గుండెపోటుతో ఎక్కువ ప్రమాదం మహిళల్లోనే..

ABN , First Publish Date - 2022-03-15T18:51:45+05:30 IST

పురుషులతో సమానంగా

గుండెపోటుతో ఎక్కువ ప్రమాదం మహిళల్లోనే..

ఆంధ్రజ్యోతి(15-3-2022)

పురుషులతో సమానంగా మహిళల్లోనూ గుండె జబ్బులు పెరుగుతున్నాయి. మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో గుండె జబ్బుల తీవ్రత ఎక్కువ. ఈ వయసు మహిళల్లో గుండె జబ్బులకు హైపర్‌టెన్షన్‌, మధుమేహం, అధిక బరువులు అదనపు కారణాలుగా మారుతున్నాయి. 


లక్షణాలు

గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. అలాగే గుండె పోటు తర్వాత హార్ట్‌ ఫెయిల్యూర్‌కు గురయ్యే అవకాశాలు కూడా వీరిలోనే ఎక్కువ. ఇందుకు కారణం మహిళలు ఆలస్యంగా గుండె సమస్యలను గుర్తించడమే! సాధారణంగా పురుషుల్లో మాదిరిగా మహిళల్లో గుండె జబ్బు లక్షణాలు స్పష్టంగా బయల్పడవు. వీరిలో ఛాతీ నొప్పికి బదులుగా, ఊపిరి అందకపోవడం, వాంతులు, దవడ నొప్పి, చేయి నొప్పి, చమటలు ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. వీటిని సాధారణంగా ఇతరత్రా నొప్పులుగా నిర్ల్యక్షం చేసి, ఆలస్యంగా వైద్యులను సంప్రతించడం వల్ల గుండెకు ఎక్కువ నష్టం జరిగిపోతూ ఉంటుంది. గుండెను కాపాడుకోవాలంటే... గుండె జబ్బులను నివారించుకోవాలంటే, మహిళలు తమ కుటుంబ చరిత్ర, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. 


రిస్క్‌: కరొనరీ లేదా ఇస్కిమిక్‌  గుండె జబ్బులు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి. తల్లితండ్రులకు గుండె జబ్బులుంటే, వారి పిల్లలకూ గుండె జబ్బులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కోవకు చెందిన మహిళలు కొంత అప్రమత్తంగా ఉండాలి. వయసు, అలవాట్లు, రుగ్మతలను లెక్కించాలి. కొలెస్ట్రాల్‌ పరిమాణం, అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన ఆరోగ్య సమస్యల మీద ఓ కన్నేసి ఉంచాలి. అవసరం మేరకు వైద్యుల సూచన మేరకు చికిత్సను కొనసాగిస్తూ ఉండాలి.  


అంకెల లెక్కలు: శరీర బరువు, నడుము చుట్టుకొలతలను గమనించుకుంటూ ఉండాలి. ఆ కొలతల అంకెలు పెరుగుతుంటే, అప్రమత్తం కావాలి. రక్తపోటు, చక్కెర, కెలెస్ట్రాల్‌ మోతాదులను కూడా కొలుచుకుంటూ ఉండాలి. ఆ అంకెలు పెరుగుతూ ఉంటే, తగ్గించే చర్యలు చేపట్టాలి.   


వ్యాయామం: వారానికి 150 నిమిషాల మధ్యస్త ఏరోబిక్‌ వ్యాయామం, లేదా 75 నిమిషాల తీవ్రతతో కూడిన ఏరోబిక్‌ వ్యాయామం చేయడం అవసరం. మొత్తంగా వారంలో ఐదు రోజుల పాటు రోజుకు కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా నచ్చిన వ్యాయామం చేయవచ్చు. దీన్లో భాగంగా బ్రిస్క్‌ వాకింగ్‌ (వేగంగా నడవడం), రన్నింగ్‌, జాగింగ్‌, ఈత, డాన్సింగ్‌ చేయవచ్చు. 


ఆహారం: తక్కువ ఉప్పు, కొవ్వులు, ఎక్కువ పీచు, కూరగాయలు, పళ్లు తీసుకోవాలి. తీపి పదార్థాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం, ఎర్రని మాంసం మానేయాలి.  


బరువు: అధిక బరువు గుండె జబ్బులకు దగ్గరి దారి. బాడీ మాస్‌ ఇండెక్స్‌ 25 దాటినా, నడుము చుట్టుకొలత 35 అంగుళాలకు మించినా గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ కొలతలను తగ్గించే పనులు మొదలుపెట్టాలి. క్రమం తప్పక వ్యాయామం చేస్తూ, సమతులాహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన శరీర బరువుకు చేరుకోవాలి.


ఒత్తిడి: కొలిచే వీలు లేని ఒత్తిడి గుండె మీద ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడికి గురి కాకుండా ఉండడం అసాధ్యం కాబట్టి దాన్ని తగ్గించే మెలకువలు పాటించాలి. యోగా, ధ్యానం సాధన చేయడం లేదా ఇష్టమైన అభిరుచిని కొనసాగించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.


జీవ గడియారం: గుండె ఆరోగ్యం కోసం కంటి నిండా నిద్ర తప్పనిసరి. అస్తవ్యస్థ నిద్ర వేళలు, తక్కువ గంటల పాటు నిద్రపోవడం మొదలైన అలవాట్ల మూలంగా రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి నిద్రవేళలను కచ్చితంగా పాటించడంతో పాటు, రాత్రి 9 తర్వాత అన్ని రకాల స్ర్కీన్‌లకు గుడ్‌ బై చెప్పాలి.   


మందులు: గుండెజబ్బులకు దారి తీసే, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, థైరాయిడ్‌ మొదలైన రుగ్మతలకు వైద్యులు సూచించే మందులను క్రమం తప్పక వాడాలి. ఆ మందుల పేర్లనూ, మోతాదులనూ గుర్తు పెట్టుకోవాలి. ఎంత కాలం వాడాలి? ఎప్పుడు వైద్యులను కలవాలి? అనే వివరాలను డైరీలో రాసి పెట్టుకోవాలి. ఇలాంటి అలవాట్ల వల్ల చికిత్సకు ఆటంకం ఏర్పడకుండా ఉంటుంది.

Updated Date - 2022-03-15T18:51:45+05:30 IST