Advertisement
Advertisement
Abn logo
Advertisement

మిడ్‌నైట్‌ డెవిల్స్‌

ఆంధ్రజ్యోతి(15-09-2020)

భారీ మనిషి గుండెల మీద కూర్చున్నట్టు ఛాతీ బరువెక్కుతుంది, శ్వాస బిగపడుతుంది! ఊపిరి ఆడదు, మాట పెగలదు! ముంచుకొచ్చే గుండెపోటు ప్రధాన లక్షణమిది! అర్థరాత్రుళ్లు హఠాత్తుగా నిద్రలేపే ఇలాంటి మరికొన్ని సమస్యలూ లేకపోలేదు! నిర్లక్ష్యం చేస్తే రాత్రికి రాత్రే ప్రాణాలు హరించే ఇలాంటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు!


గుండె గుభేలు 

మన శరీరంలో రెండు రకాల నాడీ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి ఎక్కువ మెలకువగా ఉంటే, మరొకటి తక్కువ మెలకువలో ఉంటూ శరీరం మీద పట్టు కోల్పోకుండా మనల్ని అప్రమత్తంగా ఉంచుతాయి. అయితే రాత్రుళ్లు గాఢ నిద్రకు ముందు ఉండే ఆర్‌.ఐ.ఎమ్‌ (ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌) స్థితి, కలత నిద్రలో సింపథెటిక్‌ నాడీ వ్యవస్థ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల్లో హెచ్చుతగ్గులు జరిగి, రక్తనాళాలు కుంచించుకుపోతాయి.


అలా గుండెకు లేదా మెదడుకు జరిగే రక్తప్రసారంలో అడ్డంకి ఏర్పడి అర్థరాత్రి రెండు నుంచి ఉదయం ఆరు గంటల మధ్య, లేక ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య గుండెపోట్లు సంభవిస్తూ ఉంటాయి. మరికొందరిలో రక్తపోటు పెరిగి, మెదడులో రక్తం గడ్డకట్టి బ్రెయిన్‌ స్ట్రోక్‌ తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా అప్పటికే రక్తనాళాల్లో అడ్డంకుల సమస్యతో బాధపడేవారికి రెట్టింపు ప్రమాదం ఉంటుంది. 50 ఏళ్లు పైబడినవాళ్లు, స్థూలకాయులు, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నవారు, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి అర్థరాత్రి సమయం క్లిష్టమైనది. 


యాసిడ్‌ రిఫ్లక్స్‌ 

ఛాతీలో నొప్పితో కూడిన ఈ సమస్య పడుకునే భంగిమను బట్టి అర్థరాత్రుళ్లు వేధిస్తుంది. ఆహారనాళం, పొట్టకు మధ్యలో ఉండే ఓ వాల్వ్‌, రాత్రి నిద్రలో వదులవుతుంది. దాంతో పొట్టలోని యాసిడ్లు గొంతులోకి తన్నుకొస్తాయి. ఫలితంగా ఆహారనాళం డ్యామేజీ అవుతూ ఉంటుంది. ఇలా ఛాతీలో నొప్పితో మొదలయ్యే యాసిడ్‌ రిఫ్లక్స్‌ సమస్య గుండెపోటును తలపిస్తుంది.


అదే విధంగా నిజమైన గుండెనొప్పిని కూడా యాసిడ్‌ రిఫ్లక్స్‌గా పొరబడే ప్రమాదం కూడా ఉంది. గుండెనొప్పిని అసిడిటీగా పొరబడి మాత్ర వేసుకుని, నిద్రలో ప్రాణాలు కోల్పోయిన వారూ ఉంటారు. కాబట్టి అర్థరాత్రి ఛాతీనొప్పి మొదలైతే వెంటనే వైద్యులను సంప్రతించడం మేలు!


అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా 

ఊబకాయం ఉన్నవారికి గొంతులో ఉండే కొవ్వు కారణంగా రాత్రుళ్లు నిద్రలో శ్వాసనాళం మూసుకుపోతుంది. గురక సమస్య ఉండే స్థూలకాయుల్లో ఈ సమస్య అత్యంత ఎక్కువ. ఈ సమస్య ఉన్నవారి రాత్రుళ్లు శ్వాసనాళం కుంచించుకుపోవడం మూలంగా లోపలికి వెళ్లే ఆక్సిజన్‌ తగ్గడంతో పాటు బయటకు రావలసిన కార్బన్‌డయాక్సైడ్‌ ఆగిపోతుంది.


ఇలా దీర్ఘకాలం పాటు జరిగితే ప్రధాన అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. పైగా ఇలా గొంతులో కొవ్వు అడ్డుపడి శ్వాసనాళం మూసుకుపోవడం మూలంగా హఠాత్తుగా శ్వాస ఆగిపోయి ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంది. కాబట్టి భారీకాయం ఉన్నవాళ్లు, గురకతో ఇబ్బందులు పడేవారు అధిక బరువును తగ్గించుకుని, రాత్రుళ్లు స్లీప్‌ యాప్‌ను ఉపయోగించాలి. 


హైపోగ్లైసీమియా 

మధుమేహులకు అర్థరాత్రి రెండు నుంచి ఉదయం ఆరు గంటల మధ్య రక్తంలో చక్కెర స్థాయి హఠాత్తుగా పడిపోతుంది. ఈ హైపోగ్లైసీమియా తలెత్తినప్పుడు స్పృహ కోల్పోవడం, అయోమయానికి లోనవడం, గాభరాపడిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు చక్కెరను స్థిరం చేయడం కోసం వెంటనే తీపి తినిపించాలి. 


- డాక్టర్‌ కె.శశికిరణ్‌ జనరల్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...