వినండి, నేర్చుకోండి, నడిపించండి

ABN , First Publish Date - 2021-05-18T06:02:01+05:30 IST

మోదీ గారూ, ఆత్మ దిగ్భ్రమ నుంచి బయటపడండి. విషాదం జాలువారే ఆ బహదూర్ షా జాఫర్ గెడ్డాన్ని వదిలించుకోండి. ప్రపంచమంతా మిమ్మల్ని ఎలా చూస్తోందనుకుని అనుకుంటున్నారో ఆ భ్రమల్ని వదిలించుకోండి....

వినండి, నేర్చుకోండి, నడిపించండి

మోదీ గారూ, ఆత్మ దిగ్భ్రమ నుంచి బయటపడండి. విషాదం జాలువారే ఆ బహదూర్ షా జాఫర్ గెడ్డాన్ని వదిలించుకోండి. ప్రపంచమంతా మిమ్మల్ని ఎలా చూస్తోందనుకుని అనుకుంటున్నారో ఆ భ్రమల్ని వదిలించుకోండి. వినండి. నేర్చుకోండి. నడిపించండి. లేదా ప్రజల వైపు, వాస్తవం వైపు తల పూర్తిగా తిప్పగలిగే మరొకరిని ఆ పని చేయనివ్వండి.


ప్రపంచం ఒక విశ్వగురువును చూడడం లేదు. అసలు ఏ గురువునూ చూడడం లేదు. ప్రపంచం ఎవరి గురించి ఎటువంటి శ్రద్ధా చూపడం లేదు. ఎవరి గురించీ ఎటువంటి జాగ్రత్తా పడడం లేదు. ఎందుకంటే భారత్‌లో ట్విటర్, వాట్సాప్ నాటకాలకు ఆవల ప్రపంచం ఇంకా సజీవ చైతన్యశీల మనుగడలో ఉంది.


ఆయన కనులు క్షణకాలం మీ కళ్ళతో కలుస్తాయి. కొసల చివరి నుంచి మిమ్ములను ఇలా వీక్షించిన వెంటనే ఎదురుగా ఉన్న అధికారిక ఫొటోగ్రాఫర్‌ వైపు తిరిగిపోతాయి. మిమ్ములను కనీసం గమనించినట్టుగా కూడా ఆయన తలపంకించరు. ఆయనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రస్తావిత క్షణాల వేళ ఆయన అమెరికాలో ఉన్నారు. భారతీయులను కలుసుకుంటున్నారు. సదా ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల్లోనే కదా ఆయన! 


ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. కెమేరా మాత్రం ఆయన మానసంలోని ప్రధాన కేంద్రంలోనే నిలిచిఉంటుంది, నిరంతరం! మరి అప్పుడు కెమేరాతో ఆయనకు బంధం ఏమిటి? అది అన్నదాతా?! కాదు, ఆయన పెద్దగా తినరని సన్నిహితులు అంటారు. కానీ, ఒక పరిచితుడిని చూసి చేసే చిరుమందహాసం నుంచి అతిపెద్ద స్టేడియంలో జరిగే సభా వేడుక దాకా కెమేరాయే ఆయన దృష్టిని ఆవరించుకుని ఉంటుంది. కెమేరాతో ఆయన బాంధవ్యం అంతేనా? కాదు, అంతకంటే ఎక్కువే. అది, బహుశా, ఆయనకు ఓటుదాత, ఓట్ల ప్రదాయిని.


ఆరు సంవత్సరాలు, కాదు, దాదాపు ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. అనేక ఎన్నికలు జరిగాయి. అసంఖ్యాక ఓట్లు పడ్డాయి, లెక్కింపులు జరిగాయి. వాటిని సొంతం చేసుకున్నారు, ఉత్సవాలు జరుపుకున్నారు. అనేక మంది ఆయనకు అనుకూలం. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించవచ్చు గాక. అయితే జాతి ఆయన వెంటే–అది ఆయనది. బ్యాలెట్-దాతాసుఖీభవ!


అయినా, ఓట్లను మించినదేదో ఆయన మనస్సును పని చేసేలా పురిగొల్పుతోంది. మీడియా, అధికారం ఎప్పుడూ కలిసికట్టుగా ఉంటాయి. దూరదర్శన్‌ను తొలిరోజుల్లో దేవీ దర్శన్ అని అనేవారు కదా. అయితే ఇక్కడ రసస్పందనలు, భావగరిమలు మరింత ఆలోచనాపూర్వకమైనవి, మరింత సంక్లిష్టమైనవి. ఎందుకంటే అవి ఒక శూన్యాన్ని పూరించి తీరాలి. అది ఎంత పెద్ద శూన్యమో దాని అవధులు ఏ మేరకు ఉన్నాయో అనేది ఇప్పుడు మాత్రమే స్పష్టమవుతోంది. కెమేరా, వేదిక, ఆలయం. ప్రతిదాన్నీ త్యాగం చేయాలి. ఈ జాతి నిర్మాణానికి కారణమైన త్యాగాగ్నిని ప్రధాని మోదీ పునరుద్ధరిస్తారు. సింధు నాగరికతలోని పూజారి- రాజు దగ్గర నుంచి కాశీ రాజు-పురోహితుడు దాకా, తన పేరు లాంటి నామ ధేయమున్న ఒక ఆధునిక సన్యాసి స్ఫూర్తితో, ఒక పురాతన రుషిని ఆదర్శంగా తీసుకుని అనుసరించదలుచుకున్నారు.


మోదీ తన ప్రజలకు ప్రతి దాన్నీ ఇస్తారు... రుషి దధీచి వలే తన ఎముకలను సైతం దానం చేస్తారు. ఈ త్యాగస్ఫూర్తినే ఆయన తన తొలి పుస్తకం ‘జ్యోతిపుంజ్’లో వివరించారు. తనను ఉత్తేజపరిచిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పెద్దలకు నివాళే ఆ పుస్తకం. మానవాళి మహోదాత్తతలో ఇంత దృఢవిశ్వాసంతో ఉన్నప్పుడు తప్పు ఏమైనా జరుగుతుందా? అయినా జరిగిన తప్పు ఏమిటి? బహుశా ఆయన ఇలా ఆలోచిస్తుండవచ్చు. 


ఇది కురుక్షేత్రం. కాని కృష్ణుడు గానీ, అర్జునుడు గానీ ఇక్కడ లేరు. మనకు మిగిలింది అభాగ్యుడు, మూర్ఖుడు, తానే నిజమైన కృష్ణుడునని భ్రమించే పుండ్రరాజు మాత్రమే! గతించిన రోజుల్లో అసలు వ్యక్తి సదా తమతో ఉంటాడని, ఉన్నాడనే ఎరుకతో హాయిగా, సంతృప్తిగా, భరోసాతో ఉండేవారు.. అతడు వారి మధ్యనే ఉండేవాడు. ఆవుల మధ్య ఉండేవాడు, గుర్రాలు, రథాలను అధిరోహించి సంచరిస్తుండేవాడు. యుద్ధగాయాలతో రాటు దేలిన దేహం, అన్నిటినీ చూసే కళ్ళతో అతను వారి సొంతమనిషిలా ఉండేవాడు. కృష్ణుడు కృష్ణుడే. బూటకపు వాసుదేవుడో? సరి సరి... ఇదుగో కురుక్షేత్రం ఇక్కడే ఉంది- ఆకాశం నుంచి నగరాల మీదుగా కురుక్షేత్ర పవనాలు పలాయనం చిత్తగిస్తున్నాయి. నల్లని, రుధిరోష్ణ బాణాలు ఎల్లెడలా కన్పిస్తున్నాయి. నేలను, నదులను, పర్వతాలను, అడవులను తవ్వుతున్నారు, తొలుస్తున్నారు.. మానవ సంబంధితమని మనం అనుకుంటున్న ప్రతిదీ అంతిమ అవమానం పొందుతోంది. మన ఆప్తుల ఆత్మీయుల నాసికాపుటాల నుంచి ప్రాణవాయువు ఎక్కడికో వెళ్ళిపోతోంది... ఓ క్రూరకాలమా.... ఓ కృష్ణా, ఓ పరమాత్మా... వేడికోలును విన్నవారు లేరు. మరి పట్టించుకునేవారు ఎవరు?


మొదటి నుంచీ కెమేరాతో సహజీవనం చేసిన వ్యక్తి ఇప్పుడు దానితోనే నగ్నంగా బహిర్గతమయ్యాడు. ఇప్పుడు, అదే ఆయనపై నిర్ణయాలు తీసుకుంటోంది, తీర్పులు వెలువరిస్తోంది. వాస్తవం స్పష్టంగా ఉంది. దాన్ని మరెవరూ ఇంకా స్పష్టంగా చెప్పవలసిన అవసరం లేదు. విరిగిన గడియారం రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని సూచించినట్టుగా ఆయన విమర్శకులు ఇంతకు ముందు ఏమేమి చెప్పినప్పటికీ, ఒకప్పుడు వారి అబద్ధాలు ఎలా ఉన్నపటికీ, ఇప్పుడు సత్యం వారి పక్షాన ఉన్నట్టుగా కన్పిస్తోంది! కెమేరాతో జీవించిన వ్యక్తి ఇప్పుడు కెమేరా ఉపేక్షకు గురవుతున్నాడు‌. అది మరో వ్యక్తికి ప్రాధాన్యమిస్తోంది. ప్రజలను ప్రజలుగా చూసేందుకు కెమేరా సమక్షం నుంచి దూరంగా రాలేని వ్యక్తి ఇప్పుడు కెమేరాలు తన వైపు చూడడం లేదనే సత్యాన్ని కనుగొన్నాడు. కెమేరాల ముందు ఇప్పుడు ఒకే ఒక అగ్ని ఉంది, శ్మశానభూమి మంటలు! బహుశా, తన ఉపకరణాలను ఆయన గట్టిగానే పట్టుకుని ఉన్నారు.


ప్రభుత్వ సమాచార, ప్రసార వ్యవస్థ, డిజిటల్ మేనేజ్‌మెంట్ సేవలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. సరే ట్విటర్ అనుయాయులు అసంఖ్యాకం. వారి ఎదుట, వారి గురించిన భావన వెలుగులో ఆయన ఇప్పటికీ- కనీసం స్వీయ దృష్టిలో ఒక త్యాగధనుడు అయిన రుషిగా, ఒక సన్యాసిగా, ఒక ఫకీర్‌గా, ఒక సేవకుడుగా తనను తాను భావించుకుంటున్నారు. ఆ విధంగా మాత్రమే ఆయన తనను తాను దర్శించుకుంటున్నారు. భ్రమ సామాజికం. ఆత్మ మోహభావం ఒక మత్తుమందు. మెస్సయ్య రాక ఒక కట్టుకథ. లోకాన్ని ఆకట్టుకునేందుకు కేవలం పిల్లలవలే అనేకానేక వ్యాఖ్యలు పోస్ట్ చేయడం ఆయనలోని ఒక ఆరాటాన్ని సూచిస్తుంది. అయితే నాటి మహశక్తిమంతులైన మహారాజాలు ఏమయ్యారు? కోట్లాదిమంది తమను చూసి తరించాలని, గౌరవించాలని వారు కోరుకోలేదూ? అటువంటి దృష్టిని, ఆలోచనను, ఆరాటాలను ఆంతరీకరించుకున్న శిరస్సు ఏమయింది? 


అంతర్వాణి మహాఘోష అయింది. అభినయ మహాతారలు, ఆత్మస్తుతి పరాయణులు.. అయితే ఆ కెమెరా తమను చూడ నిరాకరించి మరో వైపుకు తిరిగినప్పుడు అందరూ భంగపడతారు. కచ్చితంగా ఒకనాటికి పతనమైతీరుతారు. శిరస్సు లోపలి వాణి మాత్రమే, హృదయంలోని గుసగుస మాత్రమే మిగిలి ఉంటాయి. సరే, ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ హృదయం చెప్పేది ఏమిటి? అనృతమే నిజంగా సత్యమనే వైఖరితోనే అది ఇంకా ఉన్నదా? 


అబద్ధాన్ని అబద్ధంగా బయట నుంచి పిలవడం చాలా సులువు. ఆయన గురించి అసత్యం చెప్పడమూ తేలికే. ఒక జాతి అయన విషయంలో మళ్ళీ మళ్ళీ ఇదే చేసింది. మన ఆత్మ లోని అనృతం విషయమేమిటి? భ్రాంతి, స్వాతిశయం, నిరాకరణలు, కాపట్యాలు హిమసంపాతంలా పడుతున్నాయి. సర్వత్రా యథార్థం కూలిపోతోంది. మరి ఇప్పుడు ఆ అంతర్వాణి ఏమి చెబుతోంది? ఎడమ వైపు చూడు, కుడి వైపు చూడు. లోకం గుర్తించేలా వ్యవహరించు. అసలు సత్యమేమిటో నిజంగా దానికి తెలుసా? ప్రపంచం ఒక విశ్వగురువును చూడడం లేదు. అసలు ఏ గురువునూ చూడడం లేదు. ప్రపంచం ఎవరి గురించి ఎటువంటి శ్రద్ధ చూపడం లేదు. ఎవరి గురించీ ఎటువంటి జాగ్రత్తపడడం లేదు. ఎందుకంటే భారత్‌లో ట్విటర్, వాట్సాప్ నాటకాలకు ఆవల ప్రపంచం ఇంకా సజీవ చైతన్యశీల మనుగడలో ఉంది. 


‘ప్రపంచ ప్రఖ్యాతి’....ఎక్కడ? ఐక్యరాజ్యసమితి లోనా? అమెరికా లోనా? ఇండియా లోనా? కనీసం భారత్ లోనా? నేస్తం, నిజం చెప్పనా? నీవు కేవలం నీ మస్తిష్కంలో మాత్రమే విశ్వవిఖ్యాతుడివి. మేమందరమూ విశ్వవిఖ్యాతులమే! అలానే నీవూనూ. సామాజిక మాధ్యమాలు ఎవరి వైపు మొగ్గుచూపితే అలా ప్రపంచమూ మనవైపు మొగ్గు చూపుతుంది! అయితే మనం కొత్త లైక్‌లు స్వైప్ చేసే మహా కృషిలో మునిగి ఉంటాం కాదూ??


కానీ, మనలో చాలా మందికి ఈ విశాల ధరిత్రిని అల్లకల్లోలం చేస్తున్న సంక్షోభాన్ని నివారించవలసిన అవసరం లేదు. అటువంటి బాధ్యత ఉందని గుర్తించం. గుర్తించినా పట్టించుకోము. మన పనిలో మనం ఉంటాం. అయితే విశాల ప్రపంచం అలా ఎలా ఉండగలుగుతుంది? జగతిని ఉపేక్షిస్తూ మనం చేసేదేదో చేసేస్తుంటాం. అది ప్రపంచానికి హితకరం కాదు. 


మోదీ గారూ, ఆత్మ దిగ్భ్రమ నుంచి బయటపడండి. విషాదం జాలువారే ఆ బహదూర్ షా జాఫర్ గెడ్డాన్ని వదిలించుకోండి. ప్రపంచమంతా మిమ్మల్ని ఎలా చూస్తోందనుకుని అనుకుంటున్నారో ఆ భ్రమల్ని వదిలించుకోండి. వినండి. నేర్చుకోండి. నడిపించండి. లేదా ప్రజల వైపు, వాస్తవం వైపు తల పూర్తిగా తిప్పగలిగే మరొకరిని ఆ పని చేయనివ్వండి. 




ప్రొ.  వంశీ జూలూరి

(వ్యాసకర్త శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్శిటీలో మీడియా స్టడీస్ ప్రొఫెసర్‌)


                (ది ప్రింట్ సౌజన్యం)

Updated Date - 2021-05-18T06:02:01+05:30 IST