మీకు జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు వస్తే పారాసిటమాల్ వేసుకుంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!.. బిపి.. గుండెపోటు ముప్పు పొంచి ఉన్నట్లే..

ABN , First Publish Date - 2022-02-10T06:01:11+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచంలో వ్యాపించిన నేపథ్యంలో ప్రజలు ఆహార అలవాట్లు.. మందుల గురించి ఒక అవగాహనకు వచ్చారు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో కరోనా కాలంలో ఎక్కువగా పారాసిటమాల్ విక్రయం జరిగిందని తేలింది. పారాసిటమాల్ మెడిసిన్ భారత దేశంలో డోలో అనే పేరుతో ప్రాచుర్యంలో ఉంది..

మీకు జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు వస్తే పారాసిటమాల్ వేసుకుంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!.. బిపి.. గుండెపోటు ముప్పు పొంచి ఉన్నట్లే..

కరోనా మహమ్మారి ప్రపంచంలో వ్యాపించిన నేపథ్యంలో ప్రజలు ఆహార అలవాట్లు.. మందుల గురించి ఒక అవగాహనకు వచ్చారు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో కరోనా కాలంలో ఎక్కువగా పారాసిటమాల్ విక్రయం జరిగిందని తేలింది. పారాసిటమాల్ మెడిసిన్ భారత దేశంలో డోలో అనే పేరుతో ప్రాచుర్యంలో ఉంది. మార్చి 2020 నుంచి అమ్మకాల పరంగా డోలో 650 తిరుగులేకుండా దూసుకుపోతోంది.


సాధారణంగా తలనొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు వస్తే పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటాం. కానీ కొంత మంది ఏ మాత్రం ఒంట్లో నలతగా ఉన్నా డోలో 650 లేదా ఇతర పారాసిటమాల్ బ్రాండ్లు వేసుకుంటారు. ఇలా అలవాటు చేసుకోవడం ప్రమాదకరం అని పరిశోధకులు అంటున్నారు. ఇష్టం వచ్చినట్లు డోలో ట్యాబ్లెట్‌ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. 


తాజా స్కాట్ ల్యాండ్‌లో జరిగిన ఒక అధ్యయనంలో రోజూ పారాసిటమాల్ తీసుకునేవారికి రక్తపోటు(బిపి), గుండెపోటు వచ్చే ప్రమాదమందని తేలింది. ఈ అధ్యయనంలో 110 మంది రక్తపోటు ఉన్న రోగులు పాల్గొన్నారు. వీరిని రెండు గ్రూపులుగా చేసి.. ఒక గ్రూపు వారికి ఏడు రోజులపాటు రోజూ నాలుగు సార్లు 1000mg పారాసిటమాల్ ఇచ్చారు. మరొక గ్రూపు వారికి ఏమీ ఇవ్వలేదు. ఇలా వారం రోజుల తరువాత రెండో గ్రూపు వారికి పారాసిటమాల్ 1000mg ఇచ్చి.. మొదటి గ్రూపు వారికి ఏ మందులూ ఇవ్వలేదు. ఆ తరవాత వారి ఆరోగ్యంలో మార్పులు జరిగినట్లు పరిశోధకులు గమనించారు. ప్యారాసెటమాల్ తీసుకున్న వారిలో నాలుగు రోజుల్లోనే రక్తపోటు పెరగడాన్ని గుర్తించారు. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పును 20 శాతం పెంచుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు.


‘‘ఐబూప్రోఫెన్ వంటి మాత్రలకు ప్యారాసెటమాల్ సురక్షిత ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం ఉంది. తాజా ఫలితాల నేపథ్యంలో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మప్పు ఉన్న వారికి ప్యారాసెటమాల్ ఇవ్వకపోవడాన్ని పరిశీలించాలి’’ అని ఎడిన్ బర్గ్ యూనివ్సిటీ ప్రొఫెసర్ వెబ్ అన్నారు.


నిజానికి డోలో ట్యాబ్లెట్‌ను కూడా డాక్టర్ల సూచన మేరకే తీసుకోవాలి. అయితే చాలామంది నేరుగా మెడికల్‌ షాప్‌కి వెళ్లి ట్యాబ్లెట్‌ తెచ్చుకొని చాక్లెట్లలా వేసేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు డోలో ట్యాబ్లెట్‌ వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయని ఇటీవలే డాక్టర్లు వెల్లడించారు. 650 ఎమ్‌జీ అంటే చాలా ఎక్కువ డోస్‌తో కూడుకున్న ట్యాబ్లెట్. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే కడుపులో వికారం కలుగుతుంది. అలాగే కొందరిలో లోబీపీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక తల తిరగడం, నీరసంగా అనిపించడం, నిద్రమత్తుగా ఉండడం, మల బద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి.


డోలోను ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే కొందరిలో మలబద్దకం, స్పృహ తప్పిపోతున్నట్లు భావన కలుగుతుంది. అలాగే నోరు పొడిగా మారిపోతుంది. కొందరిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. మరీ పరిమితి మించితే ఇంకా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.


కొందరిలో గుండె కొట్టుకునే వేగం పెరగడం, నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జ్వరంగా అనిపించగానే డాక్టరు చెప్పిన విధంగానే డోలో లేదా పారాసిటమాల్ తీసుకోవడం ఉత్తమమని పరిశోధకులు సూచించారు. అలాగే ఎలాంటి సమస్యలొచ్చినా ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమమని వారు చెబుతున్నారు.


Updated Date - 2022-02-10T06:01:11+05:30 IST