీవ్రస్ధాయిలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వెల్లడికాని కాలంలో నీనా నెహ్రా రాసిన కవిత గుర్తుకొస్తూంది...

గుండెలు మండిస్తున్న హథ్రాస్‌ ఘాతుకం

మహిళల జీవితాలకు, గౌరవానికి, స్వేచ్ఛకు రవ్వంత విలువ కూడా లేని సమాజంలో ఏ మానవతా ధర్మాలు మనగలుగుతాయి? స్త్రీలకు గౌరవం ఇవ్వడంలో, వారి జీవించే హక్కును నిలబెట్టడంలో ఈ దేశపు వైఫల్యం అత్యంత విషాదకరం. పాలనాపరమైన, సామాజికపరమైన రుగ్మతలకు మందు సమష్టి ప్రజా చైతన్యం, సమష్టి పోరాటమే.


‘‘గుండెలపై గాయాలు, మెదడుపై దెబ్బలు/ చర్మమంతా వాతలు, చితికిపోయిన శరీరం/ అరవడానికి గొంతు పెగలదు/ ఇరుగు పొరుగులు నుంచుని చూస్తూ ఉంటారు/ సహాయం కోసం ఎంత ఏడ్చినా/ అక్కడ ఎవరూ లేరు’’ 

కొన్నిదశాబ్దాల క్రితం, ఇంకా ఇంత తీవ్రస్ధాయిలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వెల్లడికాని కాలంలో నీనా నెహ్రా రాసిన కవిత గుర్తుకొస్తూంది. 


బాలికలు, యువతులపై సాగుతున్న అత్యాచారాలు,ఆపై హత్యలు, నిందితులకు శిక్షలు పడకుండా రక్షించుకొస్తున్న వ్యవస్ధల దౌష్ట్యం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న బలమైన వ్యవస్ధల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక స్త్రీలు విలవిలలాడుతున్నారు. పసి కందుల నుంచి ముసలమ్మల దాకా స్త్రీలపై జరుగుతున్న అసంఖ్యాక లైంగిక అత్యాచారాలు మహిళల్ని భయభ్రాంతుల్నిచేస్తున్నాయి. మహిళల మానప్రాణాలకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రోడ్లు, రైళ్ళు, పనిప్రదేశాలు... ఎక్కడా భద్రత లేకుండా పోయింది. గొంతుక పిసికి, బ్లేడుతో చీల్చి, కత్తితో కోసి, గొడ్డలితో నరికి, చున్నీతో ఉరేసి, ఏసిడ్‌ని గుమ్మరించి, పెట్రోల్‌ చల్లి తగలబెట్టి.... జీవించే హక్కునే హరించి వేస్తున్న దృశ్యాలు ఈ విశాల సమాజానికి, మా భద్రతకు పూచీపడాల్సిన వ్యవస్ధలకు కనపడడంలేదా? అని బాధిత మహిళలు ఆక్రోశిస్తున్నారు. అత్యాచారం జరిగినప్పుడు కొద్ది రోజులు సంచలన వార్తగా ఉండి మరి కొద్ది రోజులకు పాతబడి అందరూ మరిచి పోయే సంఘటనగా మాత్రమే ఘాతుక చర్య ఎందుకు మిగిలిపోతూంది? ఎందుకని సమాజం బలమైన స్థాయిలో స్పందించడంలేదు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.


స్త్రీలపై ఈ పైశాచిక కృత్యాలకు దోహదం చేస్తున్నవేమిటి? ఒక వైపు భూస్వామ్య వ్యవస్ధ తాలూకు అదుపు, ఆధిపత్యం కొనసాగుతూ ఉండడం, మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్ధ తాలూకు సంస్కృతీ విలువల పతనాన్ని నియంత్రించలేకపోవడం. దృశ్య, శ్రవణ, ఎలక్ట్రానిక్‌ ప్రసార సాధనాలు డబ్బు, సెక్స్‌, అధికారాన్ని గ్లామరైజ్‌ చేస్తున్నాయి, ఆనందానికి అవే ముఖ్య హేతువులని ప్రచారం చేస్తున్నాయి. ఆర్ధిక సరళీకరణ, గ్లోబలైజేషన్‌, వస్తు వినిమయ సంస్కృతి, ‘ఎంత మూల్యాన్ని చెల్లించైనా, ఎన్ని విలువల్ని వర్జించైనా సరే, డబ్బు సంపాదించు’అనే ఏకైక విలువకు జీవితంలో ప్రాధాన్యత పెరగడం, మొదలైనవన్నీ స్త్రీలపై లైంగిక దాడులకు కారణమవుతున్నాయి. కేవలం సెక్స్‌ కోసం మాత్రమే కాదు, స్త్రీలపై తమ అధికారాన్ని స్థిరీకరించుకోవడానికి, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, పురుషులు లైంగిక అత్యాచారానికి పాల్పడటానికి కారణం. ద్వేషం, పగ, ప్రతీకారం కూడా కారణం కావొచ్చు. కాని స్త్రీలను తమ సంపదలో భాగంగా, మానవ సంపదను ఉత్పత్తి చేసే యంత్ర పరికరాలుగా భావించే పురుషులు స్త్రీలపై తమకు సహజ హక్కు ఉన్నదని అనుకుంటారు. 


ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ హత్యాచారంతో దేశం మరోసారి ఉలిక్కిపడింది. కొంతమందైనా ఒక క్షణం ఆగి ఇంతటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయని మథనపడుతున్నారు. మనం అతిశయంగా వర్ణించుకునే పుణ్య భూమిలో స్త్రీలపై జరుగుతున్న ఘాతుకాల్ని చూసి వేదన చెందుతున్నారు. వాల్మీకి ఉపకులానికి చెందిన ఆ దళిత యువతి తనపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పి అగ్రకులానికి చెందిన ఆ ఆ నలుగురి పేర్లు కూడా బయటపెట్టింది. అత్యాచారం, అనంతరం ఆమె మరణం సమాజాన్ని నిర్ఘాంతపరుస్తుండగా, ఆమె పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులను కూడా చూడనివ్వకుండా, పోలీసులు నడి రాత్రి హడావిడిగా దహనం చేయడం మనసు కలచివేస్తున్నది. నిందితుల్ని కాపాడడానికి వ్యవస్థలు చేస్తున్న ప్రయత్నాలు, అధికార దుర్వినియోగం ఆలోచనాపరుల్ని, సమాజపు నైతిక క్షీణత గురించి ఆందోళన పడేవారిని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని జిల్లా మేజిస్ట్రేట్‌ పరోక్షంగా బెదిరించారు. మెడికల్‌ కాలేజ్‌ హాస్పటల్లో డాక్టర్లు ఆమెపై అత్యాచారం జరిగిందని చెప్పి ఆగ్రాలోని ఫోరెన్సిక్‌ లేబ్‌కి కేస్‌ని రిఫర్‌ చేసినప్పటికి, పద్ధతి ప్రకారం వీర్యకణాలు జీవించి ఉండే 3 రోజుల లోపు పరీక్షించకుండా 11 రోజుల తరువాత పరీక్షించి ఇచ్చిన ఫోరెన్సిక్‌ లేబ్‌ రిపోర్ట్‌ని చూపుతూ ‘అసలు అత్యాచారమే జరగలేదు’ అని పోలీసులు బుకాయించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలవారిని, మీడియా వారిని, ప్రజా సమూహాల్ని బాధిత కుటుంబాన్ని కలవ నివ్వకుండా కర్కశంగా అడ్డగించడం, బాధితుల, మీడియా ప్రతినిధుల ఫోన్లను ట్యాప్‌ చెయ్యడం విచిత్రం. ‘అధికారోన్మాదంతో ప్రవర్తిస్తున్న ప్రభుత్వం పోలీస్‌ వ్యవస్ధను తిరిగి బాగు చేసుకోలేనంతగా నాశనం చేస్తున్నది. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులకు చట్టబద్ధ నియమ నిబంధనల పట్ల గౌరవం లేదని రుజువయింది’ అంటూ కొంతమంది బాధ పడుతున్నారు. దేశం వందేళ్ళు వెనక్కుపోతుందని వాపోతున్నారు. అయితే, ఇది ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదనేది గుర్తించాల్సిన అంశం. 


జాతీయ నేర నమోదు సంస్ధ తన వార్షిక నివేదికలో 2018 లో కంటే 2019 లో స్త్రీలపై లైంగిక అత్యాచారాలు 7.3 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ గణాంకాలు నమోదైన నేరాలకు సంబంధించినవి మాత్రమే. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం ప్రతి 16 నిమిషాలకు భారతదేశంలో ఎక్కడో ఒక చోట ఒక మహిళ అత్యాచారానికి గురవుతోంది. 2019 లో సగటున రోజుకి 88 రేప్‌ కేసులు నమోదయ్యాయి. లైంగిక నేరాలలో అత్యధిక భాగం ఫిర్యాదుకు నోచుకోవు. పోలీస్‌ వ్యవస్ధ, న్యాయ వ్యవస్ధ జెండర్‌ సెన్సిటివిటీతో వ్యవహరించకపోవడం వలన కొన్ని సందర్భాల్లో బాధిత స్త్రీలనే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతూంది.


మరొక అతి ముఖ్యమైన అంశం మొత్తం నమోదైన 32, 033 రేప్‌ కేసుల్లో 11 శాతం దళిత మహిళలపై జరుగుతున్నాయి. లైంగిక అత్యాచారాల విషయంలో కూడా పట్టణ - గ్రామీణ, సంపన్న- పేద, అగ్రవర్ణ - దళిత, గిరిజన, అక్షరాస్య - నిరక్షరాస్య మొదలైన అంశాల ప్రాతిపదికన సమాజం, మీడియా స్పందన ఉంటున్నదని కొంతమంది వాపోతున్నారు. స్త్రీల అక్షరాస్యత తక్కువ ఉన్న ‘బిమారు’ రాష్ట్రాల్లో ఎంత ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయో, స్త్రీల అక్షరాస్యత అత్యధికంగా ఉన్న కేరళలో కూడా అంతే ఎక్కువగా అత్యాచారాలు జరగడం మరో వైరుధ్యం. 


ఎంత పెద్ద నేరం చేసినప్పటికీ తప్పించుకోవడం సులభమనే ధిలాసా ఉన్నప్పుడు అత్యాచారం చెయ్యడానికి ఏమాత్రం జంకు ఉండదు. ఇలాంటి ఘోరఘటనలు జరిగినప్పుడు నేరస్థులని ఉరి తీయాలని, షూట్‌ చేసి పారెయ్యాలని ప్రజలు ఆగ్రహంతో డిమాండ్‌ చేస్తున్నారు. రేపిస్టులకు కఠినాతికఠినమైన శిక్షల్ని విధించడానికి వీలుగా తగిన చట్టాల్ని చెయ్యాలని కోరుతున్నారు. నిజానికి ప్రస్తుతం ఉన్న చట్టాల్ని సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది. కఠిన చట్టాలు లేకపోవడం కాదు, ఉన్న వాటిని పటిష్టంగా అమలు పరచకపోవడమే అసలు సమస్య. 


మన దేశంలో అధికార దుర్వినియోగం అనేది కొత్త విషయం కాదు. బాధితుల్ని రక్షించాల్సిన వ్యవస్థలు అత్యంత దుర్మార్గంగా, నిర్లజ్జగా నిందితులకు కాపుకాయడం, వారిని తప్పించడానికి సర్వ ప్రయత్నాల్నీ చెయ్యడం, అత్యాచార బాధితులు తప్పు చేసిన వారిలాగా సిగ్గుతో దాక్కుని బ్రతుకుతూండగా, నిందితులు శిక్ష తప్పించుకుని బోర విరుచుకుని సమాజంలో తిరగడం, ఒకవేళ జైలుకు వెళ్ళినప్పటికి స్వల్పకాలంలోనే జైలు నుంచి బయటపడడం, వారికి హారతులతో, మేళతాళాలతో జైలు నుంచి స్వగృహం దాకా ఘన స్వాగతం లభించడం.. ఇవన్నీ మన అనుభవంలోకి వచ్చినవే కదా! మనం అధునికానంతర కాలంలో, నాగరిక సమాజంలో, వైఙ్ఞానిక చారిత్రక దశలో, ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్ధలో బతుకుతున్నామా లేక మధ్య యుగాల సమాజంలో బతుకుతున్నామా అని తర్కించుకునే సందర్భాలెన్నో!


మహిళల జీవితాలకు, గౌరవానికి, స్వేచ్ఛకు రవ్వంత విలువ కూడా లేని సమాజంలో ఏ మానవతా ధర్మాలు మనగలుగుతాయి? స్త్రీలకు విలువ, గౌరవం ఇవ్వడంలో, మౌలిక మానవ హక్కుల్లో భాగంగా వారి జీవించే హక్కును నిలబెట్టడంలో ఈ దేశపు వైఫల్యం అత్యంత విషాదకరం. పాలనాపరమైన, సామాజికపరమైన రుగ్మతలకు మందు సమష్టి ప్రజా చైతన్యం, సమష్టి పోరాటమే. శకలాలుగా విడిపోయి స్పందించడం కానేకాదు. 

 డా.ఆలూరి విజయలక్ష్మి

Updated Date - 2020-10-20T09:11:23+05:30 IST